రోడ్డుపై వెళ్తుంటే మనం ఒక్కరమే జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తే సరిపోదు. ఎదుటి వ్యక్తి కూడా అంతే జాగ్రత్తగా తన వాహనం నడుపాలి. లేకుంటే ఎదుటివాడు చేసిన పొరపాటుకు మనం ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉండొచ్చు. ఎక్సైజ్ శాఖకు అచ్చంగా ఈ సూత్రమే సరిపోతుంది. ఒక్క అధికారి అత్యాశతో తీసుకున్న నిర్ణయం మరో ఎనిమిది మంది అధికారులకు జీవితకాల శాపంగా మారింది.
హైదరాబాద్ , డిసెంబరు 28 (నమస్తే తెలంగాణ): ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ప్రమోషన్ కోసం పరితపిస్తాడు. అందుకోసం కొందరు పైరవీలు కూడా చేసుకుంటారు. కానీ ఎక్సైజ్ శాఖలో కొందరు ఉన్నతోద్యోగులు తమకు ప్రమోషన్ వద్దని ఏకంగా పైరవీలే చేసుకున్నారు. ఈ మేరకు తనకు పదోన్నతి వద్దని ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్‌కు ఇటీవలో ఓ అధికారి లేఖ ఇచ్చారు. దీనికి కారణమేమిటని ఆరా తీస్తే.. ప్రమోషన్లతో వచ్చే ప్రయోజనాల కంటే ప్రస్తుతం ఆయన హెడ్‌గా పనిచేస్తున్న జిల్లాలోనే ఆర్థిక ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నట్టు ఎక్సైజ్ వర్గాలు చెప్తున్నాయి. పైగా సదరు అధికారి ఎక్సైజ్ అధికారుల హక్కుల కోసం కొట్లాడే సంఘం బాధ్యుడు కూడ కావడం గమనార్హం.
ఉద్యోగోన్నతి తీసుకోవడం, తీసుకోకపోవడం ఆయన వ్యక్తిగతం అనుకోవచ్చు. కానీ, ఆయన అత్యాశ నిర్ణయంతో మరో 8 మంది ఎక్సైజ్ అధికారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రమోషన్ లిస్టులో పేరున్నా.. ఉద్యోగోన్నది పొందలేక జీవితకాలం నష్టపోతున్నారు. ఈ ప్రమోషన్ కోసం దాదాపు 10 ఏండ్లు ఎదురుచూసిన వాళ్లకు, తమకు ఆదర్శంగా ఉండాల్సిన ఆ అధికారి తీసుకున్న స్వార్థపూరిత నిర్ణయంతో ప్రమోషన్లకు దూరమయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 53 మంది ఎక్సైజ్ అధికారులకు ప్రమోషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ జాబితాలో ఇద్దరికి జాయింట్ కమిషనర్లుగా, 12 మంది డిప్యూటీ కమిషనర్లుగా, మరో 14 మందికి అసిస్టెంట్ కమిషనర్లుగా ప్రమోషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించింది. వీరిలో హైదరాబాద్ మహానరానికి ఆనుకొని ఉన్న ఒక జిల్లాకు బాస్‌గా ఉన్న అధికారి ప్రమోషన్ తీసుకోవడానికి నిరాకరించారు. తనకు ఉద్యోగోన్నతి వద్దు అంటూ అర్జీ కూడా పెట్టుకున్నారు. ఎక్సైజ్ శాఖలో ఆ జిల్లా బాస్ పోస్టింగ్ అంటే అడ్డగోలు ఆమ్దానీ అని పేరున్నది. ఒక్కో మద్యం దుకాణానికి శాశ్వత లైసెన్స్ కేటాయింపులకు రూ 2.5 లక్షల వసూళ్లు ఈ జిల్లా నుంచే మొదలైనట్టు ఆ శాఖలో చర్చ జరుగుతున్నది. ఇందులో రూ.1 లక్ష వాటా జిల్లా బాస్దేనని చెప్తున్నారు. ఇదికాకుండా ప్రతి దుకాణం నుంచి నెలకు రూ.5 వేల చొప్పున నెలవారీ మామూళ్లు ముడుతాయని సమాచారం.
ఈ శాఖలో డీసీ స్థాయి వరకే జిల్లా ముఖ్య అధికారిగా ఉంటారు. అంతకు మించితే ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో కొలువు. క్షేత్రస్థాయి పరిపాలనతో నేరుగా సంబంధం ఉండదు. జి ల్లా దాటిపోతే ఈ రాబడి ఉండదు. ఒకవేళ ఉన్నా.. చిన్నాచితక పర్సెంటేజీలతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని ఎక్సైజ్ శా ఖలో చర్చ జరుగుతున్నది. ఉద్యోగోన్న తి నిరాకరించిన ఆ అధికారి ఆ ప్రమోషన్ చైన్‌లో మొదటి శ్రేణిలోఉన్నారు. ప్రస్తుతం డీసీగా ఉన్న ఆయన జేసీ (జాయింట్ కమిషనర్)గా ప్రమోషన్ పొందారు. కానీ, ఆయన తనకు ఆ ప్రమోషన్ వద్దని కోరారు. దీంతో డి ప్యూటీ కమిషనర్ పోస్టుల్లో ఒకటి ఆగిపోయింది.
ఈ డీసీ పోస్టు ప్రభావం కింది స్థాయిలోని అసిస్టెంట్ కమిషనర్ (ఏసీ)పై, ఆ తర్వాత హెడ్ కానిస్టేబుల్, జూనియర్ అసిస్టెంట్ వరకు ఒక్కొక్కరి ప్రమోషన్ ఆగింది. వీళ్లంతా కమిషనర్‌ను కలిసి గోడు వెళ్లబోసుకున్నా నిబంధనలు అంగీకరించపోవడంతో కమిషనర్ చేతులెత్తేశారు. సదరు అధికారిపై మద్యం వ్యాపారుల నుంచి ఫిర్యాదు లు రావడం, తాజాగా అత్యాశతో ప్ర మోషన్ కూడా నిరాకరించడంతో ప్ర భుత్వం తొలుత ఏసీబీకి ఫి ర్యాదు చేసినట్టు తెలిసింది. తర్వాత పలు కారణాలతో హోల్డ్‌లో పెట్టాలని సూచించినట్టు శాఖలోనే ప్రచారం జరుగుతున్నది.