న్యూఢిల్లీ : ముఖ్యమైన ఎన్నికల చట్టాలు, నిబంధనలను పాటించని మరో 476 రాజకీయ పార్టీలను డీలిస్ట్ చేసేందుకు ఎన్నికల కమిషన్ (ఈసీ) సన్నాహాలు ప్రారంభించింది. తొలి విడతలో 334 పార్టీలను డీలిస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వివిధ రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 476 పార్టీలను రెండో విడతలో డీలిస్ట్ చేయడానికి గుర్తించినట్లు ఈసీ ప్రకటించింది. అనుచితంగా ఏ పార్టీనీ డీలిస్ట్ చేయకూడదనే ఉద్దేశంతో, ఈ పార్టీలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సంబంధిత రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంత చీఫ్ ఎలక్టొరల్ ఆఫీసర్స్‌ను ఆదేశించినట్లు తెలిపింది. తాజాగా డీలిస్ట్ చేసేందుకు గుర్తించిన పార్టీల్లో తెలంగాణ నుంచి 9, ఏపీ నుంచి 17 పార్టీలు ఉన్నట్టు ఈసీ పేర్కొన్నది.
విపక్షం లేకుండానే బిల్లులకు ఆమోదం!
న్యూఢిల్లీ: పార్లమెంట్లో సోమవారం ఒక్కరోజే ఎనిమిది బిల్లులు ఆమోదం పొందడంతో ఇక ప్రతిపక్షాల సహకారం కోసం ఎదురుచూడకుండా తమ బిల్లుల అజెండాను ముందుకు తీసుకువెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు కనపడుతోంది. బీహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పార్లమెంట్లో పదేపదే అడ్డంకులు సృష్టిస్తుండడంతో ఇక బిల్లులకు ఆమోదం పొందేందుకు ముందుకు వెళ్లక తప్పదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సోమవారం తెలిపారు. ఒకే అంశంపై ప్రతి రోజూ పార్లమెంట్ సమయాన్ని వృథా చేయలేమని ఆయన చెప్పారు.