KCR | హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు చేపట్టిన రోడ్డుషోలు, బస్సుయాత్ర సూపర్‌హిట్ అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటికే నాలుగు ఉమ్మడి జిల్లాల్లో సాగిన కేసీఆర్ యాత్రకు జనం పోటెత్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో ఇక ఆ పార్టీ పని అయిపోయిందంటూ ప్రత్యర్థులు ప్రచారం చేశారు.
అలాంటి సమయంలో కేసీఆర్ ప్రజల మధ్యకు వెళ్లడం, ప్రజలు కూడా తెలంగాణ సాధకుడికి మద్దతుగా నిలవడం గమనార్హం. ‘సారు మళ్లీ మీరే రావాలి. మీ పాలనే బాగున్నది’ అంటూ ఎక్కడికక్కడ యువత ప్లకార్డులు పట్టుకొని స్వాగతం పలుకుతున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు చూస్తుంటే, కేసీఆర్ బస్సుయాత్రకు ముందు.. కేసీఆర్ బస్సుయాత్ర తర్వాత అని చెప్పుకోవాల్సిన విధంగా పరిస్థితి మారింది.
అంతటి స్పష్టమైన తేడా కనిపిస్తున్నది. ఇందుకు కారణం ఒకే ఒక్కడు కేసీఆర్! ఆయన చేపట్టిన బస్సుయాత్ర! కేసీఆర్ రంగప్రవేశంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణమే పూర్తిగా మారిపోయింది. కేసీఆర్ పట్ల తెలంగాణ ప్రజలకున్న తిరుగులేని విశ్వాసం, ప్రేమ, అభిమానాన్ని ఎవరూ చెరిపేయలేరని నిరూపితమైంది.
కేసీఆర్ వస్తే తమ పరిస్థితి ఏమిటన్న భయం, బెణుకు కాంగ్రెస్, బీజేపీల్లో మొదలైంది. దీంతో రెండు పార్టీలు కలిసి కుట్రలకు తెరలేపాయి. ఎట్లాగైనా కేసీఆర్ గొంతు వినపడకుండా చేయాలని ప్రయత్నించాయి. ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశాయి. ఫలితమే 48 గంటల ప్రచార నిషేధం! సిరిసిల్లలో పంటలు ఎండిపోయి గోసపడుతున్న రైతులు, ఆత్మహత్యలకు పాల్పడ్డ నేతన్నల కుటుంబాల కోసం కేసీఆర్ చేపట్టిన యాత్రను ఎన్నికల ప్రచారంగా చిత్రీకరించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. వాస్తవానికి సిరిసిల్లలో కేసీఆర్ ఎన్నికలు, ఓట్లు అన్నదే మాట్లాడలేదు. కానీ, విచిత్రంగా కాంగ్రెస్ దీనిపై ఫిర్యాదు చేయడం, ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడం గమనార్హం.
కేసీఆర్ ప్రసంగంలో ప్రస్తావించిన ప్రధాన అంశాలు..
రైతులకు రూ.రెండు లక్షల రుణమాఫీ, పంటలకు రూ.500 బోనస్ ఏమైందని పదే పదే ప్రశ్నిస్తున్నారు. బ్యాంకులు నోటీసులిస్తున్నాయని, రుణమాఫీ ఎందుకు చేయడం లేదని నిలదీస్తున్నారు. ఈ ఒక్క ప్రశ్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి మీద ఒట్టు, యాదాద్రి నరసింహస్వామి మీద ఒట్టు, రామప్ప శివుడి సాక్షిగా చెప్తున్నా.. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతి చోటా చెప్పుకోవాల్సిన పరిస్థితిని కేసీఆర్ కల్పించారు. ఇది కేసీఆర్ ప్రచారం మొదలు పెట్టిన తర్వాత జరిగిన కీలక పరిణామాల్లో ప్రధానమైనది.
గోదావరి నదిని తమిళనాడుకు తరలించే కుట్రలను మొదట కేసీఆరే బయటపెట్టారు. ఇచ్చంపల్లి ద్వారా గోదావరి నీళ్లను గోదావరి-కావేరి నదుల అనుసంధానం ద్వారా తమిళనాడుకు తరలించే కుట్రలను సీఎం రేవంత్‌రెడ్డి ఏ మాత్రం అడ్డుకోవడం లేదని దుయ్యబట్టారు. తమిళనాడు ఓట్ల కోసం తెలంగాణ ప్రజలకు నీళ్లు రాకుండా బీజేపీ ఆడుతున్న రాజకీయ డ్రామా ప్రజలను ఆలోచింపజేస్తున్నది.
బీజేపీకి 200 సీట్లు దాటవని కేసీఆర్ పలుసభల్లో ఘంటాపథంగా చెప్తున్నారు. సంకీర్ణ ప్రభుత్వమే కేంద్రంలో కొలువుదీరుతుందని, కేంద్రంలో బీఆర్ఎస్ కీలకపాత్ర పోషిస్తుందని స్పష్టంచేస్తున్నారు. దేశంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను కేసీఆర్ వివరించారు. ఇది ప్రజల్లో ఆలోచన రాజేసింది. జాతీయ మీడియా సైతం కేసీఆర్ చెప్పిన అంశాల ఆధారంగా ప్రత్యేక కథనాలు ఇస్తున్నది.
‘కాంగ్రెస్ అనేక వాగ్దానాలు ఎగ్గొట్టింది. తులం బంగారం మార్కెట్ల దొరుకుతలేదా? పింఛన్లు రూ.4 వేలకు ఎందుకు పెంచుతలేరు? స్కూటీలు ఇచ్చిండ్రా? కాంగ్రెస్ ఎగవేసిన హామీల గురించి గ్రామాల్లో గీతగీయండి.. నిలదీయండి’ అంటూ కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
తాను తెచ్చిన తెలంగాణ తన కండ్ల ముందే నాశనమవుతున్నదని పలు సభల్లో ఆవేదన వ్యక్తంచేశారు. తన ప్రాణమున్నంత వరకు తెలంగాణను అన్యాయం కానివ్వనని పదేపదే చెప్తున్నారు. కేసీఆర్ వచ్చి అన్నింటిపై కూలంకశంగా వివరించి చెప్పడంతో ప్రజల్లో ఆలోచన మొదలైంది.
‘కరెంట్ కోతలెందుకొచ్చినయి? సాగునీళ్లు, తాగునీళ్లు ఎందుకివ్వడంలేదు? మేమున్నప్పుడు ఎలా వచ్చాయి?’అంటూ కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు. రేవంత్‌రెడ్డికి పాలన చేతకావడంలేదని ప్రజలకు వివరిస్తున్నారు. నాగార్జునసాగర్ కింద గడిచిన పదేండ్లలో ఎలా నీళ్లిచ్చారో, ఇప్పుడెందుకు ఇవ్వడంలేదో రైతులకు వివరించి చెప్పడంతో ప్రజలకు బాగా అర్థమవుతున్నది.
కేసీఆర్ బస్సుయాత్ర ఫలితంగా పలు పార్లమెంట్ స్థానాల్లో గెలిచే అవకాశాలు మెరుగుపడ్డాయి. అసలు బీఆర్ఎస్ పోటీలోనే ఉండదని కాంగ్రెస్, బీజేపీలు భావించగా ఏకంగా 12కుపైగా సీట్లలో బీఆర్ఎస్ గెలుస్తుందని సర్వే సంస్థలు నిర్ధారణకు వచ్చాయి. ఇది కాంగ్రెస్, బీజేపీ నేతలను కలవరపెట్టింది. కేసీఆర్ పర్యటనలతో తమకు ఇబ్బందేనని భావించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేయించి ప్రచారాన్ని ఆపించాయి. ఆ రెండు పార్టీలకు కేసీఆర్ బస్సుయాత్ర మింగుడుపడటం లేదు.