హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): కల్వకుంట్ల కవిత ప్రకటించిన కొత్త రాజకీయ పార్టీ పేరుకు ప్రారంభంలోనే కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆమె ప్రతిపాదించిన ‘తెలంగాణ రక్షణ సేన’ (టీఆర్ఎస్) పేరుపై ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరాలు రావడంతో ఆ పేరును మార్చాలని ఈసీ సూచించింది. తెలంగాణ రక్షణ సేన అనే పేరుపై సాధారణ ప్రజల నుంచి వెయ్యికిపైగా అభ్యంతరాలు రావడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నది. వచ్చే 15 రోజుల్లోగా కనీసం మూడు ప్రత్యామ్నాయ పేర్లను సమర్పించాలని ఈసీ సూచించినట్టు తెలిసింది. ఈ మేరకు ఈసీ జూన్ 23నే కవితకు పోస్టు ద్వారా లేఖ పంపింది.
అయితే, గతంలో కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ 2022లో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బీఆర్ఎస్తో విభేదించిన కవిత ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్త పార్టీ కోసం ఐదు పేర్లను ఈసీకి ప్రతిపాదించారు. ఏప్రిల్ 25న జరిగిన ఆవిర్భావ సభలో మొదట తెలంగాణ రాష్ట్ర సేన అని ప్రకటించినప్పటికీ, ఏప్రిల్ 28న ఈసీ ఆదేశాల ప్రకారం తెలంగాణ రక్షణ సేనగా మార్చారు. అయితే, తాజా అభ్యంతరాల నేపథ్యంలో కవిత తన పార్టీకి మరోసారి కొత్త పేరును వెతుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.