హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఈగల్ ఫోర్స్ రా ష్ట్రంలో పట్టుకున్న గంజాయి, కొకైన్ సింథటిక్ డ్రగ్స్‌ను దహనం చేసింది. ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య పర్యవేక్షణలో డ్రగ్స్‌ను కాల్చి వేశారు. మొత్తం 5 కేసులకు సంబంధించి దొరికిన వివిధ రకాల మత్తు పదార్థాలను యాదాద్రి భువనగిరి జిల్లా తుకాపూర్ గ్రామంలోని రోమా ఇండస్ట్రీస్‌లో పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా కాల్చివేశారు. రూ.10,59,42,500 విలువైన 2,118 కిలోల గంజాయి, రూ.67,50,000 విలువైన 135 గ్రాముల కొకైన్, రూ.48,80,000 విలువైన 488 గ్రాముల మత్తు బిళ్లలు, రూ.1,60,000 విలువైన 160 గ్రాముల ఓజీ కుష్ వీడ్‌ను అధికారులు నిర్వీర్యం చేశారు. వీటి మొత్తం విలువ రూ.11.77 కోట్లు ఉంటుందని ఈగల్ అధికారులు వెల్లడించారు.