హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన మైనంపల్లి హన్మంతరావుకు, ప్రజా నాయకుడు, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కేటీఆర్‌ను విమర్శించే అర్హత లేదని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ పేర్కొన్నారు. ఇప్పటికే అనేక పార్టీలు మారిన ఆయన.. ‘మైనంపల్లి కాదు.. ఊసరవెల్లి’ అని ఎద్దేవా చేశారు. రాజకీయ భిక్ష కోసం నాడు కేటీఆర్ కాళ్లుపట్టుకున్న మైనంపల్లి, ఇప్పుడు రేవంత్ మెప్పు కోసం కేటీఆర్‌ను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. సింగరేణి అక్రమాల గురించి మాట్లాడిన బాల్క సుమన్‌పై కేసు పెట్టిన రేవంత్‌రెడ్డి.. మైనంపల్లిని ఎం దుకు వదిలిపెడుతున్నారు? డీజీపీ ఏం చేస్తున్నారు? సుమన్‌కు ఓ న్యా యం.. హన్మంతరావుకు మరో న్యా యమా? అని ప్రశ్నించారు.
మతిస్థిమితం కోల్పోయిన మైనంపల్లి ఖబడ్దార్.. మరోసారి కేటీఆర్‌పై విమర్శలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం, వేధించడం తప్ప ఉద్ధరించిందేమీలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతల దందాలను అడ్డుకున్న భూపాలపల్లి డీటీవో వెంకన్నను లారీలతో తొ క్కించి చంపారని ఆరోపించారు. అసమర్థ నేత రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని విమర్శించారు. శాంతిభద్రతలు దిగజారాయని, మంత్రులు, సీఎం మధ్య సఖ్యత లేదని ఆరోపించారు. రెండున్నరేండ్లలో కుంభకోణాలు తప్ప, సాధించిందేమీలేదని మండిపడ్డారు. రేవంత్ పాలనను గాలికొదిలి గాలిమోటర్లో ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ మాత్రం గల్లీల్లో తిరుగుతూ ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నదని స్పష్టం చేశారు.