Telangana | హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ శుక్రవారం విడుదల కానుంది. శుక్రవారం నుంచి ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఈ నెల 30న పోలింగ్ జరుగనుండగా.. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగనుంది. పోలింగ్ ప్రక్రియ మొత్తం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)ల ద్వారా నిర్వహించనున్నారు. పోస్టల్ బ్యాలట్, ఇంటి వద్ద ఓటు వేసే వారి కోసం సిద్ధం చేసిన బ్యాలెట్ పేపర్ గులాబీ రంగులో ఉండనుంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్లను ఆన్లైన్లో పూర్తిచేసి ఆ దరఖాస్తును రిటర్నింగ్ అధికారికి భౌతికంగా సమర్పించాల్సి ఉంటుంది.
రిటర్నింగ్ అధికారులుగా నియమితులైన ఆర్డీవోలు, అడిషనల్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకు ఇప్పటికే శిక్షణ పూర్తి చేశారు. నామినేషన్ వేయడానికి వచ్చే రాజకీయ పార్టీల కార్యకర్తలు, నాయకులను ఆర్వో కార్యాలయాలకు వంద మీటర్ల దూరంలోనే నిలిపివేయనున్నారు. అభ్యర్థితోపాటు మరో ఐదుగురిని మాత్రమే లొపలికి అనుమతిస్తారు. ఆర్వో కార్యాలయాలంలో సీసీ కెమెరాలు, వీడియో కెమెరాలు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు తమ నామినేషన్, అఫిడవిట్ ఫారాలను సంపూర్ణంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అసంపూర్తిగా ఉంటే ఆర్వో సదరు అభ్యర్థికి నోటీసు జారీచేసి పూర్తి చేయాల్సిందిగా సూచిస్తారు. అప్పటికి కూడా స్పందించకుంటే ఆ నామినేషన్‌ను తిరస్కరిస్తారు. ఇండింపెడెంట్ అభ్యర్థులు ఫ్రీ సింబల్స్‌లో తమకు అనుకూలమైన గుర్తును ఎంపిక చేసుకోవచ్చు. ఒకరి కంటే ఎక్కువ మంది ఒకే గుర్తును కోరుకుంటే లాటరీ విధానంలో కేటాయిస్తారు. అభ్యర్థులు నామినేషన్ వేయడానికి మంచి రోజు కోసం చూస్తున్నారు. ఈనెల 8 నుంచి 10 వరకు మంచి రోజులు ఉన్నాయని సమాచారం. ఈ మూడు రోజుల్లోనే అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
నేటి నుంచే పోస్టల్ ఓటుకు దరఖాస్తు
రాష్ట్రంలో తొలిసారిగా ఇంటి నుంచి ఓటు వేసే సదుపాయాన్ని ఎన్నికల సంఘం దివ్యాంగులకు, 80 యేండ్ల పైబడిన వారందరికి కల్పించింది. అయితే ఇలా ఇంటి వద్దనే ఓటు వేయాలనుకొనేవారు ఈనెల 7వ తేదీలోగా బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్వో) దగ్గర ‘12డీ’ ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వారికి మాత్రమే ఈ సదుపాయం ఉంటుంది. వీరితో పాటుగా 13 అత్యవసర సేవలు అందించే శాఖల సిబ్బంది, ఉద్యోగులు, అధికారులకు పోస్టల్ ఓటు సౌకర్యం కల్పించారు. వీరు ఆయా శాఖల నోడల్ అధికారుల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వీరితో పాటు ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు, అధికారులు, సిబ్బందికి కూడా పోస్టల్ బ్యాలట్ సౌకర్యం కల్పించారు. అయితే గతానికి భిన్నంగా ఈ సారి ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులందరికీ ఓ ఫెసిలిటేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుండగా, వారంతా అక్కడే ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ సారి పోస్టల్ ఓటు హక్కు, ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునే దాదాపుగా 13 లక్షలకు పైగా అర్హులు ఉన్నారు.
ఎన్నికల పరిశీలకుల నియామకం
రాష్ట్రంలో ఎన్నికల పర్యవేక్షణకు కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులను నియమించింది. సాధారణ పరిశీలకులు, పోలీసు పరిశీలకులను నియమిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే 60 మంది వ్యయ పరిశీలకులను నియమించారు. సాధారణ పరిశీలకులుగా ఇతర రాష్ర్టాలకు చెందిర 67 మంది ఐఏఎస్ అధికారులను నియమించారు. శాంతి భద్రతల పరిశీలకులుగా 39 మంది ఐపీఎస్ అధికారులను నియమించారు. వీరు ఈనెల 10 నుంచి రాష్ర్టానికి వచ్చి వారికి కేటాయించిన నియోజకవర్గాల్లో పనిచేయనున్నారు. వీరి ఫోన్ నంబర్లను సైతం ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. ఇతర రాష్ర్టాలకు చెందిన ఒక్కొక్కరిని రెండు నియోజకవర్గాలకు పరిశీలకులుగా నియమించారు.
ఎన్నికల షెడ్యూల్
ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 3
నామినేషన్లు ప్రారంభం నవంబర్ 3
నామినేషన్లకు చివరి తేదీ నవంబర్ 10
నామినేషన్ల పరిశీలన నవంబర్ 13
నామినేషన్ల ఉపసంహరణ నవంబర్ 15
పోలింగ్ తేదీ నవంబర్ 30
ఉదయం 7 గం.ల నుంచి 5 గం.ల వరకు
(13 నక్సల్స్ ప్రభావిత స్థానాల్లో సా.4 గం వరకే )
ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న
మొత్తం ఓటర్లు 3.17 కోట్లు