హుజూరాబాద్ రూరల్ జూన్ 18 : ఈ వానకాలం ప్రారంభంలోనే ముందస్తుగానే రుతుపవనాలు వస్తాయని అన్నదాతలు సంతోషపడ్డారు. కానీ గత 20 రోజుల క్రితం రెండుసార్లు చిరుజల్లులు కురవడంతో రైతులు ఆనందంతో దుక్కులు దున్ని పత్తి విత్తనాలు విత్తారు. కానీ ముందుగానే మురిపించిన వరుణుడు కరుణచూపకుండా వెళ్లిపోయాడు. దీంతో పత్తి విత్తనాలు విత్తిన రైతులు వర్షం కోసం మొగులువైపు దిగాలుగా ఎదురుచూస్తున్నారు.
డివిజన్లో లక్ష 10వేల ఎకరాల సాగుకు సిద్ధం
హుజురాబాద్ డివిజన్లోని ఐదు మండలాల్లో సుమారుగా లక్షా పదివేల ఎకరాల్లో వివిధ పంటల సాగుకు రైతులు సమయత్తమయ్యారు. దీనిలో సుమారు 70 వేల ఎకరాల్లో వరి పంట, 38వేల ఎకరాల్లో పత్తి, మరికొన్ని ఎకరాల్లో ఇతరాత్ర పంటలు వేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. రోహిణి కార్తిలోనే 60000 ఎకరాల్లో సుమారుగా సన్నరకం నార్లు పోసినట్లు తెలిసింది. నార్లు ఇప్పటికే ఏపుగా పెరిగాయి.
వర్షం కోసం పత్తి రైతుల ఎదురుచూపు
20 రోజుల క్రితం పత్తి విత్తనాలు విత్తిన రైతులు వర్షం కోసం మొగులువైపు ఎదురుచూస్తున్నారు. ముందుగా కురిసిన వర్షానికి డివిజన్లోని పలు మండలాల్లో సుమారుగా 25 వేల ఎకరాల పైచిలుకే పత్తి విత్తనాలు విత్తారు. అప్పటినుంచి వర్షాలు లేకపోవడంతో విత్తిన పత్తి విత్తనాలు మొలకెత్తలేదు. మరో నాలుగు రోజులలో వర్షాలు కురువకపోతే విత్తనాలు కుళ్లిపోయే పరిస్థితి ఏర్పడుతుంది అయితే సమృద్ధిగా వర్షాలు కురిసినప్పుడే మరోసారి దుక్కులు దున్ని విత్తాల్సిన పరిస్థితి వస్తుందని దీంతో అన్నదాతల పెట్టుబడులు పెరిగి అప్పుల పాలు అయ్యే అవకాశం ఉందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.