సిటీబ్యూరో/బడంగ్‌పేట, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఒకరికి బదులు మరొకరు విధులు నిర్వహిస్తూ అమాయకులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు నగరంలో వరుసగా జరుగుతున్నాయి. ఇటీవల పాతబస్తీలో ఓ యువకుడు లైన్మెన్కు బదులు నిర్వహిస్తుండగా షాక్ రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మరవకముందే మరొక ఘటన మీర్‌పేటలో జరిగింది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆర్జిసన్గా పనిచేస్తున్న కర్నాటి కృష్ణకాంత్ (43) ఆదివారం ఉదయం కరెంటు షాక్‌తో మృతి చెందారు. ఆయనకు భార్య శాంత , ఇద్దరు పిల్లలు ఉన్నారు. కృష్ణకాంత్ నల్గొండ జిల్లా చింతపల్లి మండల కురుమేడు గ్రామానికి చెందిన కృష్ణకాంత్ మీర్పేట్ నందనవనం సబ్‌స్టేషన్‌కు అనుబంధంగా విధులు నిర్వర్తిస్తున్నాడు. నందిహిల్స్ రోడ్డు నంబర్ 2లోని ఓ ఇంటికి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
సమాచారం అందుకున్న ఏఈ బాలాగౌడ్ లైన్మెన్ శ్రీధర్ రెడ్డికి చెప్పడంతో ఆయన తనకు బదులు కృష్ణకాంత్‌ను అక్కడికి పంపించారు. నంది హిల్స్‌లోని శ్రీవెంకటాద్రి నివాస్ దగ్గర ఫిర్యాదు చేసిన ఇంటి వద్ద విద్యుత్ మీటర్‌ను పరిశీలించిన అనంతరం రోడ్డు పై ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ దగ్గరకు వచ్చాడు. ఫిర్యాదు ఇచ్చిన ఇంటికి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ను ఆఫ్ చేసి.. వచ్చి శ్రీ వెంటాద్రి నివాస్ దగ్గర ప్రైవేట్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర చెక్ చేస్తుండగానే కరెంటు షాక్ కొట్టి కింద పడినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఎల్టీ లైనును తాకడంతో కృష్ణకాంత్‌కు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న మృతుడి బంధువులు ఘటనాస్థలానికి చేరుకుని మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఘటన జరిగిన తర్వాత నాలుగైదు గంటల వరకు స్థానిక విద్యుత్ అధికారులు ప్రమాదస్థలానికి రాకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారులు, కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ప్రైవేటు ట్రాన్స్ఫార్మర్లు రోడ్డుపై ఏర్పాటు చేయడమేంటని, నిబంధనలకు విరుద్ధంగా కనెక్షన్ ఎలా ఇచ్చారంటూ.. ఆర్టిజన్స్ అసోసియేషన్ బాధ్యులు ప్రశ్నించారు. విద్యుత్ సరఫరా నిలిపివేసినప్పటికీ లైన్లో కరెంట్ ఎలా సరఫరా జరిగిందనే విషయంలో అధికారులు ఆరా తీస్తున్నారు. విధి నిర్వహణలో కరెంట్ షాక్ తగిలి డిపార్టుమెంట్‌కు సంబంధించిన వ్యక్తి మృతి చెందితే విద్యుత్ అధికారులు సకాలంలో ఎవరూ స్పందించక పోవడంపై మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు, ఆర్టిసన్స్ కృష్ణకాంత్ మృతదేహంతో రోడ్డుపై ఆందోళన చేశారు. విద్యుత్ అధికారులు అక్కడికి వచ్చిన క్రమంలో ఆందోళన చేస్తున్న వారంతా డీఈ, ఏఈలతో వాగ్వాదానికి దిగారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కృష్ణ కాంత్ మృతి చెందాడని, ఈ ఘటనకు స్థానిక డీఈ, ఏఈ బాలాగౌడ్, లైన్ మెన్, కాంట్రాక్టర్లు బాద్యత వహించాలంటూ నినాదాలు చేశారు. మృతుడి కుంటుంబానికి కోటి రూపాయల నష్ట పరిహారం, కృష్ణకాంత్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆర్టిజన్లు, బంధువులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డీఈని ఘెరావ్ చేస్తున్న క్రమంలో పరిస్థితి పోలీసులు వారిని అడ్డుకుని మృతదేహాన్ని అక్కడి నుంచి ఉస్మానియా ఆసుపత్రికి మార్చురీకి తరలించారు.
ఘటనకు సంబంధించి కాంట్రాక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, యూనిస్ఖాన్ల నిర్లక్ష్యం ఉందంటూ ప్రాథమికంగా నిర్ధారించి వారిపై కేసు నమోదు చేసినట్లు మీర్‌పేట ఇన్స్పెక్టర్ శోభన్ తెలిపారు. కృష్ణకాంత్ మృతితో అతడి తల్లిదండ్రులు సరోజ, దేవదాసు, భార్య శాంత రోదిస్తున్న తీరు అందరినీ కంటతడిపెట్టించింది. గతంలో మీర్‌పేటలోనే కృష్ణకాంత్ తమ్ముడు రత్నకుమార్ కూడా కరెంట్ షాక్‌తోనే మృతిచెందాడు. ప్రస్తుతం కరెంట్షాక్తోనే కృష్ణకాంత్ కూడా మృతిచెందడంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు వేర్వేరు సందర్భాల్లో విద్యుత్ ప్రమాదం వల్లే చనిపోవడం అందరినీ కలిచివేసింది. ఏదైనా ఘటన జరగగానే వెంటనే స్పందించే టీజీఎస్పీడీసీఎల్ అధికారులు ఈ ఘటనపై స్పందించలేదు. ఒకరికి బదులు మరొకరు విధులు నిర్వర్తిస్తున్నారనే విషయం ఉన్నతాధికారుల వరకు తెలిసినా పట్టించుకోకుండా ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతున్నారంటూ మింట్‌కాంపౌండ్‌లో చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంలో తామేం చేయలేమని ఆర్టిజన్లకు, లైన్మెన్ల నుంచి డీఈల వరకు రకరకాల వ్యవహారాలు ఉంటాయంటూ డిస్కంలో ఓ డైరెక్టర్ ఆఫ్‌ది రికార్డుగా చెప్పారు.