DSC | హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : డీఎస్సీ-2024లో ఉద్యోగం సాధించి, కొత్తగా కొలువులో చేరిన టీచర్లకు వేతన కష్టం వచ్చి పడింది. ఉద్యోగంలో చేరి రెండు నెలలైనా కొన్ని జిల్లాల్లో ఇంకా వారికి తొలి వేతనం అందలేదు. టీచర్ల నియామకపు తేదీపై ప్రభుత్వం నుంచి స్పష్టత కొరవడటంతో జీతాల చెల్లింపు సందిగ్ధంలో పడింది. డీఎస్సీ-2024లో ఎంపికైన 10 వేలకుపైగా టీచర్లకు అక్టోబర్ 10వ తేదీతో అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు. ఆ తర్వాత వారం రోజులకు జిల్లాల్లో కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్స్ ఇచ్చారు. దీంతో కొంతమంది టీచర్లు అక్టోబర్ 15న, మరికొందరు అక్టోబర్ 17న పాఠశాలల్లో చేరారు. ఒక తేదీతో రిక్రూటై, మరో తేదీన పోస్టింగ్ చేతికందడంతో వేతనాల చెల్లింపునకు సాంకేతిక సమస్యలు వచ్చిపడ్డాయి. కొత్త టీచర్లకు అక్టోబర్ 10 నుంచి వేతనాలిస్తామని విద్యాశాఖ ప్రకటించగా, పనిచేయని కాలానికి వేతనాలు ఎలా ఇవ్వాలంటూ ట్రెజరీ అధికారులు అభ్యంతరాలు వ్యక్తంచేశారు. దీంతో విద్యాశాఖ అధికారులు ఆర్థికశాఖ నుంచి స్పష్టత కోరారు. జాయినింగ్ తేదీని 10వ తేదీగా పరిగణించి, అదే తేదీ నుంచి వేతనం చెల్లించేందుకు ఆర్థికశాఖ అనుమతి కోరారు. ఈ ఫైల్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేషీకి చేరింది. డిప్యూటీ సీఎం అందుబాటులో లేకపోవడం, డిసెంబర్ 3వ తేదీ దాటిపోవడంతో వేతనాల చెల్లింపు పెండింగ్లో పడిపోయింది.