DSC | హైదరాబాద్ : తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి రాగానే నిలువునా మోసం చేసిందంటూ డీఎస్సీ అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీఎస్సీని మూడు నెలల పాటు వాయిదా వేసి, 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. లక్డీకాపూల్లోని డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని నిరుద్యోగులు ముట్టడించారు.
ఈ సందర్భంగా ఓ యువతి కాంగ్రెస్ సర్కార్కు ఖతర్నాక్ ప్రశ్న వేసింది. రేవంత్ రెడ్డిని నిలదీసింది ఆమె. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న మమ్మల్ని అరెస్టు చేస్తున్నారు. డీఎస్సీ వాయిదా కోసమే మేం నిరసన చేస్తున్నాం. విద్యార్థుల భవిష్యత్ గురించి ఆలోచించే కాంగ్రెస్ నాయకులు.. విద్యా వాలంటీర్లను నియమించుకోవాలి. మరో మూడు నెలల పాటు డీఎస్సీ పోస్టుపోన్ చేసి పరీక్షలు నిర్వహించాలి. తెలంగాణలో 25 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఇదే కాంగ్రెస్ నాయకులు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో చెప్పారు. అధికారంలోకి రాగానే 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. మీరు ఇచ్చిన హామీ మేరకే మేం మెగా డీఎస్సీకి డిమాండ్ చేస్తున్నాం. మేం తీవ్రవాదులం కాదు.. విద్యార్థులం.. మమ్మల్ని ఎందుకు అరెస్టు చేస్తున్నారు. గత ప్రభుత్వాలు నిరుద్యోగులతో సమీక్షలు జరపలేదని ఇదే కాంగ్రెస్ నాయకులు అన్నారు. మరి ఇవాళ ఎందుకు నిరుద్యోగులతో సమీక్షలు నిర్వహించడం లేదు..? అని సీఎం రేవంత్ రెడ్డిని ఓ యువతి నిలదీసింది.
మరో యువతి మాట్లాడుతూ.. డీఎస్సీ మూడు నెలల పాటు వాయిదా వేయాలి. సముద్రమంత సిలబస్ ఇంకో పది రోజుల్లో అయిపోతదా..? మేం రోబోలం కాదు.. మెషీన్లం కాదు. మేం కూడా సాధారణ మనషులమే. మాకు చదువుకోవడానికి మరికొంత సమయం కావాలి.. మూడు నెలల సమయం కావాలని అడుగుతున్నాం. ఇదే మా ప్రధాన డిమాండ్ అని ఆమె స్పష్టం చేశారు.
ఓ నిరుద్యోగి మాట్లాడుతూ.. 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేయాలి. ఎన్నికల్లో గెలవగానే 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి నిరుద్యోగులను మోసం చేశారు. గత ప్రభుత్వంలో నిరుద్యోగుల తరపున తీన్మార్ మల్లన్న కేసీఆర్ను ప్రశ్నించిండు. ఇప్పుడు గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీగా గెలుపొందిన తీన్మార్ మల్లన్న ఎందుకు రేవంత్ రెడ్డిని ప్రశ్నించడం లేదు. నిరుద్యోగుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు అదే నిరుద్యోగులను మోసం చేస్తోంది. తీన్మార్ మల్లన్న, బల్మూరి వెంకట్ ప్రభుత్వానికి తొత్తులుగా మారారు అని అతను మండిపడ్డారు.
తీన్మార్ మల్లన్న, బల్మురి వెంకట్ ప్రభుత్వ తొత్తులు
డీఎస్సీని 3 నెలలు వాయిదా వెయ్యాలి.. మెగా డీఎస్సీతో 25వేల పోస్టులు వేయాలని డీఎస్సీ అభ్యర్థుల నిరసన pic.twitter.com/xutP3r8xfJ
— Telugu Scribe (@TeluguScribe) July 8, 2024