హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): గ్లోబల్ వార్మింగ్ (భూతాపం)తోపాటు కాలుష్యం పెరగడంతో వాతావరణంలో పెనుమార్పులు చోటుచేసుకుని వానలు, వరదల్లో అసమతుల్యత చోటుచేసుకుంటున్నది. ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న పరిస్థితులే ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలో కొన్ని రోజుల నుంచి కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో వానలు బీభత్సం సృష్టించాయి. 31 జిల్లాల్లో సాధారణ స్థాయి కంటే 41% అదనపు వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది సెప్టెంబర్ 6 వరకు 608.7 మి.మీ. వాన కురువాల్సి ఉండగా.. శుక్రవారం నాటికి 855.7 మి.మీ. వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన నాటినుంచి 90 రోజుల్లో ఏకంగా 75 రోజులు వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఈ వానల్లో గతంలో ఎన్నడూ లేని వ్యత్యాసాన్ని వాతావరణ నిపుణులు గుర్తించారు. ఎక్కువ రోజులు వాన కురిసిన ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం.. తక్కువ రోజులు వాన కురిసిన చోట ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఎక్కువ వర్షాలు కురిసిన చోట చెరువులు, జలాశయాలు నిండలేదు. రాష్ట్రంలోని 34,716 చెరువుల్లో 65% మాత్రమే నిండడంపై ఇండో-జర్మన్ ైక్లెమేట్ చేంజ్ ప్రాజెక్టు చైర్మన్ చెన్నమనేని రమేశ్ ఆందోళన వ్యక్తం చేశారు.
6 వేల చెరువుల్లో సగం కూడా నిండని నీళ్లు
రాష్ట్రంలోని 6 వేల చెరువుల్లో నీటిమట్టం సగానికి కూడా పెరగలేదు. 2,200 చెరువుల్లో పావు వంతు నీళ్లు ఉన్నాయి. రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాల్లో 50% అధికంగా వానలు కురిసినప్పటికీ ఆ జిల్లాల పరిధిలోని 2,559 చెరువుల్లో కనీసం 40% కూడా నిండలేదు. మహబూబ్నగర్, ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం 1,800 చెరువులు పొంగిపొర్లుతున్నాయి. మరో 340 చెరువులు నిండాల్సి ఉన్నది.
వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ వల్లే ..
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అధికంగా, మరికొన్ని ప్రాంతాల్లో తక్కువగా వర్షాలు కురవటానికి గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులు, కాలుష్యం పెరిగిపోవడం, వ్యవసాయంలో పురుగు మందుల వినియోగం అధికమవడమే ప్రధాన కారణం. వీటి వల్ల ఒకే ప్రాంతాల్లోగా వానలు కురుస్తున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదవుతున్నది. ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు ప్రజలతోపాటు వాతావరణ సంస్థలు అప్రమత్తం కావాల్సిన అవసరమున్నది.
– ఇండో-జర్మన్ ైక్లెమేట్ చేంజ్ ప్రాజెక్ట్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్