తాగునీటి కష్టాలు ఊళ్లకు ఊళ్లకే తలవంపులు తెస్తున్నాయి. ఎన్నో విపరిణామాలకు దారితీస్తున్నాయి. ఊరంతటికీ గడ్డు పరిస్థితులను తెచ్చి పెడుతున్నాయి. ఇక్కడ ఏకంగా ఆ ఊరి యువకులకు ఆడపిల్లలను ఇచ్చేందుకే వెనుకాడుతున్నారు. ఆ ఊళ్లో ఉన్న తాగునీటి గోస తమ బిడ్డ పడొద్దనే ఆ తల్లిదండ్రులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా సుంగాపూర్ గ్రామ గిరిజనులకు ఈ దుస్థితి ఎదురైంది. దీంతో ఊరంతా ఏకమై ఖాళీబిందెలు చేతబట్టి కలెక్టరేట్‌కు తరలివెళ్లారు. ఈ పరిస్థితి ఒక్క సుంగాపూర్దే కాదు.. రాష్ట్రంలోని ఊరూరా ప్రజలు ఇదేరీతిన తాగునీటికి తహతహలాడుతున్నారు.
ఆదిలాబాద్, మార్చి17 (నమస్తే తెలంగాణ)/ఇల్లెందు/చర్ల/తరిగొప్పుల/భైంసా/ఏటూరునాగారం: ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గ్రామాల్లో తాగునీటి కష్టాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాగునీటి సమస్య ఉన్న గ్రామాలకు ఆడపిల్లలను ఇస్తే తమ బిడ్డ నీటిని మోస్తూ కష్టపడుతుందని తల్లిదండ్రులు ఆ గ్రామాలతో వివాహ సంబంధాలు ఏర్పర్చుకోవడం లేదు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం సుంగాపూర్‌లో 1500 జనాభా ఉంటుంది. గ్రామ పరిధిలో చెరువులు లేవు. గ్రామమంతటికీ ఒకటే చేతిపంపు ఉన్నది. దీంతో సాగు, తాగునీటి సమస్య ఆ ఊరిని చుట్టుముట్టింది. వ్యవసాయ పనులు మానుకొని ఊరు ఊరంతా పొద్దంతా తాగునీటిని మోయాల్సి వస్తుంది. తాగునీటి సమస్య పరిష్కరించాలని ప్రజాప్రతినిధులను, అధికారులను కోరినా ఫలితం రాలేదు.
మిషన్ భగీరథ నీరు రెండురోజులకు ఒకసారి వస్తున్నా.. అదీ పూర్తిస్థాయిలో రావడం లేదు. గ్రామంలో తాగునీటి ఇక్కట్ట కారణంగా తమ గ్రామంలో యువకులకు ఆడపిల్లలను ఇవ్వడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీంతో నీటి సమస్య పరిష్కారానికి ఊరంతా కదిలింది. సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్‌కు ఖాళీబిందెలతో వెళ్లి ప్రజావాణిలో దరఖాస్తును అందజేశారు. గ్రామస్థులు తమ ఊరి దుస్థితిని కలెక్టర్‌కు ఏకరువు పెట్టారు. తమ సమస్యను విన్న కలెక్టర్ సానుకూలంగా స్పందంచారని తెలిపారు. నీటి సమస్య కారణంగా తమ గ్రామానికి ఆడపిల్లలను ఇవ్వడానికి ఇతర గ్రామాల తల్లిదండ్రులు ఇష్టపడడం లేదని సుంగాపూర్‌కు చెందిన రాథోడ్ సుజన్ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తంచేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం పాతర్లగడ్డ గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజనులు సోమవారం ఖాళీ బిందెలతో రహదారిపై నిరసన తెలిపారు. బోర్లలో నీరు ఇంకిపోయిందని, మిషన్ భగీరథ నీళ్లు నెల రోజులుగా రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. పంచాయతీ ట్యాం కర్లతో నీటిని సరఫరా చేయక, తామే ఇంటికి కొంత జమ చేసి ట్యాంకర్‌తో నీళ్లు తెప్పించుకుంటున్నామని తెలిపారు. చర్ల మండలం ఆర్ కొత్తగూడెంలో ఎస్సీ కాలనీవాసులు తాగునీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. జనగామ జిల్లా తరిగొప్పుల మం డలం అంకుషాపుర్ బంజరుపల్లి కాలనీలో 15 రోజులుగా మంచినీళ్లు రాకపోవడంతో సోమవారం కాలనీ మహిళలు ఖాళీ బిందెలతో రాస్తారోకో చేశారు. నిర్మల్ జిల్లా భైంసా కమ్మర్గల్లిలో సోమవారం మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. మిషన్ భగీరథ నీరు రెండు రోజులుగా రావడం లేదని, మున్సిపల్ సిబ్బంది బోరు మోటర్లు తీసివేయడంతో నీటి కష్టాలు తప్పడం లేదని ఆందోళనకు దిగారు.
తమకు తాగునీరు, విద్యుత్తు సౌకర్యం కల్పించాలని కోరుతూ ములుగు జిల్లా వాజేడు మండలం పూసూరు గ్రామంలో గుడిసెల్లో నివాసముంటున్న గిరిజనులు కాలినడకన 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐటీడీఏ కార్యాలయానికి చేరుకొని ధర్నా నిర్వహించారు. ఐటీడీఏ పీవో చిత్రమిశ్రాకు వినతిపత్రం సమర్పించారు. ఉదయం 7 గంటలకు బయలుదేరిన గ్రామస్థులు మధ్యాహ్నం 12.30 గంటలకు చేరుకున్నారు. నెత్తిన ఖాళీ బిందెలతో ప్రదర్శనగా తరలివచ్చారు. దీంతో స్పందించిన పీవో సంబంధిత అధికారులతో మాట్లాడి తాగునీరు, విద్యుత్తు సదపాయం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.