హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్ రహిత తెలంగాణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంలో మత్తు మూలాలను తెలంగాణ పోలీసులు చిత్తు చేస్తున్నారు. అన్ని జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాల్లో ఐదు అంచెల తనిఖీలతో డ్రగ్స్ స్మగ్లర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. తెలంగాణ చుట్టుపక్కల నుంచి మన రాష్ట్రం మీదుగా ఇతర రాష్ర్టాలకు డ్రగ్స్ తరలించాలంటేనే భయపడే పరిస్థితిని సృష్టించారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ముంబైకి, బెంగళూరు నుంచి ఏపీకి డ్రగ్స్ తరలించే క్రమంలో తెలంగాణ పోలీసులను తప్పించుకోవడం సాధ్యం కానిపనిలా మారింది. ముఠాలు ఎన్నో అక్రమ మార్గాల్లో డ్రగ్స్‌ను తరలించేందుకు యత్నిస్తున్నా.. అన్ని లింకులనూ తెలంగాణ పోలీసులు విజయవంతంగా ఛేదిస్తున్నారు. ఎక్కడివారిని అక్కడే అరెస్టు చేస్తూ, గతంలో డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులు ఉన్న వారిపై పీడీయాక్టులు నమోదు చేస్తున్నారు. తెలంగాణలోని అన్ని నార్కోటిక్ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ డ్రగ్స్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు.
మూడేండ్లలో 90 టన్నుల గంజాయి సీజ్
తెలంగాణ మీదుగా ఇతర రాష్ర్టాలకు అక్రమ పద్ధతిలో రవాణా అవుతున్న గంజాయిని పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. జిల్లా సరిహద్దులు, రాష్ట్ర సరిహద్దుల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. గడిచిన మూడేండ్లలో దాదాపు 90 టన్నుల (89,900 కేజీల) గంజాయిని అక్రమంగా రవాణా కాకుండా అడ్డుకోగలిగారు. ఎన్ని రూపాల్లో ఏవిధంగా రవాణా చేసినా తెలంగాణ పోలీసులు అడ్డుకోగలిగారు.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర నుంచి తెలంగాణలోని భద్రాచలం, వరంగల్ మీదుగా ముంబై, బెంగళూరుకు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని సమర్థంగా నిలువరించగలిగారు. గత సంవత్సరం వరంగల్ పరిధిలో 43, ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో 28 మంది స్మగ్లర్లు, పెడ్లర్స్‌పై పీడీయాక్టు నమోదు చేసి, జైలుకు తరలించారు. గంజాయితోపాటు మూడేండ్లలో 711 రకాల ఇతర డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. 2022లో 31,718 కేజీల గంజాయి, 65 కేజీల ఇతర డ్రగ్స్‌ను సీజ్ చేశారు. 593 గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. మొత్తంగా 1,278 మందిపై కేసులు నమోదు చేశారు.
స్పెషల్ డ్రైవ్‌లతో తగ్గిన కేసులు
డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకొనేందుకు తెలంగాణ పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్‌డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. డ్రగ్స్ స్మగ్లర్లు, డ్రగ్స్ పెడ్లర్స్‌పై ప్రత్యేక నిఘా పెడుతున్నారు. ఎప్పటికప్పుడు వారి కదలికలను గమనిస్తూ.. పక్కా ఆధారాలతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. నార్కోటిక్, టాస్క్‌ఫోర్స్, ఇంటెలిజెన్స్ విభాగం పోలీసులు పరస్పరం సమన్వయం చేసుకుంటూ డ్రగ్స్ మూలాలను చిత్తు చేస్తున్నారు. జిల్లా సరిహద్దులు మొదలుకొని రాజధానిలో నిర్వహించే స్పెషల్డ్రైవ్ల వరకూ ఐదు అంచెల తనిఖీలు నిర్వహిస్తూ పకడ్బందీగా కట్టడి చేస్తున్నారు. మూడేండ్లలో 3,133 కేసుల నమోదు చేసి, 7,498 మందిని అరెస్టు చేశారు. వీరిలో 416 మందిపై ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం పీడీయాక్టు నమోదు చేశారు. పోలీసుల పనితీరు, విస్తృతంగా నిర్వహిస్తున్న అవగాహనా కార్యక్రమాల వల్ల నిరుడు నార్కోటిక్ కేసులు 6% తగ్గుముఖం పట్టాయి. తెలంగాణ ప్రభుత్వం నార్కోటిక్స్, సైకోట్రోపిక్స్ చట్టాలను సమర్థంగా అమలు చేయడంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది.
కఠినంగా వ్యహరిస్తున్నాం
డ్రగ్స్ స్మగ్లర్లు, పెడ్లర్స్ ఆట కట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వ మార్గనిర్దేశంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాం. దీంతో నార్కోటిక్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గొలుసుకట్టు విధానంలో సాగుతున్న మాదకద్రవ్యాల రవాణాను సమర్థంగా అడ్డుకుంటున్నాం. స్మగ్లర్లు, పెడ్లర్స్‌పై కేసులు పెట్టే క్రమంలో ఆధునిక, శాస్త్రీయ పద్ధతిలో దర్యాప్తు చేస్తున్నాం. 2022లో 842 కేసులు విచారణలో ఉండగా, 4,332 కేసులు పెండింగ్ ట్రయల్స్‌లో ఉన్నాయి. ఇదీ మన పోలీసుల సక్సెస్‌కు నిదర్శనం. డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకుంటున్న పోలీసులకు రివార్డులు అందజేస్తున్నాం. రాష్ట్ర పోలీసులు తీసుకుంటున్న కఠినచర్యలతో అక్రమార్కులు తెలంగాణను విడిచి వెళ్లిపోతున్నారు. – డీజీపీ అంజనీకుమార్
కమిషనరేట్ల వారీగా 2022లో నమోదైన పీడీ యాక్టు కేసులు
రాచకొండ : 95
సైబరాబాద్ : 15
హైదరాబాద్ : 08
మల్టీజోన్-1 : 81
మల్టీజోన్-2: 11
సికింద్రాబాద్ రైల్వేస్ : 8
మొత్తం : 218