హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల విశిష్టతను చాటిచెప్పే పూల పండుగ బతుకమ్మను దుబాయ్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గల్ఫ్ తెలంగాణ ఫోరం (జీటీఎఫ్), ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ (ఈటీసీఏ) సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబర్ 11న నిర్వహించనున్న ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిందిగా బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను నిర్వాహకులు సాదరంగా ఆహ్వానించారు. జీటీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆకుల సురేందర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఆదివారం కేటీఆర్‌ను స్వయంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేసింది. ప్రవాస తెలంగాణ కుటుంబాలు, మహిళలతో కలిసి వేడుకల్లో పాల్గొని తమకు ఉత్సాహాన్ని నింపాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా బతుకమ్మ వేడుకల ప్రత్యేక ప్రచార కరపత్రాన్ని గ్లోబల్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. అక్టోబర్ 11న దుబాయ్‌లో నిర్వహించనున్న బతుకమ్మ వేడుకల కార్యాచరణను నిర్వాహకులు విడుదల చేశారు. అక్టోబర్ 11న సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు జీటీఎఫ్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు కొనసాగుతాయి. అనంతరం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు ఈటీసీఏ ఆధ్వర్యంలో మరో వేడుక ఘనంగా నిర్వహిస్తారు. ఈ రెండు ప్రధాన కార్యక్రమాల్లోనూ కేటీఆర్ పాల్గొంటారని మహేశ్ బిగాల తెలిపారు. గల్ఫ్వాసులతో కేటీఆర్‌కు ఉన్న ప్రత్యేక అనుబంధం దృష్ట్యా ఆయన రాక ఈ ఉత్సవాలకు ప్రత్యేక శోభ, ఆకర్షణ తీసుకొస్తుందని ప్రతినిధులు పేర్కొన్నారు.
దుబాయ్‌లో ఉంటున్న తెలంగాణ ఆడపడుచులు సంప్రదాయ వస్త్రధారణతో తీరొక పూలతో బతుకమ్మలను పేర్చి, బతుకమ్మ పాటలతో ఆడిపాడేందుకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహిళలు, యువత, చిన్నారులతో కూడిన కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా నిర్వాహకులు పలు కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. భావితరాలకు తెలంగాణ మూలాలు, పండుగల విశిష్టతను తెలియజేసేందుకు ఈ ఉత్సవాలు వారధిగా నిలుస్తాయని నిర్వాహకులు తెలిపారు. కేటీఆర్‌ను కలిసిన ప్రతినిధి బృందంలో ఆకుల సురేందర్‌తోపాటు జయంత్‌కుమార్, అభినవ్, ఆకుల కల్యాణ్, లత తదితరులు ఉన్నారు.