హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : మనం దప్పికైతే నీళ్లెట్ల గడగడ తాగుతామో అట్లనే కరెంట్‌ను తాగేసే కంపెనీలొస్తున్నయ్! అవే విద్యుత్తును అమాంతం మింగేసే డాటా సెంటర్లు! ఈ కంపెనీల రాకతో రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ అమాంతం పెరుగబోతున్నది. ఎంత అంటే రాష్ట్రం ఇంత వరకూ వినియోగించనంత! ఇవి ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ శివారులో పెద్ద ఎత్తున ఏర్పాటుకానున్నాయి.
ఇప్పటికే రాష్ట్రంలో 30 వరకు డాటా సెంటర్లున్నాయి. గ్రేటర్ క్లౌడ్ కంప్యూటింగ్ కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఈ రంగంలో భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ‘హైవర్వాల్ట్’ కంపెనీ రూ.70 వేల కోట్ల పెట్టుబడితో ఫ్యూచర్ సిటీలో 1 గిగావాట్ డాటా సెంటర్ క్యాంపస్ నిర్మిస్తున్నది. అమెజాన్ చందనవెల్లి, ఫ్యూచర్‌సిటీలో 60 వేల కోట్ల భారీ పెట్టుబడి పెడుతున్నది. 20,383 మెగావాట్ల విద్యుత్తు అవసరయ్యే డాటా సెంటర్లు ఏర్పాటు కాబోతున్నాయి. అదానీ కంపెనీ కూడా డాటా సెంటర్ ఏర్పాటు చేయనున్నది. ఈ మేరకు ఆ ఆయా కంపెనీలు దక్షిణ డిస్కమ్‌కు దరఖాస్తు చేసుకున్నాయి. కొత్తగా వచ్చే డాటా సెంటర్లతో రాష్ట్ర విద్యుత్తు వ్యవస్థపై అదనపు భారం పడనున్నది.
పీక్ డిమాండ్ 18 వేల మెగావాట్లే
ఇప్పటి దాకా రాష్ట్ర పీక్ విద్యుత్తు డిమాండ్ 18 వేల మెగావాట్లుగానే ఉన్నది. ఈ ఏడాది మార్చి 27న 18,548 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదైంది. మార్చి 26న 18,052 మెగావాట్లు, మార్చి 13న 18,228, మార్చి 12న 18,095, మార్చి 3న 18,139 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ నమోదైంది. పరిస్థితులు ఇలా ఉంటే కొత్తగా ఏర్పాటయ్యే డాటా సెంటర్లకే 20 వేల మెగావాట్ల విద్యుత్తు కావాల్సి ఉన్నది. అంటే డిమాండ్ 38వేల మెగావాట్లకు చేరుతుంది. కాని రాష్ట్రంలో గ్రిడ్ సామర్థ్యం 25 వేల మెగావాట్లు మాత్రమే. మరీ డాటా సెంటర్ల డిమాండ్‌ను ఎలా భర్తీచేస్తారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గరిష్ఠ డిమాండ్ సమయంలో విద్యుత్తు సరఫరా వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడుతున్నది. వందల సబ్స్టేషన్లు ఓవర్‌లోడ్‌తో నడుస్తున్నాయి. దీనికి తోడు భారీ విద్యుత్తు వినియోగించే డాటా సెంటర్లు పెద్ద సంఖ్యలో అందుబాటులోకి వస్తే గ్రిడ్ తట్టుకుంటుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
నెట్వర్క్ విస్తరణ ఎక్కడ
ఒక్క గిగావాట్ డాటా సెంటర్ ఏడాదికి 876 కోట్ల యూనిట్ల విద్యుత్తును వాడుకుంటుంది. వంద మెగావాట్ల డాటా సెంటర్ 24 గంటలు పనిచేస్తే ఏడాదికి సుమారు 87.6 కోట్ల యూనిట్ల విద్యుత్తును తాగేస్తుంది. 50 మెగావాట్ల డాటా సెంటర్ ఏడాదికి 438 కోట్ల విద్యుత్తును వినియోగిస్తుంది. ఏఐ డాటా సెంటర్లకు విద్యుత్తు, గ్రిడ్ సామర్థ్యం, ట్రాన్స్మిషన్ వంటివే కీలకం. డాటా సెంటర్లతో పాటు పారిశ్రామిక, వాణిజ్య, గృహ విద్యుత్తు అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో గ్రిడ్ బలోపేతం, విద్యుత్తు నెట్వర్క్ విస్తరణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన తర్వాత 132, 220, 400 కేవీ సబ్స్టేషన్లు ఒక్కటి కూడా నిర్మించలేదు. కొత్తలైన్లు వేయలేదు. నెట్‌వర్క్‌ను విస్తరించేదు. ఓవైపు డిమాండ్ పరుగులు పెడుతుంటే.. నెట్వర్క్ విస్తరణ నత్తనడకన సాగడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ ప్రాజెక్ట్‌లకు కరెంట్ ఎక్కడి నుంచి తేవాలన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పెట్టుబడులు ఆహ్వానించడం.. డాటా సెంటర్లు ఏర్పాటు చేయడం మాత్రమే సరిపోదని.. వాటికి అవసరమైన విద్యుత్తు నెట్వర్క్ విస్తరణను ముందుగానే సిద్ధం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని విద్యుత్తు రంగ నిపుణులు పేర్కొంటున్నారు.