హైదరాబాద్/జయశంకర్ భూపాలపల్లి (నమస్తే తెలంగాణ)/గణపురం జూన్ 22 : విధి నిర్వహణలో ఉన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్చార్జి రవాణా అధికారి (డీటీవో) వెంకన్నను బొగ్గు లారీ కబళించింది. వాహన తనిఖీలు నిర్వహిస్తున్న డీటీవో వెంకన్న వైపు ఒక్కసారిగా బొగ్గు లారీ దూసుకొచ్చింది. సెక్యూరిటీ సిబ్బంది తేరుకునేలోపే లారీ వెనుక టైర్ల కింద పడి ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. జిల్లా ఆర్టీవో కార్యాలయ సమీపంలోనే ఈ విషాదం చోటుచేసుకున్నది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ హఠాత్పరిణామంపై స్థానికంగానే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగ సంఘాలు, విపక్షాలు డీటీవో మరణంపై సమగ్ర విచారణ జరుపాలని డిమాండ్ చేస్తున్నారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం దాకా వెల్లువెత్తిన అభిప్రాయాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించింది.
పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. గణపురం మండల పరిధిలోని జిల్లా ఆర్టీవో కార్యాలయం సమీపంలో సోమవారం ఉదయం డీటీవో వెంకన్న కరపల్లి ప్రాంతంలో తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. సరైన పత్రాలు లేని ఒక హార్వెస్టర్ (వరికోత యంత్రం)ను సీజ్ చేశారు. ఈ హార్వెస్టర్‌ను ఆర్టీవో కార్యాలయానికి తరలించారు. తమ బృందం కార్యాలయ ప్రవేశద్వారం వద్దకు చేరుకోగానే డీటీవో తన కారును రోడ్డు పకన నిలిపివేసి, సీజ్ చేసిన హార్వెస్టర్‌ను ఆఫీస్ లోపలికి పంపించే ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అదే సమయంలో భూపాలపల్లి వైపు నుంచి అతివేగంగా ఒక బొగ్గు లారీ వస్తుండటాన్ని గమనించిన డీటీవో, దానిని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే, అప్పటికే నియంత్రణ కోల్పోయిన ఆ బొగ్గు లారీ ముందున్న హార్వెస్టర్‌ను, అటుపక్కనే పార్ చేసి ఉన్న డీటీవో కారును ఢీకొంటూ, దానికి ఆనుకొని ఉన్న వెంకన్నపైకి దూసుకెళ్లింది.
లారీ చక్రాలు వెంకన్నపై నుంచి దూసుకెళ్లడంతో ఆయన ఘటనా స్థలిలోనే కన్నుమూశారు. విషయం తెలుసుకొన్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొన్నారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు, స్టేట్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (జేటీసీ) చంద్రశేఖర్‌గౌడ్ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించి సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. గణపురం పోలీస్‌స్టేషన్‌లో ప్రమాదానికి కారణమైన లారీని పరిశీలించి, డ్రైవర్‌ను విచారించారు. ఓ సమర్థుడైన అధికారిని కోల్పోవడం బాధాకరమని పేరొన్నారు. అనంతరం జిల్లా ప్రధాన దవాఖానలో ఉన్న డీటీవో మృతదేహాన్ని సందర్శించి, కుటుంబసభ్యులను ఓదార్చారు. మృతుడికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
బొగ్గు మాఫియా పేట్రేగిపోయింది. వాహనాలు తనిఖీ చేస్తున్న జిల్లా రవాణా అధికారి (డీటీవో)ని టిప్పర్ మింగేసింది. ఆపుతున్నా ఆగకుండా దూసుకొచ్చి ఢీకొట్టింది. సిబ్బంది తేరుకునేలోగా.. వెనుక చక్రాల కిందపడి డీటీవో వెంకన్న నుజ్జునుజ్జయ్యి కనిపించారు. భూపాలపల్లి జిల్లా గణపురం సమీపంలో సోమవారం ఉదయం జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.

మహబూబాబాద్ జిల్లా మరిపెడ (బంగ్లా) స్వస్థలమైన వెంకన్న 2012లో అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ)గా రవాణా శాఖలో ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. ఈ నెల 4న జగిత్యాల జిల్లా నుంచి బదిలీపై భూపాలపల్లి ఇన్చార్జి డీటీవోగా బాధ్యతలు స్వీకరించారు. విధుల్లోచేరిన కొద్దిరోజులకే ఈ ఘోరం జరుగడాన్ని సహోద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం హనుమకొండలో నివాసముంటున్న ఆయన, త్వరలోనే భూపాలపల్లికి కుటుంబసభ్యులతో వస్తానని తన సన్నిహితులతో చెప్తుండేవారు. అంతలోనే ఈ విషాదం చోటుచేసుకోవడంతో ఇటు సహోద్యోగులు, అటు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
డీటీవో వెంకన్న మృతికి కారకుడైన బొగ్గు టిప్పర్ డ్రైవర్ మహ్మద్ తస్లీమ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. డ్రైవర్ జార్ఖండ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించి విచారించగా లారీ యజమాని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మహ్మద్ మహబూబ్‌ఖాన్‌కు చెందినదిగా నిర్ధారించారు. కాగా, జిల్లా ఎస్పీ సంకీర్త్ విచారణ చేపట్టి ఘటనపై ఎలాంటి అనుమానాలు లేవని, ఘటనను అన్నికోణాల్లో విచారణ చేస్తున్నామని తెలిపారు. యజమానికి మూడు లారీలున్నాయని, అవి తాడిచెర్ల ఓసీ (ఓపెన్‌కాస్ట్) నుంచి కేటీపీపీ (కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్)కు బొగ్గు రవాణా చేస్తున్నాయని, ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఘటన జరిగిందని పోలీసుల విచారణలో వెల్లడైంది.
విధి నిర్వహణలో ఉన్న ఓ ఉన్నతాధికారి లారీ కిందపడి మరణించడంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన, దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. డీటీవో ఎం వెంకన్న మృతిని అత్యంత సీరియస్‌గా తీసుకొన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ (జేటీసీ) చంద్రశేఖర్‌గౌడ్‌ను విచారణాధికారిగా నియమిస్తూ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రమాదం వెనుక ఉన్న అసలు కారణాలు, పరిస్థితులను అన్వేషించాలని ప్రభుత్వం ఆదేశించింది. విచారణాధికారిగా చంద్రశేఖర్‌గౌడ్ ఈ ఘోర ప్రమాదంపై త్వరితగతిన సమగ్రంగా విచారణ జరిపి, పూర్తి వివరాలతో కూడిన నివేదికను రవాణా శాఖ కమిషనర్ ద్వారా ప్రభుత్వానికి సాధ్యమైనంత త్వరగా సమర్పించాల్సి ఉంటుంది. రోడ్లపై వాహనాలను తనిఖీ చేసేటప్పుడు, పట్టుకొనేటప్పుడు ఫీల్డ్ అధికారులు, సిబ్బంది రక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ విచారణాధికారి కీలక సూచనలు చేయనున్నారు. ఇలాంటి విషాదకర ఘటనలు పునరావృతం కాకుండా ఫీల్డ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రొటోకాల్స్, భద్రతా పరికరాలు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్(ఎస్వోపీ)లో తీసుకొని రావాల్సిన మార్పులను కూడా ఈ నివేదికలో పొందుపరచాలని ప్రభుత్వం ఆదేశించింది.
డీటీవో వెంకన్న దుర్మరణం పట్ల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. మంత్రి పొన్నంతోపాటు జేటీసీ చంద్రశేఖర్‌గౌడ్ తదితరులు వెంకన్న మృతదేహాన్ని సందర్శించి, నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. వెంకన్న మృతిపట్ల అసోసియేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ టెక్నికల్ ఆఫీసర్స్ సంతాపం తెలియజేసింది. ఆయన మృతి అత్యంత విషాదకరమని అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్‌కుమార్, ప్రధాన కార్యదర్శి సురేశ్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు, రవాణా రంగానికి విశేష సేవలందించారని కొనియాడారు. ఆయన అకాల మరణం రవాణా శాఖ, కుటుంబసభ్యులు, సన్నిహితులకు తీరని లోటని పేరొన్నారు. వెంకన్న కుటుంబానికి అసోసియేషన్ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు.
డీటీవో వెంకన్న మృతి బొగ్గు మాఫియా పనేనా? అనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఉద్యోగుల సంఘం జేఏసీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి ప్రమాదంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మృతిపై విచారణ జరుపాలని, కారకులపై చర్యలు తీసుకోవాలని, ఇది ముమ్మాటికీ బొగ్గు మాఫియా పనేనని ఆరోపించారు. ఆర్టీవో వ్యవస్థ భద్రతపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. బొగ్గు అక్రమ రవాణాపై తనిఖీలు నిర్వహిస్తున్న ఆర్టీవో అధికారులకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే సింగరేణిలో జరుగుతున్న బొగ్గు మాఫియాను మాజీ మంత్రి హరీశ్‌రావు బట్టబయలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్టీవో బొగ్గు టిప్పర్ ఢీకొని మృతి చెందడంతో బొగ్గు మాఫియాపై అనుమానాలకు మరింత బలం చేకూరుతున్నది. మరోవైపు, ఇటీవలి కాలంలో అధికారులపై బొగ్గు లారీల యజమానులు పలు సందర్భాల్లో ఆరోపణలు చేసిన ఉదంతాలున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రవాణా శాఖ అధికారులకు టార్గెట్లు పెట్టి మరీ జరిమానాలు వసూలు చేస్తున్నదని, ఈ క్రమంలోనే అధికారులు లారీ యజమానులను వేధిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వెంకన్న మృతి రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది రోడ్డు ప్రమాదం కాదని, బొగ్గు మాఫియా పనేనని విపక్షాలు, ఉద్యోగ సంఘాలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నాయి. ఇది ప్రమాదమా? ఉద్దేశపూర్వకంగా ఎవరైనా చేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి దాకా రాష్ట్రవ్యాప్తంగా ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం ఘటనపై జేటీసీ చంద్రశేఖర్‌గౌడ్‌ను విచారణకు ఆదేశించింది. భూపాలపల్లి ఆర్టీవో కార్యాలయం ముందు సోమవారం ఉదయం హార్వెస్టర్ వాహనాన్ని కార్యాలయంలోకి తీసుకెళ్తున్న క్రమంలో రోడ్డుపై ఉన్న ఆర్టీవో వెంకన్నను టిప్పర్ ఢీకొట్టడం, దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందడం క్షణాల్లో జరిగిపోవడంపై ఉద్యోగ సంఘాలు బొగ్గు మాఫియాపై అనుమానాలు వ్యక్తంచేశాయి.