DSC Paper Leak | హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ పేపర్ లీకయిందా? ప్రశ్నలను కావాలనే కొందరు అధికారులు లీక్ చేశారా? అన్న ప్రచారం ఇప్పుడు సోషల్‌మీడియాలో జోరుగా సాగుతున్నది. గత నెలలో డీఎస్సీ కోసం ఒక పరీక్షలో వచ్చిన ప్రశ్నలు.. అదే పోస్టు భర్తీకి మరోరోజు నిర్వహించిన పరీక్షలో పునరావృతం కావడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల్లో ఏకంగా 18 ప్రశ్నలు పునరావృతం అయ్యాయి. నాలుగు రోజుల ముందు వచ్చిన ప్రశ్నలే ఐదోరోజూ రిపీట్ అయ్యాయి.
జూలై 19న మొదటి షిప్ట్‌లో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) అభ్యర్థులకు ఇచ్చిన ప్రశ్నపత్రంలో వచ్చిన ప్రశ్నలు.. జూలై 23న నిర్వహించిన రెండో సెషన్లోనూ రిపీట్ అయ్యాయి. విచిత్రమేమంటే ప్రశ్న నం బర్ కూడా మారలేదు. రెండు పేపర్లలోనూ ఒకే నంబర్ ఇవ్వడం గమనార్హం. ఇక ప్రశ్నలు అచ్చుగుద్దినట్టుగా ఉండగా, ఆప్షన్లు సైతం ఒకేరకంగా వచ్చాయి. సహజంగా పరీక్షకు ముందే ప్రశ్నలు బయటికొచ్చినా.. పేపర్ బయటికొచ్చినా లీకేజీగా పరిగణిస్తారు. పరీక్ష ప్రారంభమయ్యాక బయటికొస్తే పేపర్ ఔట్‌గా పరిగణిస్తారు.
23న పరీక్ష ప్రారంభానికి ముందే 18 ప్రశ్నలు బయటకు వచ్చాయంటే దీనిని పేపర్ లీకేజీగా పరిగణించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. పరీక్ష పూర్తయిన తర్వాత కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు, పోటీ పరీక్షల శిక్షకులు వెంటనే ఆన్లైన్లో, యూట్యూబ్‌లో కీ పేపర్ ను ఇచ్చారు. కొన్ని ప్రశ్నలకు అప్పటికప్పుడు సమాధానాలను ఆన్లైన్లో బయటపెట్టారు. 19న సైతం ఇలాగే పలు ప్రశ్నలకు ఆన్సర్లు బయటపెడితే, వాటిని చూసిన వారు 23న పరీక్షకు హాజరైతే వారికి లాభం చేకూరే అవకాశం ఉన్నదని కొందరు అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది పేపర్ లీకేజీయేనని అభిప్రాయపడుతున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి వైఫల్యం!
సాక్షాత్తు సీఎం రేవంత్‌రెడ్డియే విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన ఆధ్వర్యంలో జరిగిన పరీక్షల్లో ఇంత పెద్ద తప్పిదం చోటుచేసుకోవడం సీఎం వైఫల్యమేనని అభివర్ణిస్తున్నారు. గతంలో ఎస్సెస్సీ పరీక్షల సమయంలో పరీక్ష ప్రారంభమైన తర్వాత ప్రశ్నపత్రం బయటకు రాగా అప్పుట్లో కాంగ్రెస్ నే తలు పేపర్ లీకు అంటూ హడావుడి చేశా రు. ఇప్పుడు 23న వచ్చిన ప్రశ్నలు 19వ తేదీనే బయటికొచ్చాయి. దీనిని పేపర్ లీకేజీగా భా వించి డీఎస్సీ పరీక్షలను రద్దు చేయాలని, ఆన్‌లైన్‌కు బదులుగా ఆఫ్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
అధికారుల పాత్రపైనా అనుమానాలు
ప్రశ్నల పునరావృతం వెనుక పెద్ద కుట్ర ఉన్నట్టుగా అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. దీని వెనుక కొందరు అధికారుల పాత్ర ఉన్నదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డీఎస్సీ పరీక్షలను 26 ప్రశ్నపత్రాలను రూపొందించారు. పాఠశాల విద్యాశాఖ, ఎస్సీఈఆర్టీ నిపుణులతో కాన్ఫిడెన్షియల్ బృందాన్ని నియమించి రహస్యంగా ప్రశ్నపత్రాలను రూపొందించినట్టు అధికారులు ప్రకటించుకున్నారు.
పలు ఆరోపణలు, తప్పిదాలకు కారణమైన, బాధ్యులైన ఎస్సీఈఆర్టీకే డీఎస్సీ ప్రశ్నపత్రాల రూపకల్పన బాధ్యతలు అప్పగించడంలో అంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వారు.. దర్యాప్తు సం స్థల విచారణ ఎదుర్కొన్న వారికి ప్రశ్నపత్రాల రూపకల్పన బాధ్యతలు ఎలా అప్పగిస్తారని, దీని వెనుక ఏదో గూడుపుఠాని ఉన్నదని, దర్యాప్తు సంస్థలచేత విచారణ జరిపించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
అణచివేతపైనే శ్రద్ధ
డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు నెల రోజులపాటు రోడ్డెక్కారు. టెట్ కు డీఎస్సీకి మధ్య వ్యవధి తక్కువగా ఉండగా, గ్రూప్-2 పరీక్ష ఆగస్టులోనే ఉండటంతో డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని కోరా రు. మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌ను ముట్టడించారు. ర్యాలీ నిర్వహించారు. పలువురు మహిళా అభ్యర్థులు కన్నీటిపర్యంతమవుతూ వీడియోలను విడుదల చేశారు. కానీ ఈ ఆందోళనలను లైట్‌గా తీసుకున్న రేవంత్సర్కారు తీవ్రంగా అణిచివేసింది.
తప్పిదాల మీద తప్పిదాలు
రేవంత్సర్కారు అవగాహన లేమితో చేసిన అనేక తప్పిదాలు వెలుగుచూశాయి. తొలుత టెట్ నిర్వహించకుండా డీఎస్సీ నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేయడం, అభ్యర్థుల ఆందోళనలతో డీఎస్సీ పరీక్షలను వాయిదావేసి, టెట్‌ను నిర్వహించింది. పోటీ పరీక్షల అభ్యర్థుల నుంచి రూపాయి ఫీజుగా తీసుకోబోమని చెప్పి టెట్ పేపర్‌కు 1,000, రెండు పేపర్లకు 2,000 ఫీజుగా తీసుకోగా, తీవ్ర వ్యతిరేకత రావడంతో డీఎస్సీ పరీక్షల దరఖాస్తు సమయంలో ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చింది. ప్రశ్నపత్రాల కూర్పులో వైఫల్యం చెందడం సర్కారు నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నది.
జూలై 19న ఎస్జీటీ పేపర్లో మొదటి షిప్ట్‌లో ప్రశ్నలు
జూలై 23న ఎస్జీటీ పేపర్లో రెండో షిప్ట్‌లో పునరావృతమైన ప్రశ్నలు