హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): బెంగళూరు శివారులో ఆదివారం జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకం రేపింది. ఆ రేవ్‌పార్టీపై పోలీసులు జరిపిన దాడిలో కొందరు నటీనటులు పట్టుబడ్డారని వార్తలు వెలువడటంతో ఎవరికి వారే తాము అక్కడ లేమంటూ వివరణ ఇచ్చుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన వాసు అనే వ్యాపారి బెంగళూరులోని జీఆర్ ఫామ్‌హౌస్‌లో బర్త్‌డే పార్టీ ఇచ్చాడు.
ఈ పార్టీకి బెంగళూరు, హైదరాబాద్ నుంచి పలువురు ప్రముఖులతోపాటు విందులో వినోదం కోసం కొంతమంది యువతులను, మోడల్స్‌ను, సినీ రంగానికి చెందిన పలువురిని ఆహ్వానించారని బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు తెలిపారు. సుమారు 100 మందికిపైగా ఈ పార్టీకి హాజరవగా, వీరిలో చాలామందికి మత్తుమందులు సరఫరా చేసినట్టు తెలిసింది. ఈ సమాచారం అందుకున్న బెంగళూరు సీసీబీ పోలీసులు అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఫామ్‌హౌస్‌పై దాడి చేశారు.
ఈ దాడుల్లో 17 ఎండీఎంఏ మాత్రలు, కొకైన్, ఇతర డ్రగ్స్ లభించాయి. దీంతో పార్టీకి హాజరైన వారి వివరాలు తీసుకొని నిర్వాహకులైన వాసు, ఫామ్‌హౌస్ యజమాని రియల్ ఎస్టేట్ వ్యాపారి గోపాల్‌రెడ్డి మరో ముగ్గురిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఖరీదైన కార్లు, మద్యం, నగదు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన వారిలో ఐదుగురికి డ్రగ్స్ టెస్టు నిర్వహించగా.. పాజిటివ్ వచ్చినట్టు సమాచారం. దీంతో డ్రగ్స్ ఎలా సరఫరా అయిందనే కోణంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా 2020లో కూడా ఇదే గోపాల్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో రేవ్‌పార్టీ జరగగా పోలీసులు సోదాలు చేసి, డ్రగ్స్, మద్యం స్వాధీనం చేసుకున్నారు.
మేం ఆ పార్టీకి వెళ్లలేదు: శ్రీకాంత్, హేమ
ఈ రేవ్‌పార్టీలో అరెస్టయిన వారిలో ప్రముఖ సినీనటులు కూడా ఉన్నట్టు వార్తలు రావడంతో కొందరు తాము అక్కడికి వెళ్లలేదంటూ వివరణ ఇచ్చుకున్నారు. ప్రముఖ నటుడు శ్రీకాంత్ ఒక వీడియో విడుదల చేస్తూ.. ‘నేను రేవ్ పార్టీలకు వెళ్లే వ్యక్తిని కాదు’ అని పేర్కొన్నారు. మరో నటి హేమ సైతం తాను రేవ్ పార్టీకి వెళ్లాననటం ఫేక్ న్యూస్ అని తెలిపారు. ఆ రేవ్ పార్టీలో పోలీసులు స్వాధీనం చేసుకున్న కారు తనది కాదని ఏపీకి చెందిన మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి తెలిపారు. ఆ కారుతో, ఆ కారు యజమానితో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.