హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో డ్రగ్స్ అమ్మకాలను నియంత్రిస్తూ కేసులు పెడుతున్నప్పటికీ సరఫరా విషయంలో కఠినంగా వ్యవహరించాలని డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. అందుకోసం నార్కోటిక్ బ్యూరోకు స్పెషల్ పోలీసు విభాగం నుంచి అదనంగా సిబ్బందిని కేటాయిస్తామని వెల్లడించారు. యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులతో గురువారం డీజీపీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. డ్రగ్స్ సరఫరాపై ఉకుపాదం మోపాలని ఆదేశించారు. నిందితులను పట్టుకున్నప్పుడు వారి నెట్వర్క్ను పూర్తిగా ఛేదించాలన్నారు. విదేశీయులు ఎవరైనా అనుమానాస్పదంగా డ్రగ్ వ్యవహారాల్లో తల దూర్చితే, వారిని వెనకి పంపేలా చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. విద్యా సంస్థలు, అనుమానాస్పద ప్రాంతాల్లో బ్యూరో సిబ్బందిని నియమించాలని ఆదేశించారు.
నిందితులను పట్టుకోవడంతోపాటు వారికి శిక్ష పడేలా సాక్ష్యాధారాలను న్యాయస్థానాలకు సమర్పించాలని లా అండ్ ఏడీజీ మహేశ్ భగవత్ సూచించారు. నిందితులకు శిక్షపడేలాగా కఠినంగా వ్యవహరిస్తున్నామని టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. అంతకుముందు కొత్త క్రిమినల్ చట్టాల అమలుపై ప్రత్యేకంగా నియమించిన కమిటీతో డీజీపీ సమావేశమయ్యారు. కార్యక్రమంలో డీజీలు శిఖాగోయెల్, అభిలాష బిస్త్, ఐజీ రమేశ్, నిజామాబాద్ సీపీ కల్మేశ్వర్ సింగెనవార్, డీఐజీ గజరావు భూపాల్ తదితరులు పాల్గొన్నారు.