Mancherial | హజీపూర్: మంచిర్యాల జిల్లాలో తవ్వకాల్లో అమ్మవారి విగ్రహం బయటపడింది. గోదావరి పరిక్రమ యాత్రలో భాగంగా నేలమాలిగ గ్రామానికి వచ్చిన స్వామీజీలు చెప్పిన మాట మేరకు ఇవాళ తవ్వకాలు జరపడంతో దుర్గాదేవి విగ్రహం కనిపించింది. ప్రత్యేక పూజల అనంతరం నిర్వహించిన ఈ తవ్వకాలను చూసేందుకు జనాలు భారీగా తరలివచ్చారు. తవ్వకాలు జరుపుతున్న సమయంలో కొంతమంది భక్తులు పూనకాలతో ఊగిపోయారు.
గోదావరి పరిక్రమ యాత్రలో భాగంగా ఈ నెల 12వ తేదీన మంచిర్యాల జిల్లాకు అయోధ్యలోని శ్రీరామమందిరంలోని పూజారితో పాటు వారణాసి, ఉత్తరప్రదేశ్‌కు చెందిన పీఠాధిపతులు, పలువురు స్వాములు వచ్చారు. ఈ సందర్భంగా ముల్కల మండలం నేలమాలిగలోని గోదావరి తీరంలో పుష్కరఘాట్‌కు వెళ్లే మార్గంలోని ఓ ప్రదేశాన్ని చూపించి, అక్కడ ఏదో తెలియని శక్తి ఉందని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇటీవల సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో స్థల యజమాని అనుమతి తీసుకున్న స్థానికులు, ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాల్లో సింహంపై కూర్చున్న దుర్గామాత విగ్రహం బయటపడింది. ఈ విషయం తెలిసి మంచిర్యాల పట్టణ ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చి, అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామీజీ చెప్పినట్లుగా అక్కడ దుర్గామాత విగ్రహం బయటపడటంతో గ్రామస్తులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది తమ గ్రామం చేసుకున్న అదృష్టమని చెబుతున్నారు.

తవ్వకాల్లో బయటపడిన దుర్గామాత విగ్రహం

తవ్వకాల్లో బయటపడిన దుర్గామాత విగ్రహం