వీర్నపల్లి, అక్టోబర్ 5: ఆటో నడవక.. పూట గడువక రాజన్న సిరిసిల్ల జిల్లా అడవిపదిరకు చెందిన డ్రైవర్ నాంపెల్లి సతీశ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సతీశ్ కొన్నేండ్లుగా ఆటో నడుపుతూ, కూలి పని చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో ఆటో నడపడం కష్టంగా మారింది. దీనికితోడు ఇంటి నిర్మాణానికి, ఆటో కొనడానికి చేసిన అప్పు రూ.6లక్షలు తీర్చే మార్గం లేక ఇంట్లోనే గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు గమనించి ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. సతీశ్‌ను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.
ఏఏపీ దరఖాస్తుల గడువు 11 వరకు పొడిగింపు
హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): మొత్తం 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఏఏపీ) ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ గడువును ఈ నెల 11 వరకు పొడిగించినట్టు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(టీఎస్ఎల్పీఆర్బీ) చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. వారం చివరలో వరుసగా ప్రభుత్వ సెలవులు రావడంతోపాటు ఆదివారం మధ్యాహ్నం వరకు నమోదు చేసుకున్న 7,183 మంది అభ్యర్థుల్లో కేవలం 2,193 మంది(30%) మా త్రమే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించినట్టు పేర్కొన్నారు. దీంతో ఆదివారం సాయంత్రంతో ముగిసిన గడువును 11వ తేదీ వరకు పొడిగించినట్టు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.