DSC Applications | నేటి రాత్రి నుంచి డీఎస్సీ ఆన్లైన్ దరఖాస్తులు..
రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నిర్వహించే డీఎస్సీ-2024 దరఖాస్తుల స్వీకరణ ఈ రాత్రి నుంచే ప్రారంభం కానున్నది. సోమవారం రాత్రి 12 గంటల తర్వాత నుంచే ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానున్నది.
- ఈరోజు రాత్రికే ఇన్ఫర్మేషన్ బులెటిన్, ఖాళీల వివరాల ప్రకటన
- దరఖాస్తుదారులకు సాంకేతిక సహాయం కోసం హెల్ప్‌డెస్క్
DSC Applications | హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నిర్వహించే డీఎస్సీ-2024 దరఖాస్తుల స్వీకరణ ఈ రాత్రి నుంచే ప్రారంభం కానున్నది. సోమవారం రాత్రి 12 గంటల తర్వాత నుంచే ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానున్నది. ఈ రోజు రాత్రికే ఇన్ఫర్మేషన్ బులెటిన్, జిల్లా, సబ్జెక్టు, రిజర్వేషన్ వారీగా ఖాళీలు, సిలబస్ తదితర వివరాలను వెబ్సైట్లో పొందుపరుస్తారు. ఆ తర్వాత నుంచి ఫీజు చెల్లింపు, దరఖాస్తు చేసుకునే అవకాశాన్నిస్తారు.
2023 డీఎస్సీకి 1.77 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. 11,062 టీచర్ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ-2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వీటిలో 2,629 స్కూల్ అసిస్టెంట్, 6,508 సెకండరీ గ్రేడ్ టీచర్లు, 727 భాషాపండితులు, 182 పీఈటీ పోస్టులున్నాయి.
ఇక స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 220 ఉండగా, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 796 ఉన్నాయి. సోమవారం నుంచి ఏప్రిల్ 3 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆన్లైన్ ఫీజు చెల్లింపు గడువు ఏప్రిల్ 2తోనే ముగుస్తుంది. తాజాగా గరిష్ఠ వయోపరిమితిని 46 ఏండ్లకు పెంచడం, అదనంగా పోస్టులను చేర్చడంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
అర్హతలు.. నిబంధనలు
- సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు కేవలం డీఎడ్ పూర్తిచేసినవారే అర్హులు. బీఎడ్ వారు పోటీపడే అవకాశంలేదు.
- స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు (ఎస్ఏ) పోస్టులకు సంబంధిత మెథడ్‌లో బీఎడ్ పూర్తిచేసినవారు అర్హులు. నాలుగేండ్ల బీఎడ్ పూర్తిచేసినవారు సైతం పోటీపడొచ్చు.
- ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసేవారు ఇంటర్లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు, యూజీ డీపీఈడీ కోర్సు పూర్తిచేసి ఉండాలి. డిగ్రీ పూర్తిచేసినవారు.. బీపీఈడీ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.
- బీఎడ్, డీఎడ్ చివరి సంవత్సరం/చివరి సెమిస్టర్ పరీక్షలు రాసినవారు కూడా దరఖాస్తులు సమర్పించవచ్చు.
- అభ్యర్థుల గరిష్ఠ వయో పరిమితికి కటాఫ్ తేదీగా 1-7-23ను నిర్ణయించారు. ఈ తేదీలోగా 46 సంవత్సరాలు గలవారై ఉండాలి. కనిష్ఠ వయోపరిమితి 18 ఏండ్లుగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు 5, మాజీ సైనికులకు 3, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 5, దివ్యాంగులకు 10 ఏండ్ల సడలింపు వర్తిస్తుంది.
- తెలంగాణ, ఏపీ టెట్, లేదా సెంట్రల్ టెట్ (సీ టెట్)లో క్వాలిఫై అయి ఉండాలి.
- గతంలో ఏజెన్సీ పోస్టుల్లో 100 శాతం గిరిజనులకే కేటాయించగా, ఈ నిబంధనను తాజాగా ఎత్తివేశారు. అంతా పోటీపడొచ్చు.
- ఎస్టీ రిజర్వేషన్ గతంలో 6 శాతం ఉండగా, పెంచిన 10 శాతాన్నే వర్తింపజేస్తారు.
- గతంలో లోకల్, ఓపెన్ కోటా రిజర్వేషన్ 80:20 పద్ధతిలో ఉండగా, తాజాగా 95:5 రేషియోను అమలుచేస్తారు.
- అభ్యర్థుల స్థానికతను నిర్ధారించేందుకు గతంలో 4-10 తరగతుల చదువును పరిగణనలోకి తీసుకోగా, తాజాగా 1-7 తరగతులను లెక్కలోకి తీసుకుంటారు.
- జీవో-3 ప్రకారం మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలుచేస్తారు. మూడు పోస్టులుంటే ఒక పోస్టును మహిళతో భర్తీ చేస్తారు.
హెల్ప్‌డెస్క్
డీఎస్సీకి దరఖాస్తు చేసేవారి సందేహాలు తీర్చేందుకు అధికారులు హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటుచేశారు. సాంకేతిక సహాయం కోసం విద్యార్థులు 91541 14982, 63099 98812 నంబర్లతోపాటు, helpdesk tsdsc2024@gmail.com ఈ-మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేయదలిస్తే, ప్రతి ఉద్యోగం కోసం వెయ్యి రూపాయలు ఫీజుగా చెల్లించాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

