హైదరాబాద్, ఆగస్టు 12, (నమస్తే తెలంగాణ): మేడిగడ్డ బరాజ్‌ను సందర్శించిన సందర్భంగా అనుమతుల్లేకుండా డ్రోన్ వినియోగించారంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలపై పోలీసులు నమోదు చేసిన కేసు దర్యాప్తును హైకోర్టు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కేటీఆర్‌తోపాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, బాలసుమన్పై మహదేవ్పూర్ పోలీసులు నమోదు చేసిన కేసు ప్రాథమిక ఆధారాలను పరిశీలిస్తే.. పోలీసులు మోపిన అభియోగాలకు నమోదు చేసిన సెక్షన్లకు పొంతనలేదని అభిప్రాయపడింది. అందువల్ల ఈ కేసులో తదుపరి చర్యలన్నింటిపై స్టే విధిస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. అరెస్టు సహా ఇతర చర్యలేవీ తీసుకోరాదని స్పష్టంచేసింది. ఆరోపణలకు అనుగుణంగా అభియోగాలు లేవని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉన్నదని చెప్పింది. ప్రతివాదిగా ఉన్న ఫిర్యాదుదారు మేడిగడ్డ బరాజ్ సహాయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు వలి షేక్ తమ వాదనలతో కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను జస్టిస్ కే లక్ష్మణ్ సెప్టెంబర్ 5కు వాయిదా వేశారు.
కేటీఆర్ జూలై 26న గండ్ర వెంకటరమణారెడ్డి, బాలసుమన్, ఇతర పార్టీ నేతలతో మేడిగడ్డ బరాజ్‌ను సందర్శించారు. అనుమతిలేకుండా డ్రోన్ ద్వారా బరాజ్ స్థితిగతులను చిత్రీకరించారని ఆరోపిస్తూ జూలై 29న మహదేవపూర్ పోలీసులకు సహా య ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు వలి షేక్ ఫిర్యాదు చేశా రు. పిటిషనర్ తరఫున న్యాయవాది టీవీ రమణారా వు వాదనలు వినిపిస్తూ, మేడిగడ్డ రిజర్వాయర్‌లో నీటిని నిల్వచేసి ఎత్తిపోతలు చేయక యాసంగి సాగు కు తీవ్ర సమస్యగా మారిందని తెలిపారు. ప్రభుత్వ ప్ర జావ్యతిరేక చర్యలను ప్రజలకు వివరించాలనే పిటిషనర్లు మేడిగడ్డ సందర్శించారని వివరించారు. డ్రోన్ కెమెరాతో చిత్రీకరించడం వల్ల మేడిగడ్డకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందంటూ పోలీసులు ఆరోపణలు దారుణంగా ఉన్నాయని చెప్పారు.