ఆయన కుల ఉద్వేగాలు రేకెత్తించలేదు.. మతాన్ని ఎంత మాత్రం వాడుకోలేదు.. జాతుల వైరాన్ని జాతీయ ప్రచారాంశంగా చేయలేదు.. ఆయన కేవలం ప్రజలను కొన్ని సూటి ప్రశ్నలు అడుగుతున్నారంతే! మీకు నా ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ఇప్పుడు అమలవుతున్నాయా? మీకు వారు మాటిచ్చిన హామీలు నెరవేరాయా? తెలంగాణకు బీజేపీ చేసింది ఏమిటి? కాంగ్రెస్ విధానాలు ఎట్లున్నయి? మీ తరఫున ఎవరు కొట్లాడాలె? కేసీఆర్ వేస్తున్న ఈ ప్రశ్నలకు తెలంగాణ దద్దరిల్లుతున్నది. ప్రతి పట్నంలో రోడ్డంతా ప్రభంజన షోగా మారుతున్నది.
‘సీఎం.. సీఎం.. సీఎం..’ అంటూ ఆపలేని నినాదాల హోరుతో ఊరూరూ మార్మోగుతున్నది. రైతు, ముసలి, మహిళ, యువత మళ్లీ మా ఓటు కేసీఆర్‌కే అని నినదిస్తున్నది. ఇంకేముంది? తెలంగాణలో పాగా వేయాలనుకుంటున్న పార్టీ, అధికారం శాశ్వతమనుకుంటున్న మరో పార్టీ.. రెండూ కేసీఆర్ గర్జనకు ఉలిక్కిపడ్డాయి.
ఫలితం తెలంగాణ గొంతుకపై 48 గంటల నిషేధం. ఒకరు ఫిర్యాదు చేశారు. ఊహించినట్టే ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయినా దేశంలో మహా మహా నాయకులు మహా అపచారాలు, మతోద్వేగ ప్రకటనలు చేస్తున్నా రాని తక్షణ స్పందన కేసీఆర్ విషయంలోనే ఎందుకొచ్చింది? ఇది అర్థం చేసుకోలేనంత తెలివిడి లేనివాళ్లా తెలంగాణ ప్రజలు! 48 గంటల ప్రచార నిషేధం బీఆర్ఎస్ ప్రచండ విజయాన్ని ఆపగలుగుతుందా?
KCR | మహబూబాబాద్/హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం 48 గంటల పాటు నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ మలయ్ మాలిక్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
బుధవారం (మే 1వ తేదీ) రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుందని తెలిపారు. గత నెల 5న సిరిసిల్లలో జరిగిన ప్రెస్మీట్లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఫిర్యాదు చేశారని, దాన్ని పరిశీలించిన అనంతరం చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు.
గతంలోనూ కేసీఆర్ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి మాట్లాడారని ఈసీ పేర్కొన్నది. 48 గంటల నిషేధం సమయంలో కేసీఆర్ ఎన్నికల ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించకూడదని, మీడియాతో కూడా మాట్లాడకూడదని స్పష్టంచేసింది. కేసీఆర్‌కు ఎన్నికల సంఘం నోటీసులు అందజేసింది.
48 గంటల పాటు ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించిన నేపథ్యంలో, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో బుధవారం రాత్రి మహబూబాబాద్‌లో కురవి తహసీల్దార్ సునీల్‌రెడ్డి.. కేసీఆర్‌కు ఉత్తర్వుల కాపీని బస్సులోనే అందజేశారు. ఈసీ నోటీసులను గౌరవప్రదంగా స్వీకరించిన కేసీఆర్.. వెంటనే ప్రచారాన్ని ఆపేశారు. ఇదే విషయాన్ని ప్రజలకు వివరించి తన ప్రసంగాన్ని గడువు సమయంలోగా ముగించారు.
బీఆర్ఎస్ అధినేత నిబంధనలు ఉల్లంఘించారా?
కేసీఆర్‌పై ఎన్నికల సంఘం 48 గంటలపాటు ప్రచారంలో పాల్గొనవద్దంటూ నిషేధాజ్ఞలు జారీచేయడంపై చర్చ జరుగుతున్నది. వాస్తవానికి, రాజ్యాంగబద్ధ సంస్థలకు అత్యంత విలువ ఇచ్చే అతికొద్ది మంది రాజకీయ నాయకుల్లో కేసీఆర్ ఒకరు. ఆయనకు 50 ఏండ్లకుపైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నది. చట్టాలు, ఎన్నికల నిబంధనలపై సంపూర్ణమైన అవగాహన ఉన్నది.
ఆయన ఎన్నడూ ఈ తరహా నిషేధానికి గురికాలేదు. పార్టీ కార్యకర్తలు, నాయకులకు శిక్షణ ఇచ్చే సందర్భాల్లో కూడా ఎన్నికల సంఘం నిబంధనలను తప్పకుండా పాటించాలని కేసీఆర్ చెప్తుంటారు. మాటల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. కేసీఆర్‌పైనే ఈసీ ఇప్పుడు చర్యలు తీసుకోవటం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నది.
మోదీ మాటలు వారికి వినిపించవా?
మోదీ విద్వేష వ్యాఖ్యలు ఈసీకి వినిపించలేదా? వేలాదిమంది ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదు.. రేవంత్ బూతులు ఎన్నికల కమిషన్‌కు ప్రవచనాల్లా అనిపిస్తున్నాయా? ఏకంగా తెలంగాణా కీ ఆవాజ్ కేసీఆర్ గొంతుపైనే నిషేధమా?’ ‘ఫౌల్ మౌత్డ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ రేవంత్‌రెడ్డి’కి వ్యతిరేకంగా ఎందుకు చర్యలు తీసుకోలేదు?, ఇది బడే భాయ్.. ఛోటే భాయ్ కలిసి చేసిన కుట్ర కాదా? కేసీఆర్ పోరుబాటతో కాంగ్రెస్, బీజేపీలు ఎందుకు అంతగా వణికిపోతున్నాయి. మీ అహంకారం, అధికార దుర్వినియోగానికి తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్తారు.
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఆ పార్టీలపై కొట్లాడుతున్నందుకే…
ప్రధాని మోదీ మత విద్వేషాలు రెచ్చగొట్టినా ఎన్నికల కమిషన్‌కు వినిపించవు, కనిపించవు. సీఎం రేవంత్‌రెడ్డి కులాల మధ్య చిచ్చుపెట్టి ఇష్టం వచ్చినట్టు బూతు మాట్లాడినా ఈసీ ఎలాంటి చర్యలూ తీసుకోదు. కానీ కేసీఆర్ ప్రచారాన్ని మాత్రం ఆపుతుంది. కాంగ్రెస్, బీజేపీ మీద గట్టిగా కొట్లాడుతున్నందుకే కేసీఆర్‌ను ప్రచారం చేయకుండా ఆపారు.
– బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్
ఇవి అనుచితం కావా?
దేశ వనరులపై మొదటి హక్కు ముస్లింలకే అని మన్మోహన్సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. దీనర్థం ప్రజల సంపదను వారు(కాంగ్రెస్) స్వాధీనం చేసుకుని ‘ఎక్కువ మంది పిల్లలున్న వారికి’ పంచేస్తారు. మన చెల్లెళ్ల వద్ద ఎంత బంగారం ఉంది.. ప్రభుత్వ ఉద్యోగుల వద్ద ఎంత డబ్బు ఉన్నది అని తనిఖీ చేస్తారు. హిందూ మహిళల మంగళసూత్రాలనూ వదిలిపెట్టరు.
– రాజస్థాన్ బాన్స్వారా సభలో ప్రధాని మోదీ
ముస్లిం పర్సనల్ చట్టాలను తీసుకొస్తామని, దేశాన్ని షరియా చట్టం ప్రకారం నడుపుతామని కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో పేర్కొన్నది. ముస్లిం లీగ్ అజెండాను తీసుకురావాలని ఆ పార్టీ భావిస్తున్నది.
– అమిత్‌షా, కేంద్ర హోంమంత్రి
నువ్వు మాట్లాడే లత్కోరు, లఫంగి మాటలకు అంగీ, లాగు ఊడదీసి చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా బిడ్డా! కొడుకు, బిడ్డతో కలిసి ఉండేందుకు చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూం కట్టిస్తా. పదేండ్లు రాష్ర్టాన్ని దోపిడీ దొంగల్లా, అడవి పందుల్లా పట్టి పీడించారు. కాంగ్రెస్ కార్యకర్తలు తలచుకుంటే ఆయన ము.. మీద డ్రాయర్ కూడా ఉండదు.
-ఏప్రిల్ 6న తుక్కుగూడ జనజాతర సభలో సీఎం రేవంత్