హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడికి ఏర్పాటు చేసిన ఈగల్ బృందాలు గుర్రుపెట్టి నిద్రపోతున్నాయి. పక్క రాష్ట్రం పోలీసులు తెలంగాణలోకి వచ్చి సీక్రెట్ ఆపరేషన్ ద్వారా రూ.వేల కోట్ల మాల్‌ను సీజ్ చేసేవరకూ మనోళ్లు నిద్ర లేవలేదు. మరోవైపు ఏది లీగల్ డ్రగ్? ఏది ఇల్లీగల్ డ్రగ్? అనే వివరాలను తెలిపే డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) కేవలం మెడికల్ షాపులకే పరిమితమైంది. దీంతో మాదకద్రవ్యాల మత్తు తెలంగాణను కమ్మేసింది.
గంజాయి, కొకైన్, మెఫెడ్రోన్ లాంటి ప్రమాదకర డ్రగ్స్‌కు రాష్ట్రం నిలయంగా మారింది. యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్‌ను అరికట్టడంలో ప్రభుత్వ సంస్థలు, పోలీసులు, లా ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ఘోరంగా విఫలమవుతుండటంతో ‘ఉడ్తా తెలంగాణ’గా రాష్ట్రం అపకీర్తిని మూటగట్టుకుంటున్నది. ‘పల్లెలతోపాటు పాఠశాలలకూ డ్రగ్స్ వస్తున్నాయి. వాటిని కట్టడి చేయండి మొర్రో’ అని సీఎం రేవంత్‌రెడ్డే స్వయంగా మొరపెట్టుకోవడం సమస్య తీవ్రతకు అద్దం పడుతున్నది.
మెడికల్ షాపులకే డీసీఏ పరిమితం
హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని పారిశ్రామిక వాడల్లో ఎన్నో అనధికారిక డ్రగ్స్ కంపెనీలు ఇష్టారీతిన మాదకద్రవ్యాలు చేస్తున్నట్టు నిత్యం వార్తలు వస్తున్నా అటువైపు తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, యాంటీ నార్కోటిక్ టీమ్‌లు, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కేవలం మెడికల్ షాపుల్లో రెండు మూ డు రకాల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోవడంతోనే డీసీఏ అధికారులు సరిపెడుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. మన దగ్గర ఎన్ని పారిశ్రామిక వాడలు ఉన్నాయి? వాటిలోని కంపెనీలు ఏ తరహా డ్రగ్స్‌ను తయారు చేస్తున్నాయి? అవి లీగలా? ఇల్లీగలా? అనే వివరాలను అధికారులు తనిఖీ చేసిన దాఖలాలే లేవు.
పెరిగిపోతున్న డ్రగ్స్ బాధితులు
రాష్ట్రంలో డ్రగ్స్‌ను అరికట్టేందుకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘యాంటీ నార్కోటిక్ బ్యూరో’ను ఇప్పుడు సమర్థంగా అమలుచేసే అధికారులే లేరు. గొప్పల కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఆ విభాగం పేరును ‘ఈగల్’గా మార్చినప్పటికీ దాని పనితీరు అంతంత మాత్రమే. గతంలో మహానగరాల్లోని పబ్బుల్లో మాత్రమే వినిపించే డ్రగ్స్ పేర్లు ఇప్పుడు పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా రాష్ట్రమంతటా వినిపిస్తున్నాయి.
యూనివర్సిటీలు, కాలేజీలు, చివరికి స్కూళ్లలో సైతం విచ్చలవిడిగా డ్రగ్స్ దొరికుతున్నాయంటే మన నిఘా వ్యవస్థలు ఎంతలా విఫలమవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. రూ.500కే గంజాయి దొరుకుతుండటంతో యువత మత్తుకు బానిసలవుతున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లు, బస్టాండ్లు, శ్మశానాలు, పాడుబడ్డ భవనాలు, చెరువు గట్లు, రైలు పట్టాలపై గంజాయి దమ్ము కొడుతూ కనిపిస్తున్నారు. వారిని మార్చాల్సిన డీ-అడిక్షన్ సెంటర్లు కూడా అంతంతమాత్రంగానే
పనిచేస్తున్నాయి.
Ppp