హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): కామారెడ్డిలో నామినేషన్ దాఖలు సమయంలో సమర్పించిన పార్టీ బీఫాం పోగొట్టిన కారణంగా మరొకటి ఇస్తే దానిని స్వీకరించేందుకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి నిరాకరించారంటూ హైకోర్టులో అత్యవసర లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఆబాద్ పార్టీకి చెందిన హసనేక్ వినతిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాదే. జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్తో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ నెల 10న నామినేషన్ వేయడానికి వెళ్లినప్పుడు పీసీసీ చీఫ్ కూడా రావడంతో తర్వాత రావాలని అధికారులు చెప్పారని పిటిషనర్ తెలిపారు. సాయంత్రం చెక్ లిస్ట్ పరిశీలిస్తే అందులో బీఫాం లేదని, తర్వాత ఇస్తామని చెప్తే అంగీకరించిన అధికారులు తర్వాత తిరసరించారని చెప్పారు. ఇరుపక్షాల వాదనల తర్వాత హైకోర్టు, రిటర్నింగ్ అధికారి ఇచ్చిన చెక్ లిస్ట్ పై అభ్యర్థి సంతకం చేశారంటే అందులో బీఫారం లేదని అభ్యర్థి అంగీకరించినట్లేనని తేల్చి చెప్పింది. కాబట్టి మరో బీఫాం తీసుకోవాలని ఈసీకి ఉత్తర్వులు ఇవ్వలేమంటూ పిటిషన్ను డిస్మిస్ చేసింది.