ఇది కదా పక్కా ప్రణాళిక అంటే. ఓ వైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నది. 27న ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాకు చెందిన గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగాల్సి ఉన్నది. కోడ్ అమల్లో ఉండగా క్యాబినెట్ భేటీకి ఈసీ అనుమతించదని తెలుసు. అయినా సరే క్యాబినెట్ భేటీ అంటూ ప్రభుత్వం హంగామా చేసింది. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, వానకాలం పంటల ప్రణాళికతోపాటు రైతులకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నట్టు అనుకూల మీడియాకు లీకులిచ్చింది. తీరా ఇప్పుడు ఈసీ నుంచి అనుమతి రాలేదంటూ చిలుకపలుకులు పలుకుతుండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతున్నది.
హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. శనివారం నిర్వహించాలనుకున్నప్పటికీ ఎన్నికల కమిషన్ అనుమతి రానందున క్యాబినెట్ భేటీని వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించుకునేందుకు అనుమతించాలని ఎన్నికల సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. శనివారం సాయంత్రం 7 గంటల వరకు ఈసీ అనుమతి కోసం వేచి చూశామని, అనుమతి రాకపోవడంతో సమావేశం కాలేకపోయినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈసీ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నామని, సోమవారం నాటికి అనుమతి రాకపోతే ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని యోచిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
ఒకవేళ అనుమతి వచ్చి ఉంటే, రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, వానకాలం పంటల ప్రణాళిక, రైతులకు సంబంధించిన పలు కీలకమైన అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించాలని ఎజెండా సిద్ధం చేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈసీ అనుమతి లేకపోవడంతో రైతుల సంక్షేమం, అత్యవసరమైన అంశాలపై చర్చించలేకపోయామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణతోపాటు రాష్ట్ర విభజన జరిగి పదేండ్లు పూర్తి కావడంతో ఇప్పటివరకు రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న అంశాలను క్యాబినెట్ భేటీలో చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. క్యాబినేట్ భేటీ వాయిదా పడటంతో ఇవేవీ చర్చించలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈసీ నుంచి అనుమతి ఎప్పుడు వస్తే.. అప్పుడే క్యాబినెట్ భేటీ జరపాలని సీఎం నిర్ణయించారు. సోమవారం లోపు ఈసీ నుంచి అనుమతి రాకపోతే, అవసరమైతే మంత్రులతో కలిసి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి అనుమతి కోరుతామని పేర్కొన్నారు.
ఉమ్మడి వరంగల్-నల్లగొండ-ఖమ్మం జిల్లాకు చెందిన గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఈ నెల 27న జరగనున్న నేపథ్యంలో కేవలం ప్రచారం కోసమే క్యాబినెట్ భేటీ అంటూ హంగామా చేశారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో కీలకమైన మంత్రివర్గ సమావేశానికి ఎన్నికల సంఘం ఏ విధంగా అనుమతిస్తుందని భావించారని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. క్యాబినెట్లో తీసుకునే నిర్ణయాలు గ్రాడ్యుయేట్ నియెజకవర్గ ఓటర్ల మీద ప్రభావం చూపుతాయని, ఈ అనుమనాలు సహజంగానే ఎన్నికల సంఘానికి కూడా వస్తాయని అంటున్నారు. ఇవేమీ తెలియదన్నట్టుగా క్యాబినెట్ మీటింగ్ అంటూ ప్రచార ఆర్భాటం, హడావుడి చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సాధారణంగా క్యాబినెట్ ఎజెండాను ముందుగానే లీక్ చెయ్యరు. కానీ, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తన అనుకూల మీడియాకు లీక్‌లు ఇచ్చి ఎజెండాను ప్రముఖంగా ప్రసారం, ప్రచురితం అయ్యేవిధంగా చూసుకున్నదని చెప్తున్నారు. ఎన్నికల కమిషన్ అనుమతి పొందకముందే క్యాబినెట్ సమావేశానికి ఏర్పాట్లు చేసి, ఏకంగా ముఖ్యమంత్రే సరియైన సమయానికి రాలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రివర్గ సమావేశానికి రావాల్సిన మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సచివాలయానికి రాలేదు. శనివారం మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశం ఉంటుందని ముందుగా ప్రకటించినప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మధ్యాహ్నం 4 గంటల తర్వాత సచివాలయానికి వచ్చారు. సాయంత్రం 7 గంటలకు సచివాలయం నుంచి వెళ్లిపోయారు. సచివాలయంలో సీఎం నీటిపారుదల శాఖపై సమీక్ష నిర్వహించారు. వీటన్నింటిని విశ్లేషించిన పరిశీలకులు క్యాబినెట్ పేరుతో ఎన్నికల స్టంట్ నడిపించారని వ్యాఖ్యానిస్తున్నారు.