సుబేదారి, అక్టోబర్ 20: ఓ హెడ్‌కానిస్టేబుల్ మంత్రి పేరు చెప్పి వేధించడంతో వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హనుమకొండలోని సుబేదారి పోలీసు స్టేషన్ పరిధిలోని గోకుల్‌నగర్‌లో ఆదివారం చోటుచేసుకున్నది. ఆగ్రహించిన బాధిత కుటుంబ సభ్యులు మృతదేహంతో కొండా సురే ఖ ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గోకుల్ నగర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఫైనాన్షియర్‌గా ఉన్న రమేశ్ ఐదేండ్ల క్రితం ఇదే కాలనీకి చెందిన విష్ణుకు రూ.3 లక్షలు అప్పు ఇవ్వగా.. కిరాణం షాపు వ్యాపారి రాంబాబు (52) మధ్యవర్తిగా ఉన్నాడు. అప్పు తీసుకున్న విష్ణు అడ్రస్ లేకుండా పోవడంతో ఉపాధ్యాయుడు రమేశ్ అసహనానికి గురయ్యాడు. దీంతో తన బంధువు సుబేదారి పోలీసు స్టేషన్లో ఇంటర్‌సెప్టర్ వాహన డ్రైవర్‌గా పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఉపేందర్‌తో కలిసి రాంబాబును వేధింపులకు గురిచేశారు. కొంత డబ్బు ఇచ్చాక కూడా ఉపేందర్ అతడిని బెదిరిస్తున్నాడు. ‘నేను మంత్రి కొండా సురేఖ వద్ద డ్యూటీ చేస్నున్న.. మొత్తం డబ్బులు ఇవ్వాలి.. లేకుంటే కేసు పెట్టి తొక్కిస్తా’ అని ఫోన్లో బెదిరించడంతో మనస్తాపానికి గురైన రాంబాబు ఈనెల 17న ఇంట్లో ఉన్న ఎలుకల మందు తాగాడు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. ఆగ్రహించిన మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు తమకు న్యాయం చేయాలని కోరుతూ రాంబాబు మృతదేహాన్ని హనుమకొండలోని మంత్రి కొండా సురేఖ ఇంటిముందు ఉంచి కొద్దిసేపు ధర్నా నిర్వహించారు.