హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ): మహానగరాన్ని తాగునీటి గండం చుట్టుముట్టింది. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్ రంగారెడ్డి జిల్లాల పరిధిలో నీటి తండ్లాట మొదలైంది. జూలై నెల సగం గడిచినా అసలు వేసవి ముగిసిందా.. లేదా అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఇప్పటివరకు ఒక్క భారీ వాన జాడ కానరాలేదు. దీంతో ఇండ్లలో బోర్లన్నీ ఎండిపోతున్నాయి. మరోవైపు ఎల్ నినో ప్రభావంతో పరిస్థితి మరింత తీవ్రమయ్యేలా కనిపిస్తున్నది. ఇప్పటికే నగర శివారు ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. జలమండలి నుంచి నీటి సరఫరా తగ్గుముఖం పట్టింది. దీంతో ట్యాంకర్లను ఆశ్రయించాల్సి వస్తున్నది. కొన్ని ప్రాంతాల్లో మూడు, నాలుగు రోజులైనా నీరు అందడం లేదు. ఇదే అదనుగా ప్రైవేట్ ట్యాంకర్ల వ్యాపారులు రెచ్చిపోతున్నారు. వేలాది ట్యాంకర్లతో నీటిని తోడేస్తూ ఇష్టారాజ్యంగా అమ్ముకుంటున్నారు. మరోవైపు భూగర్భ జలాలు గణనీయంగా పడిపోతున్నాయి. నగరానికి తాగునీరు సరఫరా చేసే ప్రాజెక్టులకు కూడా ఎగువన వర్షాలు లేకపోవడంతో వరద రావడం లేదు. దీంతో ఇప్పటికే అన్ని ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి చేరువయ్యాయి. రాష్ట్ర సర్కార్ వెంటనే అప్రమత్తమై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోతే నగరవాసులకు తాగునీటి కష్టాలు మరింత పెరిగే అవకాశమున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పెండింగ్‌లో 17 వేలకు పైగా ట్యాంకర్లు
నగరంలో నీటి ఎద్దడి రోజురోజుకూ అధికమవుతుండటంతో ట్యాంకర్ బుకింగ్స్ గణనీయంగా పెరుగుతున్నాయి. గురువారం నాటికి ట్యాంకర్ బుకింగ్స్ 17,658పెండింగ్‌లో ఉన్నాయి. మే నెలలో బుకింగ్స్ 22 వేలు దాటిపోయింది. జూలైలో పూర్తిగా తగ్గాల్సింది పోయి ఏప్రిల్, మే నెల పరిస్థితులే ఎదురవుతున్నాయి. వేసవిలో కేవలం అపార్ట్మెంట్ వాసులే ఎక్కువగా ట్యాంకర్లు బుక్చేసుకునేవారు. కానీ నీటి ఎద్దడి పెరుగుతుండటంతో కాలనీలు, బస్తీల ప్రజలు కూడా బుక్ చేసుకుంటున్నారు. గతంలో సైబరాబాద్ పరిసరాలతో పాటు అయ్యప్ప సొసైటీ, కూకట్పల్లి, ఎస్ఆర్నగర్, జూబ్లీహిల్స్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ ప్రాంతాల ప్రజలు ట్యాంకర్లు ఎక్కువగా బుక్చేసుకునేవారు. కానీ ఇప్పుడు అది సిటీ మొత్తం విస్తరించింది. శివారు ప్రాంతాల్లో దీని తీవ్రత మరింత పెరిగింది. ముషీరాబాద్, రాంనగర్, చిక్కడపల్లితో పాటు ఉప్పల్, బోడుప్పల్, ఎల్బీనగర్, ఎన్టీఆర్నగర్, మల్కాజిగిరి ప్రాంతాల్లో గత నెల నుంచి డిమాండ్ భారీగా పెరుగుతూ వస్తున్నది. ఆయా ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వినియోగదారులు జలమండలిని డిమాండ్ చేస్తున్నారు.
5 మీటర్ల దిగువకు భూగర్భ జలాలు
వానకాలం వచ్చి రెండు నెలలు కావొస్తున్నా వర్షాలు పడకపోవడంతో భూగర్భ జలాలు ఏప్రిల్, మే కంటే దిగువకు వేగంగా పడిపోతున్నాయి. నిరుడు జూన్‌తో పోలిస్తే ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో అత్యంత దారుణంగా దాదాపుగా 5 మీటర్ల దిగువకు భూగర్భ జలాలు పడిపోయాయి. ఆమన్‌గల్, సరూర్‌నగర్, హయత్‌నగర్‌లో 1.5 మీటర్ల దాకా పడిపోయాయి. గండిపేట, రాజేంద్రనగర్‌లో ఒక మీటర్ దిగువకు పడిపోయాయి. మేడ్చల్ జిల్లాలోని కుత్బుల్లాపూర్, బాలానగర్ మండలాల్లో 2.5 మీటర్ల దిగువకు పడిపోయాయి. మేడిపల్లి, ఉప్పల్, అల్వాల్‌లో సుమారు మీటర్ వరకు దిగువకు పడిపోయాయి. హైదరాబాద్ జిల్లాలోని తిరుమలగిరి, సైదాబాద్ లో దాదాపు 2 మీటర్ల దిగువకు పడిపోయాయి. అదేవిధంగా బండ్లగూడ, అంబర్‌పేట మండలాల్లో మీటర్‌కు చేరువగా ఉన్నాయి. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లోని ఇండ్లలోని బోర్లన్నీ ఎండిపోయాయి.
వట్టిపోతున్న జలాశయాలు
మహానగరానికి మంచినీరు అందించే జలాశయాలు నిండుకుంటున్నాయి. హైదరాబాద్ జలమండలికి ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్, సింగూరు, మంజీర, అక్కంపల్లి, నాగార్జునసాగర్, శ్రీశైలం, శ్రీపాద ఎల్లంపల్లి నుంచి మంచినీటిని సరఫరా చేస్తున్నారు. ఆయా రిజర్వాయర్లలో నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి చేరువలో ఉన్నాయి. పరిస్థితులు వేసవిని తలపిస్తుండటంతో నీటి నిల్వలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. ఈనెల మొత్తం ఇదే పరిస్థితి కొనసాగితే ఎమర్జెన్సీ పంపింగ్ చేయాల్సి వస్తుంది. ఇప్పటికే సింగూరులో ఎమర్జెన్సీ పంపింగ్ చేసేందుకు అధికారులు ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. మరికొద్ది రోజుల్లో ఎమర్జెన్సీ పంపింగ్ మొదలు పెట్టనున్నారు. ఆగస్టు నాటికి కూడా వర్షాలు కురువకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఆయా రిజర్వాయర్ల నుంచి మిషన్ భగీరథకు కేటాయించిన నీటిని జలమండలికి మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
వారానికి ఒక్కసారైనా నీళ్లు రావట్లే..
మాది పిట్టల బస్తీ.. జలమండలి నుంచి సరఫరా అయ్యే మంచినీళ్లు వారానికి ఒక్కసారి కూడా రావడం లేదు. జలమండలి ట్యాంకర్ బుక్ చేసి వారం దాటినా ఇంటికి రావడం లేదు. డబ్బులునోళ్లు పైసలిచ్చి ప్రైవేట్ ట్యాంకర్లు తెప్పించుకుంటున్నరు. మా పరిస్థితి ఎవరికి చెప్పాలో అర్థం అయితలేదు. బట్టలు ఉతకడానికి, ఇతర పనులకు చింతల చెరువు నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నం. తాగునీటి బాధ ఎప్పుడు తప్పుతదో తెలియట్లె. ఎవ్వరికి చెప్పుకోవాలో తోయట్లే. లీడర్లు ఓట్లప్పుడు వచ్చి అన్నీ చెప్పిండ్రు. ఇప్పుడు మా దిక్కు ఏ ఒక్కరూ చూడట్లె..
– దరంబాయి, పిట్టలబస్తీ, బోడుప్పల్
బోరు ఎండిపాయె.. మళ్లీ పడకపాయె
ముప్పై ఏండ్లు నీళ్లిచ్చిన బోరు ఎండిపోయింది. ఇన్నేండ్ల నుంచి ఇలాంటి పరిస్థితి ఎన్నడూ రాలేదు. జలమండలి నుంచి వచ్చే నల్లా నీరు ఏమాత్రం సరిపోతలేదు. ఇంటి అవసరాలకు చాలీచాలని నీటితో ఇబ్బందులు పడుతున్నం. ట్యాంకర్ బుక్ చేసినా సమయానికి రావడం లేదు. నీటి కొరత తీవ్రంగా ఉందని మళ్లీ బోరు వేయించాం. అయినా నీళ్లు పడలేదు. వర్షాలు పడకపోవడంతో సమస్య తీవ్రంగా ఉన్నది. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు.
-వసంత, బాలాజీనగర్, ముషీరాబాద్
ట్యాంకర్లు అత్యధికంగా పెండింగ్‌లో ఉన్న ఏరియాలు(బుధవారం నాటికి)

