హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): ‘సెల్ఫీ విత్ తెలంగాణ ద్రోహులం’ అనే పేరుతో కాంగ్రెస్ నేతలు సెల్ఫీలు దిగాలని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ సూచించారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సెల్ఫీ విత్ కాంగ్రెస్ అనే కార్యక్రమంపై మంగళవారం ఆయన ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో 2007లో ముదిగొండలో కాల్పులు జరిపి ఏడుగురిని పొట్టనబెట్టుకొన్నారని విమర్శించారు. నేడు సెల్ఫీ విత్ కాంగ్రెస్ అంటే.. వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి సంతాపం తెలిపినట్టే ఉంటుందని ఎద్దేవా చేశారు. ఆర్డీఎస్ తూములను పగులగొట్టి తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాను ఆ పార్టీ నేతలు తరలించుకుపోయిన చరిత్రను మరువలేమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని అణచివేయడం వల్ల వందలాది మంది ఈ ప్రాంత బిడ్డలు బలిదానాలు చేసుకొన్న చరిత్రను తెలంగాణ సమాజం మరచిపోలేదని బాలరాజుయాదవ్ తెలిపారు.