హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో తెలంగాణ ఆర్థిక పరిస్థితి తీవ్ర సంక్షోభానికి గురైంది. పన్నుల ఆదాయం తగ్గడంతోపాటు ఖర్చులు పెరగడంతో ఆర్థిక వ్యవస్థ అష్టకష్టాలను ఎదురొంటున్నది. వాస్తవ ఆదాయాలు 27.85 శాతం ఉండగా, ఆదాయ ఖర్చులు రూ.34.91 శాతానికి పెరిగాయి. 2024 ఆగస్టు నెల కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక ఆధారంగా.. రాష్ట్రం మొత్తం ఆదాయం రూ.91,085.54 కోట్లు కాగా, మొత్తం ఖర్చులు 85,467.75 కోట్లుగా నమోదయ్యాయి. రాష్ట్ర రెవెన్యూ రాబడులు రూ.61,618.60 కోట్లు, మూలధన వసూళ్లు రూ.29,466.94 కోట్లు వచ్చాయి.
రెవెన్యూ వ్యయం రూ.77, 140.22 కోట్లు, మూలధన వ్యయం మొత్తం రూ.8,327.53 కోట్లుగా అంచనా వేయబడింది. 2024 ఆగస్టు చివరి నాటికి రెవెన్యూ లోటు రూ.15,521.62 కోట్లకు చేరగా, ఆర్థిక లోటు రూ.29,449.94 కోట్లకు పెరిగింది. ఈ గణాంకాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షోభాన్ని సూచిస్తున్నాయి. రాష్ట్ర బడ్జెట్లో పేరొన్న వార్షిక లక్ష్యంలో ఐదు నెలల కాలానికి మొత్తం వసూళ్లు 33.24 శాతం కాగా, వ్యయం మాత్రం 33.59 శాతమని కాగ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వార్షిక లక్ష్యంలో వాస్తవ రాబడులు 27.85 శాతం రాగా, వ్యయం 34.91 శాతంగా నమోదైంది. మూలధన వసూళ్ల లక్ష్యంలో 55.79 శాతానికి ఎగబాకగా, మూలధన వ్యయం 24.87 శాతం వద్ద తకువగా నమోదైంది.
ఖర్చులెక్కువ.. ఆదాయం తక్కువ
వడ్డీ చెల్లింపులు, ఉద్యోగుల జీతాలు, వేతనాలు, పెన్షన్లు, సబ్సిడీపై ఖర్చుల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కచ్చిత వ్యయం వార్షిక అంచనాల కంటే గణనీయంగా పెరిగింది. వడ్డీ చెల్లింపులు రూ.10,497.52 కోట్లకు (వార్షిక అంచనాల్లో 59.21%) పెరిగాయి. వేతనాలు రూ.18,152.28 కోట్లకు (45.33%), పింఛన్లు రూ.7,165.65 కోట్లకు (61.55%) పెరిగాయి. రాష్ట్ర నికర రుణాలు, ఇతర రుణ బాధ్యతలు రూ.29,466.94 కోట్లకు (అంటే, వార్షిక అంచనాలలో 59.79%) పెరిగాయి. 2023 డిసెంబర్ నుంచి 2024 మార్చి వరకు గత ఆర్థిక సంవత్సరంలో నికర రుణాలు 11,438.04 కోట్లు కాగా, ప్రస్తుతం 2024-25లో తొలి ఐదు నెలల్లో నికర రుణాలు 29,499.94 కోట్లకు చేరడంతో మొత్తం రుణభారం రూ.40,887.98 కోట్లకు పెరిగింది.
బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడం అనుమానమే..
రాష్ట్రంపై రుణభారం పెరిగిన నేపథ్యంలో మిగిలిన ఆర్థిక సంవత్సరంలో ఆదాయ, ఖర్చుల లక్ష్యాలను చేరుకోవడం అనుమానం గోచరిస్తున్నది. ఎందుకంటే ఆదాయాలను పెంచుకోవడంతోపాటు ఖర్చులనూ తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే పెట్రోలియం ఉత్పత్తులు, మోటర్ వాహన పన్ను, స్టాంప్ డ్యూటీ, ఇతర పన్నులు భారీగానే ఉన్నాయి. వాటిని పెంచడం సాధ్యపడకపోవచ్చు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు.. రాష్ట్ర ఆదాయంపై హైడ్రా ప్రతికూల ప్రభావం చూపుతున్నది. స్టాంప్స్, రిజిస్ట్రేషన్ పన్నుల ఆదాయాలు భారీగా తగ్గాయి.
2024లో ఐదు నెలల (ఏప్రిల్-ఆగస్టు) రాష్ట్ర ఆర్థిక పరిస్థితి