రంగారెడ్డి, మార్చి 21 (నమస్తేతెలంగాణ) : రంగారెడ్డిజిల్లాలో ఫ్యూచర్‌సిటీ ఏర్పాటు నేపథ్యంలో గ్రామాల్లో డ్రోన్ కెమెరాలు కలకలం సృష్టిస్తున్నాయి. మూడురోజులుగా మంచాల, యాచారం మండలాల్లోని పలు గ్రామా ల్లో రాత్రిపూట డ్రోన్ కెమెరాలు స్వైర విహారం చేస్తున్నాయి. డ్రోన్ కెమెరాలు తిరిగిన గ్రామాల్లో ఏదో రకంగా ప్రభుత్వం భూములను సేకరిస్తుండటంతో కెమెరాలు ఎక్కడ తిరిగినా ఆ గ్రామాల్లో భూములు పోతాయని ఆందోళన వ్యక్తమవుతోంది.15రోజుల క్రితం యాచారం మండలం మొండిగౌరెల్లిలో ప్రభుత్వ భూములు డ్రోన్ కెమెరాల సాయంతో అధికారులు గుర్తించారు.
821 ఎకరాల ప్రభుత్వ పట్టా భూములను పరిశ్రమల కోసం తీసుకుంటున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం భూముల సేకరణకు నోటిఫికేషన్ జారీచేసింది. బుధ, గురువారాల్లో యాచా రం మండలం మొండిగౌరెల్లి, నల్లవెల్లి, చింతపట్ల, మం చాల మండలంలోని దాత్పల్లి, చీదేడు గ్రామాల్లో రాత్రి సమయంలో డ్రోన్ కెమెరాలు ఎగురుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఫ్యూచర్‌సిటీ ఏర్పాటులో భాగంగా గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు ఏర్పాటుకుముందు కూడా అధికారులు ఆయా గ్రామాల్లో డ్రోన్ కెమెరాలను వినియోగించారు.
కొంగరకలాన్, రావిర్యాల, గుమ్మడవెల్లి, తిమ్మాపూర్ గ్రామాల్లో గ్రీన్‌ఫీల్డ్‌రోడ్డు ఏర్పాటుకు ముందు డ్రోన్ కెమెరాల ద్వారానే భూములను గుర్తించారు. ఆ మ్యాప్ ఆధారంగానే భూములు సేకరించిన అధికారులు నోటిఫికేషన్ జారీచేసి హద్దురాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఫ్యూచర్‌సిటీ అవసరాల కోసం భూములను గుర్తిస్తున్న అధికారులు డ్రోన్ కెమెరాల వినియోగాన్ని మాత్రం దాచిపెడుతున్నారు. అధికారులే డ్రోన్ కెమెరాలను ఉపయోగించి శాటిలైట్ ద్వారా భూములు సేకరిస్తున్నట్టు సర్వే అధికారులు చెబుతుండగా….అధికారులు మాత్రం ధ్రువీకరించడంలేదు.