న్యూఢిల్లీ: ఆర్టీఐ వివాదంపై బీజేపీపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే విరుచుకుపడ్డారు. తన విద్యాభ్యాసంపై ఆర్టీఐ ద్వారా వివరాలు కోరిన నేపథ్యంలో, బీజేపీ నేతలు కూడా తమ డిగ్రీలను బహిరంగంగా వెల్లడించాలని ఆయన సవాల్ విసిరారు. తన అమెరికా చదువుకు బోస్టన్ నుంచి వచ్చిన స్కాలర్షిప్, ఎడ్యుకేషన్ లోన్ ద్వారా నిధులు సమకూరినట్లు దీప్కే స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తూ ‘నా స్కాలర్షిప్ లెటర్, ఎడ్యుకేషన్ లోన్ పత్రాలను బయటపెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
మరి చక్రవర్తి తన డిగ్రీని చూపిస్తారా? అంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. తన చదువుకు ఎక్కడి నుంచి నిధులు వచ్చాయంటూ బీజేపీ కార్యకర్త ఆర్టీఐ దరఖాస్తు దాఖలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. సామాన్య కుటుంబానికి చెందిన యువకుడు విదేశాల్లో చదువుకుంటే బీజేపీ ఎం దుకు ఓర్వలేకపోతున్నదని ప్రశ్నించారు. మరోవైపు సీజేపీ పార్టీ నిధులపై వస్తున్న విమర్శలను ఖండిస్తూ, పార్టీ పూర్తి పారదర్శకంగా ఉంటుందని, ప్రజా విరాళాలు (క్రౌడ్ ఫండింగ్) ద్వారానే నిధులు సేకరిస్తామని దీప్కే వెల్లడించారు.