ప్రభుత్వ దవాఖానల్లో ఇదే మొదటిది
ఇక 30-40 రకాల ఔషధాల సమాచారం తెలుసుకోవచ్చు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 16 : క్యాన్సర్, మూర్ఛ, కిడ్నీ మార్పిడి వంటి చికిత్సలో భాగంగా రోగి తట్టుకొనే ఔషధ మోతాదు పరిమాణం, దాని దుష్ప్రభావాలు తదితర సమాచారం తప్పనిసరి. ఈ సమాచారాన్ని తెలుసుకోవాలంటే రోగికి థెరప్యూటిక్ డ్రగ్ మానిటరింగ్ టెస్ట్ చేస్తారు. అంటే రోగి నుంచి రక్త నమూనాలు సేకరించి ఔషధం ఏ మోతాదులో ఇవ్వాలో తెలుసుకుంటారు. ఈ పరీక్షలు జరపడానికి అవసరమయ్యే ‘థెరప్యూటిక్ డ్రగ్ మానిటరింగ్’ యంత్రాన్ని నిమ్స్‌లో అందుబాటులోకి తీసుకువచ్చారు. బుధవా రం ఫార్మాకాలజీ విభాగాధిపతి డాక్టర్ పి ఉషారాణితో కలిసి నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ ఈ యంత్రాన్ని ప్రారంభించారు. తెలంగాణ, ఏపీల్లోని ప్రభుత్వ దవాఖానల్లోనే మొట్టమొదటిసారిగా నిమ్స్‌లో థెరప్యూటిక్ డ్రగ్ మానిటరింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్టు దవాఖాన డైరెక్టర్ డాక్టర్ మనోహర్ తెలిపారు. సాధారణంగా డ్రగ్ మానిటరింగ్ టెస్ట్ చేయాలంటే ఒక్కో టెస్టుకు బయట రూ.2వేల నుంచి రూ.3వేల వరకు ఖర్చవుతుందని, ఇకపై నిమ్స్‌లో నామమాత్రపు ఫీజుతో టెస్టులు చేయనున్నట్టు వైద్యాధికారులు తెలిపారు. కొత్త యంత్రం ద్వారా 30- 40 రకాల ఔషధాలకు సంబంధించిన పనితీరు, వాటి సామర్థ్యం, దుష్ప్రభావాలు తెలుసుకోవచ్చు.
వీరికి ఈ టెస్టులు అవసరం..
క్యాన్సర్, మూర్ఛ, కిడ్నీ మార్పిడి రోగులతోపాటు పాయిజనింగ్ బాధితులకు డ్రగ్ ఇన్ఫర్మేషన్ అవసరం పడుతుంది. ఇలాంటి వారికి చికిత్సలో భాగంగా ఇచ్చే కొన్నిరకాల ప్రత్యేక ఔషధాలు తక్కువ డోస్ ఇవ్వడం వల్ల పనిచేయకపోవడమో, ఎక్కువ ఇస్తే దుష్ప్రభావాలు ఏర్పడటమో జరుగుతుంది. ప్రధానంగా కిడ్నీ మార్పిడి రోగిలో ఇమ్యునో సప్రెషన్ డ్రగ్ తక్కువ మోతాదులో ఇస్తే రోగి శరీరం.. మార్పిడి చేసిన కిడ్నీని తిరస్కరిస్తుందని, అధిక మోతాదులో ఇస్తే దుష్ప్రభావాలు ఎదురవుతాయని, అందుకే కచ్చితమైన డోస్ ఇవ్వాలని నిమ్స్ ఫార్మకాలజీ వైద్యులు తెలిపారు.