Earthquake | పెద్దపల్లి, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ)/కోల్‌సిటీ : గోదావరిఖని కేంద్రంగా భూకంపం రానున్నదని ఎర్త్‌క్వేక్ రీసెర్చ్ అనాలిసిస్ సెంటర్ సంస్థ ఎక్స్‌లో చేసిన పోస్ట్ వైరల్‌గా మారుతున్నది. గురువారం నుంచి 17వ తేదీ మధ్య రిక్టర్ స్కేల్‌పై 5 తీవ్రతతో భూకంపం వచ్చే అవకాశం ఉన్నట్టు తెలిపింది. దీని ప్రభావంతో సమీపంలోని వరంగల్, హైదరాబాద్, ఏపీలోని అమరావతి, మహారాష్ట్ర వరకు ప్రభావం ఉంటుందని ఆ సంస్థ పేర్కొన్నది.
ఇది వైరల్‌గా మారటంతో పెద్దపల్లి జిల్లావ్యాప్తంగా దీనిపైనే చర్చ జరుగుతున్నది. ఇటీవల మయన్మార్, థాయిలాండ్‌లో భూకంపం సృష్టించిన బీభత్సం కండ్లముందు కదలాడుతుండటంతో, ఈ వార్త వెలుగులోకి వచ్చాక ప్రజలు వణికిపోతున్నారు. కానీ, ఈ సంస్థ సమాచారాన్ని ప్రభుత్వ సంస్థలు ఏవీ అధికారికంగా ధ్రువీకరించటం లేదు. దేశంలో భూకంప జోన్లు(జోన్-2, జోన్-3, జోన్-4, జోన్-5) ఉన్నాయి. జోన్-5 తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతం. ఇక్కడ భూమి కంపిస్తే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుంది.