Basharat Khan | హైదరాబాద్/సిటీబ్యూరో, మే 16 (నమస్తే తెలంగాణ): వంద కోట్ల రూపాయల పన్ను ఎగవేత కేసులో లగ్జరీ కార్ల విక్రేత బషారత్ ఖాన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు గురువారం సూరత్‌లో అరెస్ట్ చేశారు. విజయనగర్ కాలనీకి చెందిన బషారత్ఖాన్ హైదరాబాద్ కేంద్రంగా గచ్చిబౌలిలో లగ్జరీ కార్లను విక్రయిస్తూ వంద కోట్ల కస్టమ్స్ డ్యూటీ ఎగవేసినట్టు డీఆర్ఐ అధికారులు శుక్రవారం వెల్లడించారు. ఖాన్ అమెరికా, జపాన్ నుంచి లగ్జరీ కార్లను కొనుగోలుచేసి దుబాయ్, శ్రీలంకకు తరలించేవాడని తెలిపారు.
అక్కడ వాటిని లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ నుంచి భారత రవాణా చట్టాలకు అనుగుణంగా రైట్ హ్యాండ్ డ్రైవ్‌గా మార్పులు చేసి తప్పుడు డా క్యుమెంట్లు, ఇన్వాయిస్లతో దేశంలోని దిగుమతి చేసేవాడని వివరించారు. ఈ పద్ధతిలో ఇప్పటివరకు 30వరకు ఖరీదైన కార్లను దిగుమతి చేసుకొని ఇతరులకు విక్రయించినట్టు గుర్తించారు. ఈ క్రమంలో కస్టమ్స్ సుంకాన్ని 50శాతం వరకు ఎగవేసినట్టు తెలిపారు.
గత పదేండ్లుగా లగ్జరీ కార్ల షోరూమ్‌ను నిర్వహిస్తున్న బషారత్ఖాన్ హమ్మర్ ఈవీ, క్యాడిలాక్ ఎస్కలేడ్, రోల్స్‌రాయిస్, లెక్సస్, టయోటా ల్యాండ్‌క్రూజర్, లింకన్ నావిగేటర్ వంటి ఖరీదైన మోడల్స్ విక్రయించాడని పేర్కొన్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే 8 కార్లను విక్రయించిన ఖాన్ తెలంగాణ ప్రభుత్వానికి రూ.7 కోట్లకుపైగా పన్ను ఎగవేసినట్టు గుర్తించారు. ఇక దేశవ్యాప్తంగా ఈ కుంభకోణం మొత్తం రూ.100 కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ కార్ల క్రయవిక్రయాల్లో భారీగా చేతులు మారినట్టు గుర్తించిన ఈడీ సైతం ఈ కేసుపై కన్నేసినట్టు తెలిసింది. బషారత్ఖాన్ అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపేందుకు ఈడీ కూడా ఈసీఐఆర్‌ను నమోదు చేసినట్టు సమాచారం.
బషారత్ఖాన్కు తెలంగాణ ముఖ్య నేత అనుచరులతో సంబంధాలు ఉన్నట్టు డీఆర్ఐ అధికారులు గుర్తించినట్టు తెలిసింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ యువ ఎంపీ, యువ ఎమ్మెల్యేతోపాటు, మరో కాంగ్రెస్ ఎంపీతో కూడా సంబంధాలున్నట్టు గుర్తించారని సమాచారం. ఆ యువ ఎమ్మెల్యే లగ్జరీ కార్లను నిత్యం మారుస్తూ ఉంటాడని చెప్పుకుంటున్నారు. లగ్జరీ కార్లకు పన్ను విషయంలో ఎవరైనా అధికారులు అడ్డుపడితే.. వారిని నయానో.. భయానో లొంగదీసుకోవడం ముఖ్య నేత పక్కన తిరిగే ఆ మైనార్టీ నేతకు వెన్నెతో పెట్టిన విద్యగా ఆరోపణలు ఉన్నాయి.
కార్లు మార్చే పనులన్నీ బషారత్ఖాన్ చూసుకుంటే.. అందుకు కావాల్సిన బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ మొత్తం ఆయనే చూసుకుంటారట. మరో కాంగ్రెస్ ఎంపీతో కూడా ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయని.. దేశవ్యాప్తంగా వ్యాపారం సాగించడంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆ ఇద్దరు ఎంపీలు కీలకపాత్ర పోషిస్తారని తెలిసింది. ఈ క్రమంలో బషారత్ఖాన్ నిత్యం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి విమానాల్లో తిరుగుతుంటాడని, అక్కడ బేరసారాలు కుదిరిన తర్వాత కారును డెలివరీ చేస్తాడని డీఆర్ఐ అధికారులు గుర్తించారు.
టాలీవుడ్‌కు చెందిన ఇద్దరు ప్రముఖ హీరోలు బషారత్ఖాన్ నుంచి లగ్జరీ కార్లను కొనుగోలు చేశారని విశ్వసనీయ సమాచారం. ఈ విషయం అధికారుల దర్యాప్తులో తేలినట్టు తెలిసింది. తన వ్యాపార భాగస్వామి డాక్టర్ అహ్మద్‌తో కలిసి అక్రమంగా దిగుమతి చేసుకున్న లగ్జరీ కార్లను ఫామ్‌హౌస్‌లో ఉంచేవారని, కొనుగోలు చేసిన కార్లకు పన్నుల బాధ లేకుండా నగదు రూపంలోనే వసూలుచేసే వా రని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఖాన్‌ను అహ్మదాబాద్‌లో జ్యుడీషియల్ కస్టడీకి తరలించిన అధికారులు, తదుపరి దర్యాప్తు జరుగుతున్నదని తెలిపారు.
బషారత్ఖాన్ మొదట్లో చిన్నచిన్న కార్లు విక్రయించేవాడు. అతనికి రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడిన తర్వాత ఖరీదైన కార్లను విక్రయించడం ప్రారంభించాడు. బషారత్ తన షోరూమ్‌లోని పలు కార్లను రాజకీయ నాయకులు ఉపయోగించేలా రూపొందించేవాడు. ఈ క్రమంలో అతడు పలువురు పార్లమెంటు సభ్యులతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకున్నాడు. డాక్టర్ అహ్మద్‌తో కలిసి హైఎండ్ కార్లను నకిలీ పత్రాలతో దిగుమతి చేసుకునేవారు. బ్లాక్‌మనీని వైట్‌మనీగా మార్చడానికి కార్లను నగదు తీసుకొని విక్రయించేవారు.