గా రిజిస్ట్రార్‌కు ఇంత ముట్టజెప్తే నీ భూమి కాగితాలిస్తడు
-ధరణికి ముందు పరిస్థితి
లంచమనే లొల్లి లేదు.. సారూ! అని కాళ్లు మొక్కే బాధ లేదు
-ధరణి తెచ్చిన మార్పు ఇది
మరి అధికారుల కాళ్లు పట్టుకుందామా?
దర్జాగా భూమి రిజస్ట్రేషన్ చేసుకుందామా?
పాస్బుక్కు కోసం ఆఫీసుల చుట్టు తిరుగుదామా?
ఇంట్లో నుంచే ఆన్లైన్లో చూసుకుందామా?
రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అని తండ్లాట పడుదామా?
అన్నీ ఒక్క పెట్టున అయితుంటే వద్దనుకుందామా?
ప్రతిపక్షపోళ్ల మాటలు నమ్మి మోసపోదామా?
రైతు కన్నీళ్లు తుడిచే ధరణిని కాదనుకుందామా?
తెలంగాణ ప్రజానీకం తేల్చుకోవాల్సిన ప్రశ్నలివి!
Dharani | హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు భూమి హక్కుల మార్పిడి అంటే కైలాసం ఆడినట్టే ఉండేది. ఒక నిచ్చెన ఎక్కామని సంతోషపడే లోపే పాము మింగేసేది. నానాకష్టాలు పడి రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో రిజిస్ట్రేషన్ పూర్తయిందని సంతోషపడేలోపే, మ్యుటేషన్ అనే పాము ఎదురుచూసేది. అక్కడ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు, వీఆర్వోలు మొదలుకొంటే అందరినీ ప్రాధేయపడటాలు.. ఇలా ఎన్నో పాములను దాటుకొని వెళ్లాల్సి వచ్చేది. అన్నింటికన్నా పెద్ద పాము లంచం రూపంలో ఎదురుచూసేది. అడిగినంత డబ్బు ఇవ్వకుంటే అమాతం మింగేసి రైతు జీవితాన్ని చీకట్లోకి తోసేది. ప్రతిపక్షాలు తెస్తామంటున్న రోజులు అలాంటివే. నాడు రిజిస్ట్రేషన్ ఒక చోట.. మ్యుటేషన్ మరో చోట గతంలో ఒక వ్యక్తి వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి, దానికి పాస్‌బుక్ పొందాలంటే సవాలక్ష అడ్డంకులు ఉండేవి. ముందుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి డాక్యుమెంట్ రైటర్‌ను సంప్రదించాలి. అక్కడ డాక్యుమెంట్‌కు కనీసం రూ.5-10 వేలు, పెద్ద విస్తీర్ణమైతే అంతకన్నా ఎక్కువే ముట్టజెప్పాలి.
ఆ తర్వాత సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో రిజిస్ట్రేషన్ చేయించాలి. ఇక్కడ కూడా డబ్బు ఇస్తే ఆ రోజే పని పూర్తవుతుంది. లేదంటే వాళ్లు చెప్పిన రోజు రావాల్సిందే. ప్రభుత్వానికి చెల్లించే చలాన్‌కు అదనంగా.. డాక్యుమెంట్ రైటర్లకు ముట్టజెప్పే సొమ్ములు, మధ్యలో చిరుద్యోగుల చేతులు తడపటం, కొనుగోలుదారు, అమ్మకందారు, సాక్షుల ప్రయాణ ఖర్చులు కలిసి తడిసి మోపెడయ్యేవి. రిజిస్ట్రేషన్ పత్రాలు వచ్చినంత మాత్రాన వ్యవసాయ భూమిపై హక్కులు వచ్చినట్టు కాదు. ధరణికి ముందు రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు కార్డ్ వ్యవస్థ, అంతకుముందు మా భూమి అనే పోర్టళ్లు ఉండేవి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో క్రయవిక్రయాలు, గిఫ్ట్, వారసత్వం, భాగపంపకం కింద దస్తావేజులు రిజిస్టర్ అయిన తర్వాత సమాచారం ఆన్లైన్లో సంబంధింత మండల తాసిల్దార్ కార్యాలయానికి వెళ్తుంది.
భూమి కొనుగోలు చేసిన వ్యక్తి సంబంధిత పత్రాలను మండల కార్యాలయంలో సమర్పించి భూమిని తన పేరు మీదికి మ్యుటేషన్ చేయాలని, 1బీ రికార్డులో ఎక్కించాలని దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. తాసిల్దార్ ఈ పత్రాలను పరిశీలించిన తర్వాత నోటీసు జారీ చేస్తారు. వీఆర్వో సహాయంతో రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆ గ్రామానికి వెళ్లి పంచనామా చేసేవారు. ఆ భూమి సరిహద్దు రైతులను విచారించి, నివేదికను తయారు చేసి తాసిల్దార్‌కు అప్పగించాలి. అన్నీ సరిగా ఉన్నాయని అనుకున్న తర్వాత మ్యుటేషన్ చేసి, 1బీ రికార్డులో పాత రైతు పేరు మీద విస్తీర్ణాన్ని తొలిగించి, కొత్త రైతు పేరు మీద విస్తీర్ణం జమ చేసేవారు. ఆ తర్వాత పట్టాదారుకు పాస్‌బుక్ మంజూరు చేసేవారు. ఆ రికార్డుల ఆధారంగా పహాణీలో పేరు మారేది. అప్పటికి అసలు హక్కుదారుగా మారేవారు.
కాటేసే అవినీతి కాలసర్పం
రెవెన్యూ కార్యాలయంలో తాసిల్దార్ నోటీసు జారీ చేసినప్పటి నుంచి అసలు కథ మొదలయ్యేది. వీఆర్వోలు, ఆర్ఐలు క్షేత్రస్థాయికి వెళ్లి పంచనామా చేయడం వంటివి ఏమీ ఉండేవి కాదు. వీఆర్వోలు నేరుగా సంబంధిత రైతును తమ ఇంటికి పిలిపించుకునేవారు. లేదా రైతే నేరుగా వీఆర్వో దగ్గరికి వెళ్లి తమ డాక్యుమెంట్లు చూపించేవారు. ‘అయ్యా మాకు పాస్‌బుక్ మంజూరు చేయండి’ అని బతిమాలుకునేవారు. ఎకరానికి ఇంత చొప్పున వీఆర్వో డిమాండ్ చేసేవారు. ఆ పైఅధికారులు కూడా అంతే. అడిగినంత ముట్టజెప్తే తప్ప పహాణీలోగానీ, మ్యుటేషన్ జరిగి 1బీ రికార్డులోగానీ పేరు మారదని తేల్చిచెప్పేవారు. కొందరు రైతులు అడిగినంత ముట్టజెప్పి మ్యుటేషన్ చేయించుకుంటే.. మరికొందరు డబ్బులు లేక కాళ్లావేళ్లా పడి బతిమిలాడుకునేవారు. డబ్బులు ఇవ్వకుంటే ఇక అంతే సంగతులు. రైతు దరఖాస్తు చెత్తబుట్టలోకి చేరినట్టే. రాజకీయ నేతనో, పైఅధికారులో, కాస్త పలుకుబడి ఉన్నవారు ఎవరైనా ఫలానా రైతు మ్యుటేషన్ ఆపేయాలని చెప్పినా అంతే సంగతులు.
ఆ దరఖాస్తు ఏండ్లకుఏండ్లు పెండింగ్‌లో పడేది. అదేమని అడిగితే.. పక్క రైతు అభ్యంతరం చెప్పారనో, ప్రభుత్వ భూమి కలిసిందన్న అనుమానం ఉన్నదనో, సర్వే నంబర్ వేరే చోట చూపిస్తున్నదనో.. సంబంధం లేని కారణాలు చెప్పేవాళ్లు. పైగా ‘నీ దిక్కున్నచోట చెప్పుకోపో’ అని బెదిరింపులు. సరే.. అప్పోసప్పో చేసి అడిగినంత ముట్టజెప్పినా కొన్ని సందర్భాల్లో మ్యాన్యువల్‌గా 1బీ, పహాణీల్లో పేర్లు మార్చి పాస్‌బుక్ ఇచ్చేవారు. వాటిని ఆన్లైన్లో నమోదు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించేవారు. దీంతో చేతిలో పాస్‌బుక్ ఉన్నా.. ఆన్లైన్లో మాత్రం పాత యజమానుల పేర్లే కనిపించేవి. వాస్తవానికి తాసిల్దార్ నోటీసు ఇచ్చిన తర్వాత నిర్ణీత గడువులోగా పాస్‌బుక్ మంజూరు చేయాల్సి ఉంటుంది. గతంలో 30 రోజులు ఉండగా తెలంగాణ ప్రభుత్వం దానిని 10 రోజులకు తగ్గించింది. అయినా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు.
మ్యుటేషన్‌కు దూరంగా 1.79 లక్షల మంది
రిజిస్ట్రేషన్ పేపర్లు ఉంటే చాలు తమ పేరు మీదికి పట్టా వచ్చినట్టేనని అనేకమంది భావించేవారు. దీంతో వారు మ్యుటేషన్ కోసం దరఖాస్తు కూడా చేసుకునేవారు కాదు. మరికొందరు పేద రైతులు అధికారులకు లంచాలు ఇచ్చుకోలేక, కార్యాలయాల చుట్టూ తిరగలేక మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకునేవారు కాదు. మరికొందరు మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకున్నా, అధికారులను బతిమాలుకునే ఓపిక లేక మధ్యలోనే వదిలేసేవాళ్లు. భూమి మన ఆధీనంలోనే ఉన్నది కదా అన్న భరోసాతో ఉండేవాళ్లు. ఫలితంగా 1బీలో పేరు మారక.. పహాణీల్లో పాత యజమానుల పేర్లే కొనసాగేవి. దీంతో ఒకే భూమిపై డబుల్ రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరిగేవి. మరోవైపు ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం, సబ్సిడీలు వంటివి అసలు రైతులకు చేరేవి కాదు. ఆ భూమిని అమ్మాలనో, కుదువ పెట్టాలనో ప్రయత్నించినప్పుడు వారికి విషయం అర్థమై.. అప్పటికప్పుడు మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకునేవారు. అక్కడి నుంచి మళ్లీ లంచాలు, దండాల కథ మొదలయ్యేది.
కోర్టు తీర్పులూ బేఖాతరు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్‌పల్లికి చెందిన డాక్టర్ పీ వెంకటముత్యంరావుకు 1992లో కోర్టు తీర్పు ద్వారా తన తమ్ముడి నుంచి 28.38 ఎకరాల భూమి దక్కింది. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగితే చివరికి 14 ఏండ్ల తర్వాత 2009లో పాస్‌బుక్ ఇచ్చారు. 2017లో రికార్డుల ప్రక్షాళన సమయంలో పరిశీలించగా ఆయన భూమి ఆన్లైన్లో ఎక్కలేదని తేలింది. ఇంకా తన తమ్ముడి పేరు మీదే కొనసాగుతున్నట్టు గుర్తించారు. అధికారులను ప్రాధేయపడినా పట్టించుకోకపోవడంతో 2019లో ఫిబ్రవరిలో హైకోర్టును ఆశ్రయించారు. ఏప్రిల్‌లో వెంకటముత్యంకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయినా అధికారులు అమలు చేయలేదు.
దీంతో మరోసారి హైకోర్టును ఆశ్రయించగా 2019 జూన్ 10న ద్విసభ్య ధర్మాసనం మళ్లీ అతడికే అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత నెలలు గడిచినా రికార్డులను మార్చలేదు. బాధితుడి ఆవేదనను నమస్తే తెలంగాణ ‘ధర్మగంట’లో ప్రచురించిన తర్వాత.. 2019 అక్టోబర్‌లో వెంకటముత్యంకు పాస్‌బుక్ మంజూరైంది. అంటే.. మూడు కోర్టులు చెప్పినా బాధితుడికి తన పట్టాపాస్‌బుక్ చేతికందడానికి 17 ఏండ్లు పట్టింది. ఇలా అనేక సందర్భాల్లో కింది స్థాయి రెవెన్యూ అధికారులు కోర్టులకు అతీతంగా వ్యవహరించేవారు. కోర్టులు తీర్పులు ఇచ్చినా, మొట్టికాయలు వేసినా పాస్‌బుక్ మంజూరు చేసేవారు కాదు.
పావుగంటలో పట్టా
ధరణి పోర్టల్ వచ్చాక రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ అత్యంత సులభంగా, పారదర్శకంగా మారింది. మొత్తం రైతు కేంద్రంగానే లావాదేవీలు నడుస్తున్నాయి. పోర్టల్ రాకతో మండల తాసిల్దార్ కార్యాలయాలు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులుగా కూడా మారాయి. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ మొత్తం తాసిల్దార్ కార్యాలయంలోనే జరుగుతున్నది. ఆఫీసులు రైతులకు చేరువ కావడమే కాదు.. పావుగంటలోనే పట్టా చేతికి వస్తున్నది.
ఈ సౌలభ్యాన్ని వదులుకుందామా?
రైతు విద్యావంతుడా, నిరక్ష్యరాస్యుడా అన్న సమస్య లేదు. లంచాలు ఇవ్వాలన్న రంది లేదు. ధరణితో తన వేలి కొనతో, కంటి చూపుతోనే తన భూమిని, తనకు ఇష్టం ఉన్నవారి పేరుమీదికి మార్చే శక్తి వచ్చింది. ఇంత సులభమైన, అత్యంత పారదర్శకమైన పద్ధతిని మార్చేస్తామని ప్రతిపక్షాలు అంటున్నాయి. రైతులు మళ్లీ ఆఫీస్‌ల చుట్టూ, డాక్యుమెంట్ రైటర్ల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతూ ఏండ్లకేండ్లు ఎదురుచూసే రోజులు తెస్తామంటున్నాయి. వారి అరాచక ఆలోచనలకు మద్దతు ఇద్దామా? ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామంటున్న కాంగ్రెస్‌నే బంగాళాఖాతంలో కలిపేద్దామా? ప్రజలే తేల్చాలి.
ధరణితో తీరిన బాధలు
ధరణి పోర్టల్‌ను ప్రారంభించిన తర్వాత ప్రభుత్వం పెండింగ్ మ్యుటేషన్లకు అవకాశం కల్పించింది. 1,79,470 పెండింగ్ మ్యుటేషన్ దరఖాస్తులు పరిష్కరించింది. అంటే.. గతంలో ఉన్న దోపిడీ విధానాలు, అసంబద్ధ చర్యల వల్ల రాష్ట్రవ్యాప్తంగా 1.79 లక్షల మంది మ్యుటేషన్ చేయించుకోలేదన్నమాట.
ధరణితో సులువైన రిజిస్ట్రేషన్
రైతు గోస నాడు..
ధరణి ఇచ్చిన భరోసా నేడు..
ఆఫీసుల చుట్టూ తిరుగుడు తప్పింది
నాకు నలుగురు కొడుకులు, ఒక బిడ్డ. 4.28 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. నాకు ఆరోగ్యం బాగలేక భూమి పంచిద్దామని ఎన్నో ఏండ్ల సంది అనుకున్న. ఆఫీసుల సుట్టూ తిరుగుడు నావల్ల కాదని ఆగిన. ధరణి వచ్చినంక తొందరగ రిజిస్ట్రేషన్ అయింతుందని తెలిసి నా పిల్లలను పిలిపించి, రిజిస్ట్రేషన్ చేయించిన. ఒక్క రోజులనే పనైపోయింది. ఆఫీసుల చుట్టూ తిరిగే లొల్లి లేదు. దళారులన్న మాటనే లేదు. ఒక్క పైసా ఖర్చు కాలె. – ఆకుల నారాయణ, హసన్‌పర్తి, హనుమకొండ జిల్లా
క్షణాల్లో రిజిస్ట్రేషన్ అయ్యింది
ధరణి రాకముందు చేర్యాలకు, జనగామకు పోయి ఆఫీసుల చుట్టూ తిరిగేది. ఇప్పుడా బాధల్లేవు. మండల కేంద్రంలనే రిజిస్ట్రేషన్ అయిపోతున్నది. మా నాయిన తన పేరు మీదున్న జాగా మా అన్నదమ్ముల పేర రిజిస్ట్రేషన్ చేయించిండు. ఒక రోజు స్లాట్ బుక్ చేసుకున్నం. తెల్లారి తాసిల్దార్ భూమి పత్రాలను పరిశీలించి ఫొటో దించి, ఇద్దరు సాక్షుల సంతకం తీసుకున్నరు. నిమిషాల్లో భూమి రిజిస్ట్రేషన్ అయినట్టు హక్కు పత్రాలు ఇచ్చిండ్రు.
– దాసారం వెంకటేశ్, ఆలింపూర్, బచ్చన్నపేట మండలం, జనగామ జిల్లా
భూ వివాదాలకు చెక్ పడింది
తరతరాలుగా ఉన్న భూ సమస్యలు ధరణితో పరిష్కారం అవుతున్నాయి. గతంలో పహాణీలు ఇవ్వడం వల్ల అధికారులు, నాయకులు రాత్రికి రాత్రే పేర్లను మార్చుకునేవారు. తెల్లారితే భూమి ఉన్న దో, పోయిందో తెలిసేది కాదు. ఇప్పుడు భూమి ఒకరి పేరు నుంచి మరో వ్యక్తికి మారాలంటే వేలిముద్ర వేయకుండా భూ లావాదేవీలు జరిపే అవకాశమే లే దు. ఇప్పుడు మా భూములు భద్రంగా ఉన్నాయన్న ధైర్యం వచ్చింది. ఇంత మంచిగా ఉ న్న ధరణిని తొలగించి మళ్లీ రైతులను ఇబ్బందులు పెట్టే పరిస్థితిని తీసుకురావాలని కాం గ్రెస్, బీజేపీ చూస్తున్నాయి.
– గాదనబోయిన కొమురయ్య, పెద్దముప్పారం, మహబూబాబాద్ జిల్లా
అక్రమ పట్టాలు బంద్ అయినయ్
ధరణి పోర్టల్ రాకముందు ఊళ్లో చాలా గొడవలయ్యేవి. ఒకరి భూమిని మరొకరు అక్రమంగా పట్టా చేపించుకునేటోళ్లు. అన్నదమ్ములు కూడా తల్లిదండ్రుల భూములను అక్రమంగా పట్టా చేపించుకొనేది. భూములను ఒక్కరు సాగు చేసుకుంటుంటే ఇంకొకరు పట్టా చేపించుకునేటోళ్లు. కేసీఆర్ సార్ ధరణి పోర్టల్ తెచ్చినంక అక్రమ పట్టాలు బందైనయ్. నేను ధరణి పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్నంక రెవెన్యూ అధికారుల నుంచి ఫోన్ వచ్చింది. ఆఫీస్‌కు పోయినంక నాకు 4 ఎకరాల పట్టా చేసి చేసి పాస్‌బుక్ ఇచ్చిండ్రు.
– కొడారి కొమురయ్య, వేశాలపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా
ధరణి పోర్టల్ ద్వారా జరిగిన లావాదేవీలు
(2020 నవంబర్ 2 నుంచి 2023 మే 27)
రిజిస్ట్రేషన్ : 19,41046
ఫౌతి : 2,32,632
భాగపంపకం : 29,458