కరీంనగర్, జూన్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఈటల ఖబడ్దార్ అంటూ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. రాజకీయ జన్మనిచ్చిన టీఆర్ఎస్కు ద్రోహంచేయడమే కాదు.. అధికారాన్ని అడ్డుపెట్టుకొని కోట్ల విలువైన అక్రమాస్తులు సంపాదించిన ఈటల రాజేందర్ జైత్రయాత్ర పేరుతో కొత్త నాటకానికి తెరలేపారని మండిపడ్డారు. ద్రోహులు ఎవరో, ఉద్యమకారులు ఎవరో ప్రజలకు తెలుసని, తగిన సమయంలో సరైన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. దేశానికి దిక్సూచిగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్ వెంటే తామంతా ఉంటామని వారు మరోసారి స్పష్టం చేశారు.
టీఆర్ఎస్కు ఈటల ద్రోహం : ఎమ్మెల్యే రమేశ్
కన్నతల్లిలాంటి పార్టీకి ఈటల రాజేందర్ ద్రో హం చేశారని వర్ధన్నపేట ఎమ్మెల్యే, జమ్మికుంట మండల ఇంచార్జి అరూరి రమేశ్ విమర్శించారు. మంగళవారం ఆయన కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు నివాసంలో మీడియాతో మాట్లాడారు. సముచిత స్థానం కల్పించి అత్యున్నత పదవులతో గౌరవించిన కేసీఆర్‌ను విమర్శించే హక్కు ఈటలకు లేదన్నారు. భూ కబ్జాలకు పాల్పడిన వ్యక్తిని ఎలా చేర్పించుకుంటారని బీజేపీ నేతలను ప్రశ్నించారు.సమావేశం లో సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, జడ్పీటీసీ డాక్టర్ శ్యాం, పీఏసీఎస్ చైర్మన్ సంపత్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
బీజేపీలోకి ఎలా తీసుకుంటారు?
నియోజకవర్గ పర్యటనకు వచ్చిన ఈటల ప్రజలపై వల్లెమాలిన ప్రేమ ప్రదర్శించడం కపట నాటకమని టీఆర్ఎస్ హుజూరాబాద్ పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక విమర్శించారు. మంగళవారం హుజూరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో ఏ ఒక్క నాయకుడు రాజకీయంగా ఎదగకుండా ఈటల అణగదొక్కాడని ఆరోపించారు. సమావేశంలో కౌన్సిల ర్లు కల్లెపెల్లి రమాదేవి, తాళ్లపెల్లి శ్రీనివాస్‌గౌడ్, ముక్క రమేశ్, నాయకులు పంజాల కుమారస్వామి, సాయిచరణ్, రియాజ్, మొలుగు పూర్ణచందర్, సమ్మయ్య, రాజేందర్, సాయి, అజయ్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.
మేమంతా కేసీఆర్ వెంటే..
ఈటలకు పార్టీలో, ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని, అలాంటి నేతపై విమర్శలు చేయడం తగదని వీణవంక మండల టీఆర్ఎస్ నాయకులు అన్నారు. వీణవంక మండలం కిష్టంపేటలో మంగళవారం టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. భూములు ఆక్రమించారంటూ దళిత రైతులు చేసిన ఫిర్యాదు మేరకే సీఎం విచారణ చేయిం చి, ఈటలను పక్కన పెట్టారన్నారు. సీఎం కేసీఆర్‌ను, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను విమర్శిస్తే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. సమావేశంలో ఎంపీపీ ముసిపట్ల రేణు క, జడ్పీటీసీ వనమాల, ఏఎంసీ చైర్మన్ వాల బాలకిషన్‌రావు, కోఆప్షన్మెంబర్ హమీద్, మాజీ జడ్పీటీసీ దాసారపు ప్రభాకర్, సర్పంచ్‌లు ముత్తయ్య, రఘుపాల్‌రెడ్డి, సారయ్య, నర్సయ్య, కాంతారెడ్డి, సునీత, జ్యోతి, వరలక్ష్మి, సుజాత, ఎంపీటీసీలు కాసం వీరారెడ్డి, నల్ల మమత, మూల రజిత, రాంచందర్, నాయకులు గెల్లు మల్లయ్య, శ్యాంసుందర్‌రెడ్డి, మల్లయ్య, శ్రీనివాస్, వీరయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఈటల.. నోరు అదుపులో పెట్టుకో..
టీఆర్ఎస్కేవీ మలక్‌పేట అధ్యక్షుడు మారుతి
చాదర్‌ఘాట్, జూన్ 8: మాజీ మంత్రి ఈటల రాజేందర్ నోరు అదుపులో పెట్టుకోవాలని టీఆర్ఎస్కేవీ మలక్‌పేట నియోజకవర్గ ఇంచార్జి, టీఎస్ఆర్టీసీ లైసెన్స్డ్ పోర్టర్స్ యూనియన్ అధ్యక్షుడు కారింగల మారుతి హెచ్చరించారు. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కార్మికుల కోసం అహర్నిశలు కృషిచేస్తున్న గొప్ప నాయకురాలు కల్వకుంట్ల కవిత అని కొనియాడారు. టీఆర్ఎస్లో ఉండి ఎన్నో పదవులు అనుభవించిన ఈటల.. ఇప్పుడు అక్రమాస్తులు బయటపడటంతో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. ఈటల వెంటనే ఎమ్మెల్సీ కవితకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈటలవి మతితప్పిన మాటలు : బీసీ నేత వకుళాభరణం
ఈటల రాజేందర్ మతి తప్పి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని టీఆర్ఎస్ సీనియర్ నేత, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు మండిపడ్డారు. మంగళవారం హుజూరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఎప్పుడు ఉప ఎన్నిక వచ్చినా, ఇక్కడ సీఎం కేసీఆర్‌దే విజయమన్నారు. అధినేత కేసీఆర్‌పై, కన్నతల్లి లాంటి టీఆర్ఎస్పై ఈటల విమర్శలు చేయడం విచారకరమన్నారు. టీఆర్ఎస్ నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎవరూ ఈటల వైపు వెళ్లకపోవడంతో ఆయన జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ద్రోహులు ఎవరో, ఉద్యమకారులు ఎవరో ఈ నియోజకవర్గ ప్రజలు ఆలోచించాల్సిన సమయం వచ్చిందన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక కురుక్షేత్రం అయితే.. ధర్మం పక్షాన ఉన్న టీఆర్ఎస్కు విజయం, ఈటలకు పరాభవం తప్పదని వకుళాభరణం స్పష్టం చేశారు.