నమస్తే తెలంగాణ నెట్వర్క్: కాంగ్రెస్ వెయ్యి రోజులపాలనపై బీఆర్ఎస్ పోరుబాట చేపట్టింది. ఈ వెయ్యి రోజుల పాలనలో ఆటోడైవ్రర్లకు ఇచ్చిన హామీలపై ఎక్కడికక్కడ నిలదీసింది. అలాగే పల్లెల విధ్వంసంపై విరుచుకుపడింది. ఈ సందర్భంగా ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించి సర్కార్ అసమర్థ్ధత పాలనను ఎండగట్టింది. సింగరేణి సంస్థలోనూ జరిగిన అవినీతిపై నిలదీసింది. ఆదివారం నిరసనల్లో భాగంగా ఐదోరోజు ఆటోడ్రైవర్లు బీఆర్ఎస్ నిరసనలకు మద్దతు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసనల్లో ఆటోడ్రైవర్లు పెద్దఎత్తున ఆటోలతో తరలివచ్చి ర్యాలీల్లో పాల్గొని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ర్యాలీలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నిర్వహించిన ర్యాలీలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాల్గొన్నారు. కరీంనగర్లో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్వయంగా ఆటో నడిపి ర్యాలీ ప్రారంభించారు.
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలో నిర్వహించిన నిరసన ర్యాలీలో మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ ఆటో నడిపారు. వరంగల్‌లో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆటోర్యాలీలో పాల్గొని నిరసన తెలియజేశారు. వికారాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎల్బీనగర్లో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, కుత్బుల్లాపూర్‌లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఉప్పల్‌లో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆటో డ్రైవర్లలో ర్యాలీలో పాల్గొన్నారు.

వెయ్యి రోజుల పాలనలో పల్లెల విధ్వంసం: పువ్వాడ
రాష్ట్రంలో పారిశుద్ధ్యం పడకేసిందని బీఆర్ఎస్ మండిపడింది. కాంగ్రెస్ సర్కార్ వెయ్యిరోజు పాలనపై ‘పల్లెల విధ్వంసం పడకేసిన పారిశుధ్యం’ అనే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా జూలూరుపాడులో నిర్వహించిన సభలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ర్యాలీలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్ రెడ్డి, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత తదితరులు పాల్గొన్నారు. వనపర్తి జిల్లా అమరచింతలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీగా ర్యాలీ నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల కేంద్రంలో చేపట్టిన నిరసనలో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి పాల్గొని రేవంత్ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సర్కార్ కమీషన్ సంస్థగా సింగరేణి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
సింగరేణిని ఒక కమీషన్ సంస్థగా కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నదని మాజీ మంత్రి, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్, మాజీ విప్ బాల్క సుమన్, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షు డు మిర్యాల రాజిరెడ్డి మండిపడ్డారు. ఆదివారం మంచిర్యాల జిల్లా నస్పూర్ తెలంగాణ భవన్, మందమర్రి సింగరేణి సీఈఆర్ క్లబ్లో టీబీజీకేఎస్, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభు త్వం, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీల మోసపూరిత హామీలపై నిరసన సదస్సు నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు జేకే 5 ఓసీ వద్ద టీబీజీకేఎస్ ఇల్లెందు ఏరియా ఉపాధ్యక్షుడు అబ్దుల్ జాఫర్ హుస్సేన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్తోపాటు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.





