హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : గుప్త బంగారం పేరుతో అమాయకులను లక్ష్యంగా చేసుకొని రూ.లక్షల్లో మోసగిస్తున్న డీఎస్పీని అరెస్టు చేసేందుకు పోలీసులు వెనకాడుతున్నారు. అతనిపై ఇప్పటికే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినా.. ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడి అండదండలతో అతన్ని అరెస్టు చేయలేకపోతున్నారు. పలువురు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి రూ.లక్షలు దండుకున్న అతన్ని అరెస్టు చేసి విచారించడానికి జంకుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఎక్కడ పని చేసినా వివాదాస్పద డీఎస్పీగా పేరున్న గగులోత్ మదన్‌లాల్ అమాయకులే లక్ష్యంగా రెచ్చిపోతున్నాడు. వరంగల్, హన్మకొండ, కామారెడ్డిలో విధులు నిర్వర్తించి పోలీసుశాఖకు చెడ్డపేరు తెచ్చాడు. వరంగల్‌లో డీఎస్పీగా పనిచేసినప్పుడు ఓ వ్యక్తి నుంచి రూ.13 లక్షలు తీసుకొని చెక్‌బౌన్స్ కేసులు ఎదుర్కొంటున్నాడు. డబ్బులు అడిగితే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి జైల్లో వేస్తానని బెదిరిస్తున్నాడు.
దీంతో బాధితుడు కోర్టుకు వెళ్లి ‘గార్నిస్ ఆర్డర్’ తెచ్చుకున్నట్టు తెలిసింది. ఇదే కేసులో సదరు డీఎస్పీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఇక కామారెడ్డిలో విధులు నిర్వర్తిస్తూ.. తన ఇంటి పక్కన వ్యక్తికి గుప్త బంగారం ఇప్పిస్తానని నమ్మించి రూ.17 లక్షలు దండుకున్నాడు. బాధితుడు కామారెడ్డి ఎస్పీని ఆశ్రయించడంతో ఆ కేసులో రూ.9 లక్షల వరకు సెటిల్ చేసుకున్నాడు. దీంతో అప్పుడే అతన్ని డీజీపీ ఆఫీస్‌కు అటాచ్ చేసి విచారణ అనంతరం ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. రిటైర్మెంట్ దగ్గరకు వచ్చినా.. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ లక్షల్లో మోసం చేసినట్టు సమాచారం. సదరు డీఎస్పీకి మరో ఇద్దరు డిపార్ట్మెంట్ వ్యక్తులు సహకరిస్తున్నట్టు సమాచారం. ఎంతోమందిని మోసం చేసినా అతన్ని అరెస్టు చేయకపోవడంతో బాధితులు న్యాయం చేయాలని కోరుతున్నారు.