Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ): సాగునీళ్లు కరువై పంట పొలాలు నెర్రెలుబారుతుంటే, పచ్చని పంటలు పశువులకు మేతగా మారుతుంటే, ఇవేవీ వ్యవసాయ శాఖకు కనిపించడం లేదు. రాష్ట్రంలో ఒక్క ఎకరం పంట కూడా ఎండలేదంటూ వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించినట్టు తెలిసింది. గతంలో సుమారు లక్ష ఎకరాలు ఎండిపోయినట్టు నివేదిక రూపొందించిన వ్యవసాయ శాఖ, ఇప్పుడు ఆ నివేదికను పక్కనపెట్టి ఒక్క ఎకరం కూడా ఎండలేదంటూ మరో కొత్త నివేదికను తయారుచేసినట్టు సమాచారం. కానీ, క్షేత్రస్థాయిలో వాస్తవాలు విరుద్ధంగా ఉన్నాయి. సాగునీళ్లు కరువై లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. పంటలను కాపాడుకునేందుకు రైతన్నలు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. బిందెలతో, నీళ్ల ట్యాంకర్లతో సాగునీళ్లు అందిస్తూ వాటిని కాపాడుకొనేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
ఎండిన పంటలు కనిపించడం లేదా?
రాష్ట్రవ్యాప్తంగా ఏ మూలకు వెళ్లి చూసినా ఎండిన పంట పొలాలు దర్శనమిస్తాయి. పొట్ట దశకు వచ్చిన వరికి సాగునీళ్లు కరువై రైతులు మధ్యలోనే వదిలేస్తున్నారు. కోతకు రాకముందే కోసేసి.. పశువులకు మేతగా వేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నది. కానీ, ఇవేవీ వ్యవసాయ శాఖకు కనిపించడంలేదు. ప్రభుత్వ ప్రణాళిక లేమి, ముందుచూపులేని విధానాలతో ఇప్పటికే రా ష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. నిరుడు ఇదే సమయంలో భూగర్భ జలాల లోతు 7.34 మీటర్లు ఉండగా, ప్రస్తుతం ఇది 8.70 మీటర్లకు పడిపోయింది. ఏ ప్రాజెక్టును చూసినా డెడ్ స్టోరేజీకి చేరుకున్నది. ప్రాజెక్టులు ఎండిపోవడం, భూగర్భ జలాలు పడిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా బా వులు, బోర్లు వట్టిపోతున్నాయి. మొన్నటివరకు మూడు నాలుగు ఎకరాలకు నీరందించిన బోరు.. ఇప్పుడు అర ఎకరానికి కూడా నీళ్లు అందించలేకపోతున్నది.
వడగండ్ల నష్టంపైనా గప్చుప్
ఎండిన పంటలను, రైతున్నల గోడును విస్మరించిన కాంగ్రెస్ సర్కారు.. వడగండ్ల వర్షాలతో జరిగిన పంట నష్టంపై కూడా అదే ధోరణి ప్రదర్శిస్తున్నది. మార్చి 21న, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వడగండ్ల వానలు కురిశాయి. పలుచోట్ల వరి, మక్కజొన్న, ఇతర పంటలు దెబ్బతిన్నాయి. 13 జిల్లాల్లో 11,298 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. పంట నష్ట పోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే, వర్షాలు పడినప్పుడు పంట నష్టం జరిగిందని, సర్వే చేస్తామంటూ హడావుడి చేసిన సర్కారు ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. రెండు బావులు లీజుకు తీసుకున్నా లాభం లేదుసాగునీరు చుట్టపు చూపుగా వస్తుండటంతో యాసంగి సాగుపై అన్నదాతల ఆశలు ఆవిరవుతున్నాయి. చేతికొచ్చిన వరి ఎండిపోతుండటంతో మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం గోల్బొడ్కతండా జీపీ పరిధిలోని చర్లచంద్రుతండాకు చెందిన రైతు బానోత్ చంద్రశేఖర్ 3 ఎకరాల పొలం ఎండిపోకుండా ఉండేందుకు రెండు బావులను రూ.20 వేలకు లీజుకు తీసుకున్నా పొలం పారడం లేదని ఆవేదన చెందుతున్నాడు. ఇంత కష్టం ఎప్పుడూ పడలేదని, కాంగ్రెస్కు ఓటు వేసి తప్పుచేశానని చంద్రశేఖర్ వాపోయాడు. -నర్సింహులపేట
పంట ఎండి.. కడుపు మండి..
నీళ్లు అందక కండ్ల ముందే పంట ఎండిపోతుండటంతో ఓ గిరిజన రైతు కడుపు మండింది. కన్నీటి పర్యంతమవుతూ పంటకు ఇలా నిప్పుపెట్టాడు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామానికి చెందిన గుగులోత్ గోర్యా.