వనపర్తి : కాంగ్రెస్ పాలనలోవర్షాకాలంలోనూ నీటి ఎద్దడి తప్పడం లేదని, వెంటనే మంచినీటిని(Drinking water) సరఫరా చేయాలని మహిళలు డిమాండ్ చేశారు. సోమవారం వనపర్తి జిల్లా అమరచింత పట్టణంలోని (Amarachinta town) బీసీ కాలనీలోని 6,7వ వార్డుకు చెందిన మహిళలు, యువకులు ఖాళీ బిందెలతో ప్రధాన రహదారిపై ఆందోళన(Women protest) చేపట్టారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, ప్రజాపంథా నాయకులు వీరికి మద్దతు తెలియజేశారు. మహిళల ఆందోళనలతో రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
మున్సిపల్ చైర్పర్సన్ మంగమ్మ, కమిషనర్ నూరుల్ నజీబ్ అక్కడకు వచ్చి నీటి సమస్యను పరిష్కరి స్తామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, వారు వీసీలో ఉండడంతో మున్సిపల్ మేనేజర్ కృష్ణయ్య అక్కడకు చేరుకొని సమస్యను తెలుసుకున్నారు. మదనాపురం మండలం ఎర్రగట్టు వద్ద మిషన్ భగీరథ ట్యాంక్ నుంచి అమరచింతకు నీటి సరఫరా నిలిచిపోవడంతో ఎద్దడి తలెత్తినట్లు తెలుసుకున్నారు. సమస్య పరిష్కారమయ్యే వరకు ట్యాంకర్ల ద్వారా రెండు వార్డులకు నీటిని సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించి ఆందోళన విరమించారు.