నీ ప్రమేయంతోనే ప్రవీణ్‌యాదవ్‌ను పోలీసులు కొట్టారు. అది నీ అంతరాత్మకు తెలుసు. అందుకే బాధిత కుటుంబాన్ని నువ్వు ఇప్పటివరకు పరామర్శించలేదు. ప్రవీణ్‌ను పోలీసులు కొడుతుంటే.. తన అల్లుడిని కాపాడాలని అదే పోలీస్‌స్టేషన్ నుంచి అతని మామ మహేందర్ నీకు ఫోన్ చేస్తే.. నేనే కొట్టుమని చెప్పి.. నేనే విడిచిపెట్టుమని చెప్పాల్నా అని నువ్వన్న మాటలు నిజం కాదా? నా దగ్గర అన్ని ఆధారాలున్నయి.
దీనిపై చర్చకు సిద్ధమా?
ఈటలను ఉద్దేశించి గెల్లు శ్రీనివాస్
కరీంనగర్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్వీ హుజూరాబాద్ డివిజన్ నాయకుడు భాషబోయిన ప్రవీణ్‌యాదవ్ మరణించిన ఘటనలో అసలైన ద్రోహి, దోషి ఈటల రాజేందరేనని.. అందుకే బాధిత కుటుంబాన్ని ఇన్నాళ్లూ పరామర్శించనైనా లేదని, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు, హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రవీణ్ కుటుంబాన్ని ఆదుకొన్నానంటూ ఈటల చెప్పే మాటలన్నీ పచ్చి అబద్ధాలని పేర్కొన్నారు. గురువారం హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లిలోని ప్రవీణ్ ఇంటిలో అతని తల్లి విజయ, భార్య రమ్యతో కలిసి మీడియాతో మాట్లాడుతూ, ప్రవీణ్ కుటుంబంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకొనేది లేదని హెచ్చరించారు. ప్రవీణ్ తండ్రి మల్లయ్యకు ఉద్యోగం పెట్టించింది తానేనని ఈటల చెప్పడంలో అణువంత నిజం లేదన్నారు. నిజానికి మల్లయ్య భూమి సబ్‌స్టేషన్ నిర్మాణంలో పోతే, బతుకుదెరువు ఎలాగా అని ఆ కుటుంబం వాపోతుంటే.. ఆ సమయంలో సర్పంచ్‌గా ఉన్న భాస్కర్‌రెడ్డి మల్లయ్యకు అదే సబ్‌స్టేషన్‌లో ఉద్యోగం పెట్టించాడని వివరించారు. భాస్కర్‌రెడ్డి పంచాయతీలో తీర్మానం చేసి తన భర్తకు ఉద్యోగం ఇప్పించాడని ప్రవీణ్ తల్లి విజయ చెప్పారని.. వాస్తవం ఇలా ఉంటే, ఈటల తానే ఇప్పించినట్టు చెప్పుకొంటున్నారని ఆరోపించారు.
ప్రవీణ్, ఆయన తల్లి విజయమ్మ.. 2001 నుంచి టీఆర్ఎస్కు నిఖార్సైన కార్యకర్తలుగా పనిచేస్తున్నారని.. పెద్దపాపయ్యపల్లి నుంచి అనేక ఉద్యమాల్లో పాల్గొన్న చరిత్ర వీరి కుటుంబానికి ఉన్నదని గెల్లు శ్రీనివాస్ పేర్కొన్నారు. టీఆర్ఎస్వీ హుజూరాబాద్ డివిజన్ అధ్యక్షుడిగా ప్రవీణ్ చురుకైన పాత్ర పోషించారని.. ఈటల గెలుపుకోసం చాలాసార్లు కష్టపడిన కార్యకర్త అని కొనియాడారు. 2014లో తెలంగాణ వచ్చి.. ఈటల మంత్రి అయిన తరువాత తనకు ఉద్యోగం పెట్టించాలని ప్రవీణ్ ఎన్ని సార్లు వేడుకున్నా.. రాజేందర్ పట్టించుకోలేదని చెప్పారు. బీటెక్ పూర్తి చేసిన ప్రవీణ్.. కరీంనగర్ కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన వారధి సంస్థలో దరఖాస్తు చేసుకొన్నాడని.. అతని ప్రతిభ ఆధారంగా హుజూరాబాద్ ప్రభుత్వ దవాఖానలో ఉద్యోగం వచ్చిం దే తప్ప.. ఎలాంటి రికమెండేషన్‌తో కాదని స్పష్టంచేశారు. ప్రవీణ్‌ను ఉద్యోగంనుంచి తొలిగించాలని అప్పటి సూపరింటెండెంట్‌పై ఈటల ఒత్తిడి తెచ్చారన్నారు. ఈ క్రమంలో కేసీఆర్ కిట్ల విభాగంలో పనిచేస్తున్న ప్రవీణ్‌ను.. సిజేరియన్ ప్రసవాలను సాధారణ ప్రసవాలుగా నమోదుచేయాలంటూ సూపరింటెండెంట్ ఒత్తిడి చేశారని చెప్పారు. ఒప్పుకోకుంటే ఉద్యోగం నుంచి తొలిగిస్తానని బెదిరించినా తలొగ్గకపోవడంతో ప్రవీణ్‌ను డిస్మిస్ చేశారని వివరించారు. మనస్థాపానికి గురైన ప్రవీణ్ తన మామ మహేందర్‌తో వెళ్లి ఈటలకు మొరపెట్టుకొన్నా కనికరించకపోగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని చెప్పారు. చివరకు ప్రవీణ్ తన ఉద్యోగం కోసం హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం ఆయనకు అనుకూలంగా తీర్పు చెప్పిందన్నారు. హైకోర్టు తీర్పు చెప్పినప్పటికీ అధికారులు ఉద్యోగంలోకి తీసుకోకపోవడంతో అదే కోర్టులో ధిక్కరణ కేసు వేశారని గెల్లు వివరించారు. పైగా అక్రమకేసు బనాయించి ఠాణాకు పిలిపించి కొట్టించారని ఆవేదన వ్యక్తంచేశారు. ‘నీ ప్రమేయంతోనే ప్రవీణ్‌ను పోలీసులు కొట్టారని నీ అంతరాత్మకు తెలుసు కాబట్టే బాధిత కుటుంబాన్ని ఇప్పటివరకు పరామర్శించలేదు. ప్రవీణ్‌ను పోలీసులు కొడుతుంటే తన అల్లుడిని కాపాడాలని అదే పోలీసుస్టేషన్ నుంచి అతని మామ మహేందర్ నీకు ఫోన్‌చేసి వేడుకొంటే.. నేనే కొట్టుమని చెప్పానని, తిరిగి నేనే విడిచి పెట్టమని చెప్పాల్నా అని నువ్వన్న మాటలు నిజం కాదా ఈటలా? మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి’ అని గెల్లు శ్రీనివాస్‌యాదవ్ అన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులను ఏకంచేసి ఉద్యమించిన తాను ప్రవీణ్ విషయంలోనూ ఉద్యమించేవాడినని.. కానీ.. పార్టీ నేతను బదునాం చేయవద్దని.. పాపం చేసిన వాళ్లకు కాలమే శిక్ష వేస్తుందని ఇన్నాళ్లూ ఓపికతో ఉన్నానని గెల్లు చెప్పారు.‘ప్రవీణ్ భార్యకు ఇప్పుడు 25 ఏండ్లు.ఒక కొడుకు ఉన్నాడు. మిగతా జీవితం ఎలా గడుపుతుంది? ఈ గ్రామస్థులు ఒక్కసారి ఆలోచించాలి. ఎదిగిన కొడుకు చనిపోయాడని ఆ తల్లి ఎంత కుమిలి పోతున్నదో ఆలోచించాలి. దయచేసి ధర్మం వైపు నిలబడండి’ అని గెల్లు గ్రామస్థులను కోరారు. ప్రవీణ్యాదవ్పై తప్పుడు కేసు నమోదుచేశారని, పోలీస్‌స్టేషన్‌లో సూపరింటెండెంట్ చేసిన ఫిర్యాదు కాపీ తమ దగ్గర ఉన్నదని చెప్పారు. ఈ కేసు ఏ కారణంతో పెట్టారో తమ వద్ద అన్ని ఆధారాలున్నాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఈటలతో బహిరంగ చర్చకు కూడా తాను సిద్ధమని సవాలు విసిరారు. ఈ విలేకరుల సమావేశంలో ప్రవీణ్ తల్లి విజయమ్మ, భార్య రమ్య, మామ కన్నెబోయిన మహేందర్‌యాదవ్, స్థానిక టీఆర్ఎస్ నాయకులు, సంగెం అయిలయ్య, దయాకర్‌రెడ్డి, మధుకర్‌రెడ్డి, ఆలేటి శ్రీరాం, శ్రీనివాస్‌రెడ్డి, బండ శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.
పోటీచేసిన ప్రతిసారీ తన గెలుపు కోసం అహర్నిశలు పనిచేసిన ప్రవీణ్‌యాదవ్‌ను ఏ విధంగా ఎక్కడ ఆదుకొన్నడో ఈటల చెప్పాలని గెల్లు శ్రీనివాస్‌యాదవ్ డిమాండ్‌చేశారు. రాజకీయాలకోసం తాను ఈ ప్రశ్న అడగటంలేదని.. ప్రవీణ్ కుటుంబానికి ద్రోహం చేసి.. తానే ఆదుకొన్నానని చెప్పడం విడ్డూరంగా ఉన్నది కాబట్టే అడుగుతున్నానని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో తాము ఉద్యమాలు నేర్చుకొన్నామే తప్ప ఈటల మాదిరిగా చీకటి రాజకీయాలు చేయడం నేర్వలేదని తెలిపారు. ఈటల క్యాంపు కార్యాలయానికి అర కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రవీణ్ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని నిలదీశారు. పోలీసులు కొట్టడంవల్ల కిడ్నీలు చెడిపోయి ప్రవీణ్ చనిపోతే గుండెపోటుతో చనిపోయినట్టు అబద్ధాలు చెప్తున్న ఈటల బహిరంగంగా బాధిత కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌చేశారు. ఒక కార్యకర్త చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన నాయకుడే స్వయంగా ఆరోపణలు చేయడం, అనుచరులతో చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు.