Telangana | సిటీబ్యూరో, (నమస్తే తెలంగాణ ) : ఎక్కడికైనా వెళ్లాలనుకున్నప్పుడు రోడ్డెక్కగానే మనం ఆటోలు, కార్ల కోసమే చూస్తాం. వాటిని నడిపించే డ్రైవరన్నలు రాత్రనకా పగలనకా కష్టపడ్డా సంపాదన అంతంతమాత్రమే. పిల్లల చదువులు, తల్లిదండ్రుల బాధ్యతలతో గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డ డ్రైవర్ల జీవితాలు తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక మారిపోయాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక కార్యక్రమాలు వారి బతుకుల్లో వెలుగులు నింపాయి. ఫైనాన్సోళ్ల బాధలు తప్పాయి. నాటి డ్రైవరన్నలు నేడు యజమానులయ్యారు. తమకు అండగా నిలబడ్డ కేసీఆర్‌కే ఈ ఎన్నికల్లో మద్దతిస్తామంటూ ముక్తకంఠంతో చెబుతున్నారు.
డ్రైవర్లంతా కారుకే జై కొడుతున్నారు. మళ్లీ సీఎం కేసీఆరేనని నినదిస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక స్కీంలతో తమకెంతగానో లబ్ధి చేకూరుతున్నదని సంబురపడుతున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు వాహనాల పన్ను రద్దు చేసిన ఘనత పెద్ద సారుకే దక్కుతుందని చెబుతున్నారు. ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల ప్రమాద బీమా అందిస్తున్నారన్నారు. తమ కుటుంబాల్లో ఉన్న వృద్ధులకు పింఛన్లు, పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్లతో పాటు రైతుబంధు వరకు ప్రతీది డ్రైవరన్నలకు కలిసొచ్చేలా ప్రభుత్వం మేలు చేస్తున్నదని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఓనర్ కమ్ డ్రైవర్ పథకం ద్వారా డ్రైవరన్నలకు కార్పొరేషన్ల ద్వారా 55 శాతానికి పైగా సబ్సిడీతో ట్యాక్సీ వాహనాలను ప్రభుత్వం అందించింది. ఆటోలకు పూర్తిగా ట్యాక్స్ మాఫీ చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కింది. ముఖ్యంగా గ్రేటర్లో ఉన్న ప్రీపెయిడ్ ట్యాక్సీ, రేడియో ట్యాక్సీ క్యాబ్‌లకు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు దృష్టిలో పెట్టుకుని కిలో మీటర్ రేటు కార్డును అమలు పరిచి ట్యాక్సీ డ్రైవరన్నలకు ఊరటనిచ్చింది. డ్రైవరన్నల విజ్ఞప్తుల మేరకు వాహన చలాన్ల రాయితీలు ఇచ్చి భరోసా కల్పిస్తున్నది.
కరోనా కష్టకాలంలో ఎంతో ఉదారతతో వారిపై ఎటువంటి భారం పడకుండా రెండు త్రైమాసికాల పన్నును ప్రభుత్వం రద్దు చేసింది. కేసీఆర్ నిర్ణయంతో రాష్ట్రంలో సుమారు 3,37,711 మంది వాహనదారులకు లబ్ధి చేకూరింది. రూ.267 కోట్లను మాఫీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ల్లో బస్సులు, లారీలు, క్యాబ్స్ తదితర వాణిజ్య వాహనాలు సుమారు 1.35 లక్షల వరకు ఉంటాయి. వీటిపై ప్రతి మూడు నెలలకోసారి మోటర్ వెహికల్ ట్యాక్స్‌ను చెల్లించాలి. వాహన కేటగిరీని బట్టి ట్యాక్స్ ధరలు నిర్ణయిస్తారు. కరోనా పరిస్థితుల కారణంగా ఈ లెక్కన గ్రేటర్లో సుమారు రూ. 135 కోట్లకు పైగా వాహన పన్నును సర్కార్ మాఫీ చేసింది.
మా డ్రైవర్లకు సీఎం కేసీఆర్ పెద్ద దికుగా నిలుస్తున్నారు. మళ్లీ ఆయనకే మా మద్దతు . కరోనా కష్టకాలంలో డ్రైవరన్నలు నలిగిపోతున్న సందర్భంలో కేంద్రం పన్నులు వసూలు చేసింది. దీంతో ఇబ్బందులు పడ్డాం. రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది.
-వేముల మారయ్య, ప్రెసిడెంట్, బీఆర్ఎస్కేవీ ఆటో యూనియన్
మేమంతా ఎప్పుడూ ఏదో చోటుకు వెళ్తూనే ఉంటాం. ఎస్సీ, ఎస్టీ మైనారిటీ డ్రైవర్స్ మిత్రులకు ఓనర్ కమ్ డ్రైవర్ పథకం ద్వారా ఏటా సబ్సిడీ రూపంలో ట్యాక్సీ వాహనాలు అందిస్తూ ప్రతి డ్రైవర్‌కు సీఎం ఒక అన్నగా నిలిచాడు. మా మద్దతు కేసీఆర్‌కే ఉంటుంది.
– నగేశ్, టీఆర్ఎస్కేవీ ట్యాక్సీ అసోసియేషన్ ప్రెసిడెంట్