హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఇంటింటికీ స్వచ్ఛమైన నల్లా నీళ్లను సరఫరా చేస్తున్న మిషన్ భగీరథ పథకం మరోసారి జాతీయ స్థాయి గుర్తింపు పొందింది. మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో కేంద్రం ఈ పథకాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని 100% ఇండ్లకు శుద్ధి చేసిన నీటిని నల్లాల ద్వారా సరఫరా చేస్తున్నారని ప్రశంసించింది. తెలంగాణతోపాటు హర్యానా, గుజరాత్, గోవా, పుదుచ్చేరి, డయ్యూడామన్, అండమాన్ నికోబార్ రాష్ట్రాలు మాత్రమే శుద్ధి చేసిన నీటిని ఇంటింటికి సరఫరా చేస్తున్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా సగటున 57% ఇండ్లకు, తెలంగాణలో 100% ఇండ్లకు నల్లా నీళ్లు సరఫరా చేస్తున్నట్టు వెల్లడించింది.
మిషన్ భగీరథకు ప్రశంసల వెల్లువ
సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్షతో చేపట్టిన మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలోని 23,890 గ్రామీణ అవాసాల్ల్లో 53,98,219 ఇండ్లకు నల్లా నీళ్లు సరఫరా చేస్తున్నారు. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.45 వేల కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్రానికి రూ.19 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా కేంద్రం నయా పైసా కూడా విదల్చలేదు. అయితే ఈ పథకాన్ని అనేకసార్లు కేంద్ర ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, అధికారులు, రాజ్యాంగ సంస్థలు ప్రశంసించడం విశేషం. ఈ పథకం అమల్లోకి వచ్చాక తెలంగాణలో ఒక్క ఫ్లోరైడ్ కేసు కూడా నమోదు కాలేదని ఆర్థిక సర్వే ప్రకటించింది.
మిషన్‌భగీరథను కేంద్రం, నీతిఆయోగ్, 15వ ఆర్థిక సంఘంతోపాటు బెంగాల్, బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, కర్ణాటక, ఒడిషా ప్రశంసించాయి.
2016 మే 22న మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ మిషన్ భగీరథ గురించి ప్రస్తావించారు. ప్రజలకు సురక్షిత మంచినీటిని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం గొప్ప ప్రయత్నం చేస్తున్నదని ప్రశంసించారు.
నేషనల్ వాటర్ మిషన్ అవార్డుల్లో 2019 సంవత్సరానికి మొదటి బహుమతి లభించింది.
మౌలిక సదుపాయల కల్పనలో వినూత్నమైన పథకంగా మూడుసార్లు హడ్కో అవార్డు లభించింది.
ఆన్లైన్ పర్యవేక్షణ కోసం మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేసినందుకు 2018లో స్కోచ్ అవార్డ్ లభించింది.
మిషన్ భగీరథ పథకం అమలు తీరును జల్ జీవన్ మిషన్ ద్వారా పరిశీలించిన కేంద్రం.. ‘రెగ్యులారిటీ క్యాటగిరీ’లో తెలంగాణను దేశంలోనే నంబర్ వన్‌గా గుర్తించి జల్ జీవన్ మిషన్ అవార్డుకు ఎంపిక చేసింది.
మిషన్ భగీరథ పథకాన్ని అధ్యయనం చేసేందుకు దేశంలోని 13 రాష్ర్టాల ప్రతినిధులు తెలంగాణలో పర్యటించారు.