హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : శామీర్‌పేటలోని నల్సార్ యూనివర్సిటీలో గంజాయి నెట్వర్క్ వెలుగులోకి వచ్చింది. గత నెలలో ఈ యూనివర్సిటీ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన తాజాగా కొత్త మలుపు తీసుకున్నది. యాక్సిడెంట్లో మృతి చెందిన విద్యార్థి జేబులో నుంచి గంజాయి ప్యాకెట్ మాయమైనట్టు పోలీసులు గుర్తించారు. ఈగల్ టీం విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదం విషయంలో గతంలో నమోదైన కేసుతో పాటు తాజాగా మరో నలుగురు విద్యార్థులపై కేసు నమోదైంది. ఫిబ్రవరి 21వ తేదీ రాత్రి శామీర్‌పేట నుంచి నల్సార్ యూనివర్సిటీ వైపు విద్యార్థులు ప్రియాంశు కుమార్ మీనా, సాక్షం, గోపీచంద్ బైక్‌పై వెళ్తున్నారు. పెద్దమ్మ కాలనీ సమయంలో నిలిపి ఉన్న ఓ ట్రక్కు(టీఎస్08యూఎల్ 7958)ను వీరు ఢీకొట్టారు.
ఈ క్రమంలో విద్యార్థులు బైక్‌పై నుంచి కింద పడిపోగా, సాక్షం తల పై నుంచి మరో ట్రక్కు (హెచ్ఆర్ 55బీఏ 9774) వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ విషయంపై నల్సార్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ జీ మల్లికార్జున్ శామీర్‌పేట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో విద్యార్థులు గంజాయి వాడినట్టుగా ఈగల్ టీమ్‌కు సమాచారం అందింది. ఈ క్రమంలో వారి దర్యాప్తులో పలువురు విద్యార్థులకు గంజాయి అలవాటు ఉన్నట్టు గుర్తించారు. ప్రమాదం జరిగిన రోజు విద్యార్థులు ద్రిషక్ రాజ్, నిధాన్ దేశ్ పాండే, గోపీచంద్, ప్రియాన్ష్, సాక్షం రెండు ద్విచక్రవాహనాలపై బయటకు వెళ్లినట్టు వారి విచారణలో వెల్లడైంది.
ఈగల్ టీమ్ ఎంట్రీతో శామీర్‌పేట్ పోలీసుల్లో హడావుడి మొదలైంది. ప్రమాదం జరిగిన రోజు విద్యార్థుల్లో కొందరు మత్తులో ఉన్నారని గుర్తించి, మృతి చెందిన సాక్షంతో ఉన్న నలుగురిని 24వ తేదీన పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. ఈ విచారణకు ద్రిషిక్ రాజ్, గోపీచంద్ హాజరయ్యారు. వీరికి డ్రగ్ టెస్ట్ చేయగా, ద్రిషిక్ రాజ్‌కు పాజిటివ్ వచ్చింది. తాను 2024 నుంచి గంజాయి తీసుకుంటున్నానని, యూనివర్సిటీకి చెందిన రుషి అనే విద్యార్థి వద్ద నుంచి 5 గ్రాముల గంజాయికి రూ. వెయ్యి ఇచ్చి కొన్నట్టు వెల్లడించాడు. తన స్నేహితులు అభిషేక్, అర్యాన్ ప్రభులు కూడా గంజాయి సేవిస్తారని దర్యాప్తులో వివరించాడు. రోడ్డు ప్రమాదానికి ముందు సాక్షం జేబులో చిన్న గంజాయి ప్యాకెట్ ఉందని, ఆ తరువాత అది కనిపించలేదని చెప్పాడు. దీంతో శామీర్‌పేట్ ఎస్ఐ శిశివర్ధన్రెడ్డి తాజాగా ఫిర్యాదు చేయడంతో నలుగురు విద్యార్థులపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.