హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో తాగునీటి ఎద్దడిపై అసెంబ్లీ వేదికగా సర్కార్ తీరును ప్రతిపక్ష సభ్యులు ఎండగట్టారు. ప్రభుత్వ డ్యాష్‌బోర్డులో రాష్ట్రంలోని 98 శాతం ఇండ్లకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందుతున్నట్టు అధికారులు రికార్డుల్లో చూపుతున్నారని, కానీ 50 శాతం ఇండ్లకు కూడా తాగునీరు చేరడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ రికార్డులకు, గ్రామాల్లోని వాస్తవ పరిస్థితులకు పొంతనే లేదని ధ్వజమెత్తారు.
బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా శనివారం ప్రతిపక్ష సభ్యులు సభలో లేవనెత్తిన ప్రధానాంశాలు ప్రభుత్వ వైఫల్యాన్ని వేలెత్తి చూపాయి. అధికారుల గణాంకాలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. అత్యవసరంగా బోర్లు వేద్దామన్నా ఎమ్మెల్యేలు, కలెక్టర్ల వద్ద నిధుల్లేవని విమర్శించారు. ఫలితంగా ఎన్నో తాగునీటి పథకాలు అటకెకాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సీతక ‘కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చి సహకరిస్తేనే గ్రామాలను అభివృద్ధి చేస్తాం’ అని పేరొనడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. గ్రామ కార్యదర్శులకు రూ.50 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉన్నట్టు మంత్రి అసెంబ్లీ సాక్షిగా అంగీకరించారు. ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు తాగునీటి కోసం మైళ్ల దూరం నడుస్తున్నా.. ప్రభుత్వం కేంద్ర నిధుల కోసం ఎదురుచూడటంపై నిరసన వ్యక్తమవుతున్నది. నీటి ఎద్దడిని పరిషరించడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): మహిళల్లో ఉద్యోగం చేయడానికి అభద్రతాభావంతో ఉన్నారని మంత్రి సీతక్క అన్నారు. మహిళా భద్రతపై అసెంబ్లీలో శనివారం జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉద్యోగాలు, ఉపాధి, పెండ్లి పేరుతో మహిళలను వంచిస్తూ, అక్రమ రవాణాకు పాల్పడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం మంచి పాలసీ తీసుకొస్తున్నదని చెప్పారు. మహిళలను లైంగికంగా వేధిస్తే.. ఎలాంటి కఠిన చర్యలు ఉంటాయో చిన్ననాటి నుంచే అవగాహన కల్పించాలని కోరారు. ముఖ్యంగా మహిళల పట్ల ప్రవర్తించాల్సిన విషయాలపై శిక్షణ ఇస్తూనే.. వేధింపులపై పడే శిక్షల గురించి పాఠ్యాంశాల్లో ఉండాలని పేర్కొన్నారు.