సిద్దిపేట, ఏప్రిల్ 1: నీళ్లందక పంటలు ఎండిపోవడంతో సిద్దిపేట జిల్లా రంగనాయకసాగర్ ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. రంగనాయక సాగర్ ఎడమ కాల్వలకు నీళ్లు వదలాలని ఎన్నిసార్లు విన్నవించిన అధికారులు పట్టించుకోకపోవడంతో పంటలు ఎండిపోయినట్టు సిద్దిపేట రూరల్ మండలం మాచాపూర్ రైతులు వాపోతున్నారు. బోయినీ (బతుకమ్మ) చెరువు నింపితే తమ బోరు బావిలో పుషలంగా నీరు ఉండేవని చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాల్వలోకి నీటిని వదిలి చెరువును నింపితే కొంతమేరకైనా పంటలు దకుతాయని వేడుకుంటున్నారు. కనీసం 150 ఎకరాల వరి పొలాలనైనా కాపాడుకోవచ్చని వారు సూచిస్తున్నారు.
రెండెకరాలు ఎండింది
యాసంగిలో ఆరెకరాలు నాటుపెట్టిన. గతంలో వచ్చినట్టుగా రంగనాయక సాగర్ కాల్వ ద్వారా నీళ్లు వస్తాయి అనుకున్నం. ఈసారి ఒకసారి మాత్రమే నీళ్లు వదిలిండ్రు. పంటలు ఎండిపోతున్నాయి నీళ్లు వదలాలని రోడ్డుపై ధర్నా చేసినం. నీళ్లు ఇస్తామని చెప్పి ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఇప్పటికే రెండెకరాలు ఎండిపోయింది. మొన్న బోరు మోటర్ కాలిపోతే రూ. 54 వేలు పెట్టి కొత్త మోటర్ తెచ్చిన. 220 ఫీట్లున్న బోరులో నీళ్లు లేక మోటర్ నడుస్తలేదు. ఇంకిన్ని పైపులు తెచ్చి ఇటీవల దించిన. వరి చేను పొట్టదశలో ఉన్నది. 10 రోజులపాటు నీళ్లిస్తే పంట పండుతది.నీళ్లు లేక పంట ఎండిపోయి రూ.2 లక్షల నష్టం జరిగింది.
– బొప్పెన మల్లయ్య, రైతు, మాచాపూర్ (సిద్దిపేట జిల్లా)
మూడు బోర్లు, ఒక బావి తవ్వించినా నీళ్లు రాలే
తరిగొప్పుల, ఏప్రిల్ 1: రెక్కలు ముక్కలు చేసుకొని సాగు చేసిన వరి పంట ఎండిపోతుంటే కండ్లళ్ల నీళ్లొస్తున్నాయని జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రానికి చెందిన రైతు పిట్టల సారయ్య ఆందోళన వ్యక్తంచేశాడు. తనకున్న మూడెకరాల్లో వరి, మరో రెండెకరాలు కౌలుకు తీసుకొని మక్కజొన్న వేసినట్టు తెలిపాడు. బోరులో నీరు తగ్గిపోవడంతో కష్టాలు మొదలైనట్టు చెప్పాడు. పంటను కాపాడుకోవడానికి అప్పుతెచ్చి కొత్తగా మూడు బోర్లు, ఒక బావి తవ్వించినా నీరు రాకపోవడంతో చేసేదేమీలేక వరి పంట పశువుల మేతకు వదిలేసినట్టు తెలిపాడు. మొత్తం రూ.నాలుగు లక్షల అప్పయ్యిందని, ఈ మొత్తాన్ని ఎలా తీర్చాలో అర్థం కావడం లేదన్నాడు. ప్రభుత్వం పంటలు నష్టపోయిన రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని కోరాడు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను చూసి ఓటు వేసిన పాపానికి ఇప్పుడు అనుభవిస్తున్నామని చెప్పుకొచ్చాడు.
పంట ఎండింది.. పశువులకు మేతైంది..
మా బోర్లలో నీళ్లు రావడం లేదు. చెరువులు, కుంటల కింద ఉన్న పొలాలకు సైతం నీరందక ఎండిపోతున్నాయి. మూడెకరాల్లో వరి సాగుచేసిన. పంట చేతికందే సమయంలో ఎండిపోయి పశువులకు మేతగా మారింది. కాల్వలు పూర్తిచేయక పోవడంతో మాకు గోదావరి జలాలు రావడం లేదు. అసంపూర్తిగా ఉన్న కాల్వలు పూర్తి చేస్తే కొంత వరకైనా పంటలు చేతికి వచ్చేవి. పదేండ్లలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు. రూ.లక్షన్నర వరకు పెట్టుబడులు పెట్టిన. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలి
-తిరుపతి,రైతు, ముబారాస్పూర్, దౌల్తాబాద్ మండలం (సిద్దిపేట జిల్లా)
చి‘వరి’ తడికి తండ్లాట
యాసంగి పంటలను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. వేసవి ఆరంభంలోనే భూగర్భ జలాలు ఇంకిపోయి బోర్లు వట్టిపోతుండటంతో ఆందోళన చెందుతున్నారు. నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని పలు గ్రామాల శివారును అనుసరించి డిండి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఉంటుంది. కేసీఆర్ ప్రభుత్వంలో బ్యాక్ వాటర్ ఆధారంగా పంటలు సాగు చేసేవారు. కానీ ఈసారి ప్రాజెక్టు కాల్వల ద్వారా నీటినంతా దిగువన నల్లగొండ జిల్లా పంటలకు వదులుతుండటంతో ఇక్కడి పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొన్నది. గాజర గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్ ఆరెకరాలతోపాటు కౌలుకు తీసుకొన్న మరో ఆరెకరాల్లో వరి వేశాడు. 20 రోజుల్లో పంట చేతికొస్తుందనుకుంటే సాగునీళ్లు అందని పరిస్థితి. అలాగే చింతకుంట్ల హుస్సేన్ తన సోదరులతో కలిసి మరో ఐదెకరాల్లో పంటను సాగు చేయగా పొట్ట దశలో ఉండగా నీటి తడులు అందడం లేదు. డిండి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నిలిచే ప్రాంతంలో జేసీబీ సాయంతో పెద్ద గుంత తీశాడు. నీరు ఊరితే పంటలను కాపాడుకోవచ్చని చూస్తున్నాడు. – వంగూరు
గ్రీన్ ఫీల్డ్ హైవేపై రైతుల ధర్నా
రోడ్డు నిర్మాణానికి వ్యవసాయ భూములిచ్చినా పంట పొలాల్లోకి సర్వీస్ రోడ్డు నిర్మించకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తకారాయిగూడెం గ్రామానికి చెందిన రైతులు మంగళవారం ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. హైవే నిర్మాణానికి రెండు పంటలు పండే భూములిస్తే.. తమ పొలాల్లోకి వెళ్లేందుకు అండర్పాస్ ఇవ్వకపోవడమేంటని వారు ప్రశ్నించారు.
– పెనుబల్లి
కౌలు రైతు కన్నీటి సేద్యం
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం గాగిళ్లాపూర్కు చెందిన తవిటి సత్యనారాయణ అనే కౌలు రైతు 30 గుంటల భూమిలో పుచ్చకాయ సాగు చేశాడు. పంట సాగు కోసం రూ.20 వేలు ఖర్చు చేశాడు. పంట కాతకు వచ్చే సమయంలో నీరందించే బావి ఎండిపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. పంటను కాపాడుకునేందుకు
రోజూ ట్యాంకర్ ద్వారా నీటిని అందిస్తున్నాడు.
– మద్దూరు(ధూళిమిట్ట)
నీళ్లకోసం కాల్వల పూడిక
వికారాబాద్ జిల్లా కోట్పల్లి ప్రాజెక్టు కింద 9200 ఎకరాల ఆయకట్టు ఉన్నది. కానీ కాల్వలన్నీ శిథిలావస్థకు చేరడంతో నీరందని పరిస్థితి. ఒక్క జనగాం గ్రామంలోనే రెండు వేల ఎకరాలు ఆయకట్టు ఉన్నది. కానీ 500 ఎకరాలు కూడా పారడం లేదు. జనగాం గ్రామానికి చెందిన రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కోట్పల్లి ప్రాజెక్టు ప్రధాన కాల్వలో పూడిక తీస్తున్నారు. అక్కడక్కడా అడ్డుకట్టలను తొలగిస్తున్నారు. కాల్వలను పట్టించుకోని అధికారులు.. కనీసం కోట్పల్లి ఆయకట్టుకు నీరు వదిలేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.