హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ) : 2008 డీఎస్సీలో నష్టపోయిన బాధితులకు ఉద్యోగాలిచ్చేందుకు అర్హులైన వారి లెక్కను పాఠశాల విద్యాశాఖ తేల్చింది. ఎట్టకేలకు 1,399 మంది ఉద్యోగాలు పొందేందు కు అర్హులని గుర్తించింది. వీరికి వా రంలో నియామకపత్రాలివ్వాలని నిర్ణయించింది. 2008 డీఎస్సీ బాధిత అభ్యర్థులను కాంట్రాక్ట్ టీచర్లుగా నియమించాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాలవారీగా అభ్యర్థుల జాబితాలను విడుదల చేసి, సెప్టెంబర్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ని ర్వహించారు. ఈ నెల 9లోపు తుది జాబితాలను రూపొందించేందుకు 9 జిల్లాలకు పరిశీలకులను విద్యాశాఖ నియమించింది. తుది జాబితాలు వి ద్యాశాఖ డైరెక్టరేట్కు చేరాయి. అయితే నియామకపు ఉత్తర్వులిచ్చే అంశంపై ప్రభుత్వం తీవ్రం జాప్యంచేసింది. దీం తో అభ్యర్థులు 19న ప్రజాభవన్లో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చి న్నారెడ్డిని కలిసి తమకు ఉద్యోగాలివ్వాలని కోరారు. అధికారులతో మాట్లాడిన ఆయన రెండుమూడు రోజుల్లో ప రిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వారం గడిచినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో మళ్లీ ఆగ్రహించిన అ భ్యర్థులు మంగళవారం ప్రజాభవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో చ ర్చలు జరిపిన సర్కారు ఎట్టకేలకు ఆం దోళనను విరమింపజేసింది. అయినా కొందరు అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్కు తరలివచ్చి నియామకపత్రాలపై ఆరా తీశారు. ఇదే విషయంపై విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి స్పందిస్తూ వారంలో అభ్యర్థులకు నియామక ఉత్తర్వులిచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.